సారోళ్లు లేకపోతే చదువులెలా సాగేది?

ప్రశ్నార్థకంగా పాలిటెక్నిక్ విద్య లెక్చరర్స్‌ను నియమించాలని కలెక్టరేట్ ముందు విద్యార్థుల ధర్నా ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్‌కు విద్యార్థుల ఫిర్యాదు మన తెలంగాణ/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలోని కెడిఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి, రెండవ, మూడవ సంవత్సరం చదివే విద్యార్థులకు గత రెండు నెలలుగా లెక్చరర్స్ లేకపోవడంతో పాలిటెక్నిక్ విద్య ప్రశ్నార్థకంగా మారింది. పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ బ్రాంచిల్లో 150 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గత ఏడాది 9 మంది లెక్చరర్స్ అవసరం ఉండగా కేవలం […]

ప్రశ్నార్థకంగా పాలిటెక్నిక్ విద్య
లెక్చరర్స్‌ను నియమించాలని కలెక్టరేట్ ముందు విద్యార్థుల ధర్నా
ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్‌కు విద్యార్థుల ఫిర్యాదు

మన తెలంగాణ/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలోని కెడిఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి, రెండవ, మూడవ సంవత్సరం చదివే విద్యార్థులకు గత రెండు నెలలుగా లెక్చరర్స్ లేకపోవడంతో పాలిటెక్నిక్ విద్య ప్రశ్నార్థకంగా మారింది. పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ బ్రాంచిల్లో 150 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గత ఏడాది 9 మంది లెక్చరర్స్ అవసరం ఉండగా కేవలం నలుగురు లెక్చరర్స్‌తోనే విద్యాబోధన జరిగిందని, ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో గత ఏడాది పని చేసిన లెక్చరర్స్ బదిలీ కావడంతో ప్రస్తుతం మొదటి, రెండవ, మూడవ సంవత్సరం విద్యార్థులకు చదువుచెప్పేందుకు ఒకే ఒక లెక్చరర్ ఉన్నారని అతను కూడా గత వారం రోజులుగా తరగతులకు రావడం లేదని విద్యార్థులు తెలిపారు. ఎన్నో ఆశలతో పాలిటెక్నిక్ విద్యను ఎంచుకున్న తమకు లెక్చరర్స్ కొరత కారణంగా విద్య కుంటుపడుతుందని, వెంటనే జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి వనపర్తి కెడిఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ బ్రాంచ్‌కు లెక్చరర్స్‌ను నియమించాలని కోరుతూ సోమవారం విద్యార్థులు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. దాదాపు గంట పాటు 150 మంది విద్యార్థులు ధర్నా చేపట్టారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్ చంద్రయ్యకు అందజేశారు.
లెక్చరర్స్‌ను నియమించి చదువు చెప్పించండి : శిల్ప, విద్యార్థిని, సివిల్ తృతీయ సంవత్సరం
ఇంజనీరింగ్‌కు బదులు సమాన విద్య అయిన సివిల్ పాలిటెక్నిక్ విద్యను అభ్యసిస్తున్నాను. లెక్చరర్స్ లేకపోవడంతో విద్య ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది యూనిట్ పరీక్షలు దగ్గర పడుతున్నా నేటికీ సిలబస్ ప్రారంభం కాలేదు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎంట్రెన్స్ పరీక్షలు ఉంటాయని ఇలాగే ఉంటే మా చదువులు పూర్తిగా కుంటుపడతాయి. వెంటనే అధికారులు, సివిల్ ఫ్యాకల్టీ సిబ్బందిని నియమించాలి.

Comments

comments

Related Stories: