సాహితీస్ఫూర్తి భాగ్యరెడ్డివర్మ

edt

దేశవ్యాప్తంగా అంబేద్కర్ కన్నా ముందు జాతీయ నాయకుడిగా గుర్తింపు పొందిన సామాజిక ఉద్యమకారులు, చైతన్యశీలి మాదరి వెంకట భాగ్యరెడ్డి వర్మ. హైదరాబాద్ కేంద్రం గా దళితోద్యమాలకు శ్రీకారం చుట్టి దేశవ్యాప్తంగా స్ఫూర్తిని పంచిన వెలుగు రేఖ. మొత్తం దళిత జాతి ప్రతినిధిగా అంబేడ్కర్‌ని గుర్తించి ఆయన్ని లండన్‌లో జరుగనున్న రెండో రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్‌కు పంపించాలని లక్నోలో జరిగిన ‘అఖిల భారత నిమ్నజాతుల రాజకీయ మహాసభ’లో తీర్మానించినారు. ఈ సభకు అధ్యక్షత వహించింది, ఆ తీర్మానాన్ని ప్రతిపాదించిందీ భాగ్యరెడ్డివర్మ. 1906లో జగన్మిత్ర మండలి స్థాపించి దళితుల అభ్యున్నతికి, అసృ్పశ్యతా నివారణకు, మద్యపానానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేసినాడు. ఒక్క హైదరాబాద్‌లోనే గాకుండా, ఆంధ్రప్రదేశ్, రాయలసీమల్లో కూడా దళితోద్యమాలకు పునాదులు వేసిన వాడిగా, ఆది హిందూ ఉద్యమాన్ని నడిపించిననవాడిగా గుర్తిం పు పొందినాడు. భాగ్యరెడ్డి వర్మ ఉద్యమకారుడే కాదు సాహితీవేత్త కూడా. ‘ఆదిహిందూ’‘భాగ్యనగర్’ పత్రికల నిర్వహణ ద్వారా ఒక వైపు సంపాదకుడిగా పేరుపొందినాడు. 1912లో మొదటిసారిగా ఆంధ్రపత్రికలో వ్యాసాలను ప్రకటించాడు. బహుశా తెలుగులో వ్యాసాలు రాసిన తొలి దళితుడు కూడా భాగ్యరెడ్డి వర్మ కావచ్చు. మరోవైపు వివిధ పత్రికల్లో రచనల ద్వారా సాహితీవేత్తగా గుర్తింపు పొందినాడు. ఈయన రాసిన ‘వెట్టిమాదిగ’ తెలంగాణ నుంచి దళితుడు రాసిన మొదటి కథగా రికార్డయింది. ఇదే గాకుండా ‘గణపతి తత్వము’ అనే ప్రహసనాన్ని కూడా రాసినాడు. భాగ్యరెడ్డి వర్మ రాసిన కొన్ని కవితలు ‘భాగ్యనగర్’ పత్రికలో చోటు చేసుకున్నాయని ఇటీవల తాను వెలువరించిన పుస్తకంలో దళిత అధ్యయన వేత్త జంగం చిన్నయ్య పేర్కొన్నారు. అలాగే ఆయన సంపాదకీయాలు కూడా ఆచార్య సుధారాణి పూనికతో వెలువడుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు. భాగ్యరెడ్డి వర్మ చనిపోయిన తర్వాత చాలా మంది ఆయన అనుయాయులు ఆదిహిందూ సాంఘిక సేవాసమితికి శాఖలను ఏర్పాటు చేసినారు. భాగ్యరెడ్డివర్మ ప్రభావంతో తెలుగునాట రచనలు చేసినవారు కూడా ఎందరో ఉన్నారు. భాగ్యరెడ్డి వర్మ స్ఫూర్తితో ఆయన సామాజిక, సాహిత్య ఉద్యమ పరంపరను కొనసాగిస్తూ అస్పృశ్యతా నివారణకు కృషి చేసినవారిలో అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, హైదరాబాద్ ఇట్లా భిన్న ప్రాంతాల నుంచి అనేక మంది రచనలు చేసినారు. ఇందులో నాటకాలు, బుఱ్ఱకథలు, వ్యాసాలు, కవిత్వం ఉన్నా యి. ఇవి చాలా వరకు భాగ్యరెడ్డి వర్మ చనిపోయిన తర్వాత అచ్చయ్యాయి. ఒక్క ‘మాలపల్లి’ మాత్రం ఆయన జీవిత కాలంలోనే అచ్చయింది. ‘మాలపల్లి’ నవలను ఉన్నవ లక్ష్మినారాయణ రాసినాడు. దీన్ని 1922 ఆ ప్రాంతంలో ఆయన జైలులో రాసినాడు. ఈ నవలకు స్ఫూర్తి 1917లో భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షతన విజయవాడలో 1917లో జరిగిన ‘ఆదిహిందూ మహాసభ’. ఆ తర్వాత ప్రతి యేటా భాగ్యరెడ్డి వర్మ ఆంధ్రాప్రాంతంలోని వివిధ ప్రదేశాల్లో ఏర్పాటైన సభల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యేవాడు. అందుకే భాగ్యరెడ్డిని ఒక ముఖ్యపాత్రగా తీసుకొని ఉన్నవ ‘మాలపల్లి’ నవలను రాసిండు. ఈ పరంపరలోనే ఇప్పుడు మనమిక్కడ చర్చించుకుంటున్న ‘అస్పృశ్యతా నివారణము’ అనే బుఱ్ఱకథ వెలువడింది. భాగ్యరెడ్డి వర్మ కుమారుడు,హైదరాబాద్ అసెంబ్లీ సభ్యుడైన ఎం. బి.గౌతవ్‌ు పూనిక మేరకు ముద్రితమైన ఈ బుఱ్ఱకథను రాసింది ఓగిరాల సుబ్బరాయశర్మ. హైదరాబాద్,సుల్తాన్‌బజార్‌లోగల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానాంధ్రాధ్యాపకులుగా పనిచేసిన ఈయన భాగ్యరెడ్డి వర్మను చాలా దగ్గరగా చూసినాడు. మాడపా టి, భాగ్యరెడ్డివర్మలతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఆ అనుభవంతో ఈ బుఱ్ఱకథను రాసినాడు.అంబేద్కర్ తీర్చిదిద్దిన భారత రాజ్యాంగంలో అస్పృశ్యతా నివారణను కూడా పేర్కొనడం జరిగింది. దీనికి విసృ్తత ప్రాచుర్యం కల్పించే ఉద్దేశ్యంతో ‘ఆదిహిందూ సాంఘిక సేవాసమితి’ ప్రచురణల విభాగం వారు పుస్తకాన్ని ముద్రించారు.ఈ సమితిని భాగ్యరెడ్డి వర్మ స్థాపించడమే గాకుండా దాని తరపున అనేక పుస్తకాలను వెలువరించాడు. 1955లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎం.వి. గౌతవ్‌ు ఈ బుఱ్ఱకథ ప్రదర్శనను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినాడు.
ఈ బుఱ్ఱకథ ప్రారంభ ఇలా ఉన్నది.
“…బుద్ధదేవునీ త్రిశరణంబులను బుద్ధిని భావించీ తందాన తాన
శంకర, రామానుజ దేశికులకు, సాగిలిపడి మ్రొక్కీ..,,
పండితారాధ్య బసవేశ్వరులను భావమందు దలచీ,,
తుక్కారాం, చైతన్య, రామకృష్ణులకును భక్తి సలిపీ ,,
తిరుప్ఫణాళ్వార్ నందనారులకు శిరము వంచి మ్రొక్కీ,,
చొఖామేళు హరిదాస ఠాకురుకు జోహరులర్పించీ,,
శ్రీరంగేశుని భక్తుడైన యా పాణయోగి కెరగీ,,
బ్రహ్మనాయకుని కన్నమదాసును క్రమముగా భావించీ,,
వివేకానంద రామమోహన రాయల మదినెంచీ,,
కాశీపండిత ఆచార్య రుద్ర శాస్త్రుల భూషించీ,,
మదనమోహన మాలవ్యా, మాననీయు దలచీ,,
హరిజనోద్ధరణ కాహుతియైన అమ్మహాత్ము గొలిచీ ,,
ఆది హిందు సేవా సంఘసమితి భాగ్యరెడ్డి దలచీ ,,
గాంధీ సహచరు ఠక్కరుబాపా ఘనసేవల నెంచీ,,
జగజీవనరాం బహుత్యాగములను దలచీ” అంటూ బుఱ్ఱ కథను ప్రారంభించినాడు. ఇందులో వచనములో భగవత్ ప్రార్థనన తో గాకుండా వ్యక్తుల పొగడ్తలతో ప్రారంభం చేయడానికి గల కారణాలను వంతలు లేవనెత్తుతారు. వారికి జవాబును కథకుడు చెబుతాడు. ఇదంతా ఒక ప్రణాళిక బద్ధంగా అసృ్పశ్యత నివారణకు ఉపయోగించుకున్నాడు.క్రీ.పూ.2500 సంవత్సరాల నుంచి క్రీ.శ. 1955 నాటి వరకు సంఘసంస్కరణను, సామాజిక విప్లవకారులను గర్వంగా గుర్తుకు తెచ్చిండు. సనాతనుల జాఢ్యా న్ని తుత్తునియలు చేసినాడు. భాగ్యరెడ్డి వర్మ, అంబేడ్కర్, జగజ్జీవన్‌రావ్‌ులను ఇందులో స్మరించుకున్నాడు. అయితే ఇప్పటి వరకు ఇలాంటి రచనలను తెలుగు సాహిత్యంలో చర్చకు పెట్టలేదు. దళితోద్య మ నేపథ్యంలో ఈ పుస్తకాన్ని పున:సమీక్షించాలి. అంతేగాకుండా ఈ పుస్తకాన్ని పునర్ముద్రించినట్లయితే చరిత్రలో ఎన్నో విషయాలకు జవాబులు దొరుకుతాయి. అం తేగాకుం డా దళితోద్యమానికి, దళిత సాహిత్యానికి కొత్త ఊ పుని చూపును ఇచ్చినట్లయితది. సామాజిక చరిత్ర కు చుక్కానిగా ఉంటుంది. అందుకే భాగ్యరెడ్డి వర్మ స్ఫూర్తి తో ప్రచురితమైన ఈ బుఱ్ఱకథను ఆయన 130వ జయం తి (22 మే, 2018) సందర్భంగా పరిచయం చేస్తున్నాను.

సంగిశెట్టి శ్రీనివాస్
9849220321