సాయి శ్రీనివాస్ పెద్ద హీరోగా ఎదగాలి

Saaksham

అల్లుడు శీను, స్పీడున్నోడు, జయ జానకి నాయక చిత్రాలతో ప్రేక్షకుల్లో మాస్ ఇమేజ్‌ను సృష్టించుకున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అతను నటించిన తాజా చిత్రం ‘సాక్షం’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.  శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక.  హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో సినిమాలోని ‘డెస్టినీ…’ పాటను వి.వి.వినాయక్ విడుదల చేశారు. అనంతరం పాటలు, ట్రైలర్‌లను స్క్రీన్‌పై ప్రదర్శించారు. ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ “అల్లుడు శీను చిత్రం విడుదలై నాలుగేళ్లు అయిందంటే నమ్మలేకుండా ఉన్నాను. సినిమా సినిమాకు సాయి శ్రీనివాస్‌లో మంచి పరిణతి కనిపిస్తోంది. అతను భవిష్యత్తులో పెద్ద హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాను. పూజా హెగ్డే ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ.  ట్రైలర్ బాగుంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఆశిస్తున్నాను”అని అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ “హీరోగా నా నాలుగవ సినిమా ‘సాక్షం’. అభిషేక్ ఈ చిత్రాన్ని లావిష్‌గా నిర్మించారు. శ్రీవాస్ మంచి కథతో అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంటానన్న నమ్మకముంది”అని తెలిపారు. హీరోయిన్ పూజా హెగ్డే మాట్లాడుతూ “ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. ఇందులో కొత్త పాత్రలో నటించాను”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అభిషేక్ నామా పాల్గొన్నారు.