సరిహద్దుల వెంబడి తొలి స్మార్ట్ ఫెన్స్

ఈ నెల 17న హోం మంత్రిచే ప్రారంభం  

Laser-Fencing

న్యూఢిల్లీ : సరిహద్దులలో చొరబాట్ల ఆటకట్టుకు అత్యంత అధునాతనమైన కంచె ప్రారంభం కానుంది. వచ్చే వారాంతంలోనే ఈ లేజర్ స్మార్ట్ ఫెన్స్ ప్రయోగాత్మక ప్రాజెక్టుకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ విషయాన్ని సరిహద్దు భద్రతా దళం డైరెక్టర్ జనరల్ కెకె శర్మ వెల్లడించారు. ఓ వైపు పాకిస్థాన్, మరో వైపు బంగ్లాదేశ్‌ల వెంబడి భారత్‌కు సుదీర్ఘ సరిహద్దు ప్రాంతం ఉంది. అతిక్రమణలకు వీలున్న ప్రాంతాలను గుర్తించి అడ్డుకట్ట వేసేందుకు ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు ఆయన శుక్రవారం వివరించారు. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, లేజర్‌తో ఏర్పాటు చేసే ఫెన్సింగ్‌లను ఈ ప్రాజెక్టులో భాగంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి 2400 కిలోమీటర్ల మేర ఇక ముందు ఏర్పాటు చేయడం జరుగుతుంది.

ప్రస్తుతానికి కీలక ప్రాంతాలలో అక్కడక్కడ దీనిని ప్రయోగాత్మకంగా నెలకొల్పుతారని శర్మ తెలిపారు. ప్రస్తుతానికి బంగ్లాదేశ్‌తో, ఆ దేశ సరిహద్దు భద్రతా బలగం బిజిబితో భారత్‌కు సత్సంబంధాలు ఉన్నాయని వివరించారు. ప్రాధాన్యతాక్రమంలో భాగంగా సమగ్ర సమీకృత సరిహద్దు నిర్వహణ వ్యవస్థను (సిఐబిఎంఎస్) తొలుత పాకిస్థాన్ సరిహద్దులలో ఏర్పాటు చేయడం జరుగుతుందని శర్మ తెలిపారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే యంత్రాలతో ఈ కంచె ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఈ వ్యవస్థ లేదా స్మార్ట్ ఫెన్స్‌ను ప్రయోగాత్మకంగా ముందుగా జమ్మూలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఇది పనిచేస్తోందని, అయితే అధికారికంగా హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీనిని ఈ నెల 17వ తేదీన ప్రారంభిస్తారని , ఇప్పటికైతే తాత్కాలికంగా ఈ తేదీ ఖరారు అయిందని తెలిపారు.

బెంగాల్‌లో రోహింగ్యాల క్యాంపులు

రోహింగ్యాల పట్ల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అత్యంత స్నేహపూరితంగా స్పందిస్తోందని బిఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ కెకె శర్మ తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 70 రోహింగ్యా కుటుంబాలకు శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. రోహింగ్యాల సంఖ్య గురించి నిర్థారించుకునేందుకు తాము దర్యాప్తు చేపట్టినట్లు ఆయన శుక్రవారం వెల్లడించారు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో అత్యధిక సంఖ్యలో రోహింగ్యాలు చేరారు. అడపాదడపా వారు చిన్న చిన్న బృందాలుగా భారతదేశంలోకి వస్తున్నమాట వాస్తవమే అని కెకె శర్మ అంగీకరించారు. అయితే అక్రమంగా తరలవిస్తున్న వారిని బిఎస్‌ఎఫ్ అడ్డుకుంటుందని, ఈ ధీమా తమకు ఉందని తెలిపారు.

Comments

comments