సస్యశ్యామలంగా తెలంగాణా

రాత్రికి రాత్రే అద్భుతాలు సృష్టించడానికి ప్రభుత్వాల వద్ద మంత్రదండాలు వుండవు. అయితే పట్టుదల, చిత్తశుద్ధి, అంకితభావం కలిగిన పాలకులకు ఎటువంటి మంత్రదండాలు, అల్లావుద్దీన్ అద్భుత దీపాలు అవసరం లేదు అనడానికి తెలంగాణలో వెలుగు చూస్తున్న మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులే మంచి ఉదాహరణ. శ్రీ కే.చంద్రశేఖరరావు నవజాత తెలంగాణా మొదటి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచీ ఆయన ధ్యాస, శ్వాస ఒక్కటే. తెలంగాణను పచ్చటి జలతారు కప్పుకున్న సస్యశ్యామల తెలంగాణాగా చేయడం. ఈ […]

రాత్రికి రాత్రే అద్భుతాలు సృష్టించడానికి ప్రభుత్వాల వద్ద మంత్రదండాలు వుండవు. అయితే పట్టుదల, చిత్తశుద్ధి, అంకితభావం కలిగిన పాలకులకు ఎటువంటి మంత్రదండాలు, అల్లావుద్దీన్ అద్భుత దీపాలు అవసరం లేదు అనడానికి తెలంగాణలో వెలుగు చూస్తున్న మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులే మంచి ఉదాహరణ.

శ్రీ కే.చంద్రశేఖరరావు నవజాత తెలంగాణా మొదటి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచీ ఆయన ధ్యాస, శ్వాస ఒక్కటే. తెలంగాణను పచ్చటి జలతారు కప్పుకున్న సస్యశ్యామల తెలంగాణాగా చేయడం. ఈ లక్ష్య సాధనలో భాగంగానే ఆయన మదిలో రూపుదిద్దుకున్న అనేకానేక పధకాల్లో ఈ రెండూ వున్నాయి.

ప్రత్యేక తెలంగాణా డిమాండ్ ఒక శక్తివంతమైన ఉద్యమ రూపం తీసుకోవడానికి ప్రధానంగా ఉపకరించిన అంశాల్లో సాగునీటి సమస్య ఒకటి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో సేద్యపు నీటి అవసరాలపట్ల శీతకన్ను వేశారనే సందేహాలు ఈ ప్రాంతపు ప్రజల్లో ప్రబలిన కారణంగా పుష్కర కాలానికి పైగా సాగిన మలివిడత తెలంగాణా ఉద్యమానికి నేతృత్వం వహించిన కాలంలోనే టీఆర్‌ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ ఈ అంశం పట్ల ప్రత్యేక దృష్టి సారించారు. ఆ ఉద్యమ సమయంలోనే ఆయన తెలంగాణా సాగునీటి అవసరాల గురించి లోతైన అధ్యయనం చేసారు. అంచేతనే ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఏమాత్రం కాలయాపన చేయకుండా తనమదిలో మెదులుతున్న సేద్యపు నీటి ప్రాజెక్టులను తక్షణం అమల్లోకి తీసుకురావాలని దృఢ నిశ్చయంతో ముందుకు కదిలారు.

పూర్వం తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాకతీయ రాజులు ఎన్నో గొలుసుకట్టు చెరువులు తవ్వించారు. వాటి ఫలితంగా వ్యవసాయ రంగం పుంజుకుని, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ కుదుటపడింది. అయితే తదనంతర కాలంలో పాలకుల అశ్రద్ధ కారణంగా తెలంగాణలో గొలుసుకట్టు చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. చెరువులు శిధిలమయ్యాయి. వ్యవసాయం దెబ్బతిన్నది. భారీ సేద్యపు నీటి ప్రాజెక్టులను నమ్ముకోవడం కన్నా చెరువుల పునరుద్ధరణే ఉత్తమమార్గం అని ప్రభుత్వం భావించిం ది. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణాకు 265 టీఎంసీల వాటా వుంది.

చెరువులను పునరుద్ధరించితే తప్ప, ఆ వాటా నీటిని వాడుకోవడం సాధ్యం కాదని, చెరువులకు పూర్వకళ సిద్ధిస్తే తప్ప తెలంగాణా గ్రామీణ ప్రాంతాలలో ఆర్ధిక వ్యవస్థను బాగుచేయడం వీలుకాదనే నిర్ధారణకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, ‘మిషన్ కాకతీయ’ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.

2015, మార్చి 12న నిజామాబాద్ జిల్లా (ఇప్పుడు కామారెడ్డి జిల్లా) సదాశివనగర్‌లోని పాత చెరువు పునరుద్ధరణ పనులతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మిషన్ కాకతీయ పధకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ పధకం చురుగ్గా సాగడంతో తెలంగాణలో వేలాది చెరువులకు కొత్త ఊపిరి ఊదినట్టయింది. అప్పటివరకు ఎండిపోయి తాంబాలాలుగా తయారయిన అనేక చెరువులు నిండు గంగాళాలుగా మారాయి. నీటితో కళకళలాడుతున్న ఈ చెరువులే ప్రభుత్వ పని తీరుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

మిషన్ కాకతీయ పధకం ఇప్పటికే ఫలితాలను ఇవ్వడం మొదలయింది. ఆయా ప్రాంతా ల్లో భూగర్భ జల మట్టాలు పెరిగాయి. సాగుచేసే విస్తీర్ణం, పంటల దిగుబడి గణనీయంగా మెరుగుపడిందని నాబార్డ్ తన నివేదికలో వెల్లడించింది. చెరువులకు దేశంలోనే తొలిసారిగా జియో ట్యాగింగ్ పద్ధతి ప్రవేశ పెట్టారు. వివరాలు అన్నింటినీ వెబ్ సైట్ లో పెట్టడం వల్ల ఆయా చెరువుల స్థితి గతులను ప్రపంచంలో ఎక్కడినుంచయినా తెలుసుకునే వెసులుబాటు ఏర్పడింది. ఈ విధానం వల్ల మరమ్మతులు, పునరుద్ధరణ పనుల్లో అవినీతికి ఆస్కారం లేకుండా పోయింది.

చెరువుల్లో సాలు పొడుగునా జల కళ ఉట్టిపడేలా చేయడానికి వాటిని ప్రాజెక్టులతో అనుసంధానం చేసే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వర్షాలు కురిసినా కురవకున్నా చెరువులన్నీ ఎప్పుడూ నిండు కుండల్లా ఉండాలనేది కేసీఆర్ అభిలాష. అందుకే ఈ అనుసంధాన ప్రక్రియ తలపెట్టారు. గొలుసుకట్టు చెరువుల్లో మొదటి దానికి, ప్రాజెక్టు నుంచి కాలువ ద్వారా నీరందిస్తారు. అది నిండగానే అలుగు పారి ఆ నీటితో దిగువ భాగంలో ఉన్న మరో చెరువు నిండుతుంది. గొలుసుకట్టు చెరువుల్లోని చిట్టచివరిది కూడా పూర్తిగా నిండేవరకు ప్రాజెక్టుల నుంచి నీరు సరఫరా చేస్తారు. ఇందుకోసం యెంత ఖర్చయినా వెనుకడుగు వేసేది లేదన్నది కేసీఆర్ ఇస్తున్న భరోసా.

ఇక మరో మహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం. శరవేగంగా జరుగుతున్న ఈ ప్రాజెక్టు పనులను చూసి ఇంజినీరింగ్ నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. అనేక ఆటంకాలను అధిగమించి మొదలయిన ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక రకంగా ఆ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం ఇప్పుడొక పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. జాతీయ స్థాయి జర్నలిష్టులు, కేంద్ర మంత్రులు, నీతిఅయోగ్ బృంద సభ్యులు వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన కేంద్ర ఉన్నతాధికారులు ఆ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరుతెన్నులు చూసి విస్తుపోతున్నారు. బ్రిటిష్ డిప్యూటి హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి, బాలి దేశంలో యునెస్కో నిర్మిస్తున్న సుబక్ సేద్యపు నీటి ప్రాజెక్టుతో దాన్ని సరిపోల్చారు. కాళేశ్వరం ద్వారా అద్భుత ఫలితాలు తెలంగాణాకు లభిస్తాయని ఆయన ట్వీట్ చేసారు.

ఈ ఏడాది జనవరిలో పందొమ్మిది దేశాల ప్రతినిధి బృందం తెలంగాణలో విస్తృతంగా పర్యటించింది. మిషన్ కాకతీయ, కాళేశ్వరం పధకాలు అమలు జరుగుతున్న తీరు అద్భుతమని ఆ బృందం కొనియాడింది. ఇధియోపియా, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు, దక్షిణాఫ్రికా దేశాలకు చెందినవారు ఈ బృందంలో వున్నారు.

కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ చేసి వరద కాలువను బలోపేతం చేయడం ద్వారా జలాశయంగా మార్చి నానాటికీ నిల్వ నీటి సామర్ధ్యం కుంచించుకు పోతున్న శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సేద్యపు నీరు అందించడానికి కాళేశ్వరం బృహత్తర ప్రాజెక్టుకు రూపకల్పన చేసారు. యావత్ ఆయకట్టు భూముల స్తితిగతులను గూగుల్ సాయంతో అధ్యయనం చేసిన కేసీఆర్, ఒకసందర్భంలో అసెంబ్లీలో ఇచ్చిన పవర్ పాయింటు ప్రెజెంటేషన్ ను టీవీల్లో చూసిన వారికి తెలంగాణా ప్రాంతపు సేద్యపు నీటి అవసరాలు, నీటిలభ్యత పట్ల ఆయనకు ఉన్న అవగాహన, సాధికారత బోధపడివుంటాయి.

బహుశా ఉద్యమ కాలంలోనే, తెలంగాణా కల సాకారమైనప్పుడు దాన్ని బంగారు తెలంగాణాగా రూపొందించడానికి ‘ఏమి చేయాలి? ఎలా చేయాలి? అనే యోచన చేసి కొన్ని పధకాలు సిద్ధం చేసుకుని ఉంటారు. ఈ విషయంలో ఆయన తను కన్న కలలను సాకారం చేసుకునేందుకు తయారు చేసి సిద్ధంగా ఉంచుకున్న అనేకానేక స్వల్పకాలిక, దీర్ఘ కాలిక పధకాలను అధికార పీఠం ఎక్కగానే, ఒకటొకటిగా అమలుచేయడం మొదలు పెట్టారు. వాటిల్లో ఒకటయిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఆరు జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి ఉద్దేశించిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చాలానాళ్ళుగా కంటున్న కల. ఇప్పుడు నెరవేరుతున్న స్వప్నం.

ప్రత్యేక తెలంగాణా సాధన ఒక ఎత్తయితే, సాధించుకున్న దాన్ని సమర్ధవంతంగా మలచుకోవడం మరో ఎత్తు. ఈ వాస్తవాన్ని జీర్ణించుకున్న పాలకుడు కాబట్టే కాలయాపన చేయకుండా ఆయన ఒకటి వెంట మరొకటిగా ఈ బృహత్తర పధకాలను అమలుచేస్తూ వస్తున్నారు.

కేసీఆర్ నేతృత్వంలో నూతన తెలంగాణా ప్రభుత్వం గత నాలుగేళ్ళకు పైగా చేస్తున్న పని ఇదే. వేస్తున్న అడుగులు, చూస్తున్న చూపులు, చెబుతున్న మాటలు అన్నీ ఈ దిశగానే. అన్నీ ఈ లక్ష్యసాధన మార్గంలోనే. లక్ష్యం మంచిదయినప్పుడు, దానికి చిత్తశుద్ధి తోడయితే ఫలితాలను గురించి ఆందోళన చెందాల్సిన పనే వుండదు.

                                                                                                                                            – భండారు శ్రీనివాసరావు