సమాజాన్ని ప్యూర్ చేద్దాం…

వాళ్లంతా బాల్యస్నేహితులు.. పెద్దయి వేరు వేరు రంగాల్లో స్థిరపడ్డారు. వారిలో కొందరు యుఎస్‌లో మరి కొంతమంది ఇండియాలో ఉంటున్నారు. వీరంతా కలిసి సమాజానికి ఏమైనా చేయాలనుకుని మళ్లీ ఒకటైనారు. చదువుతోనే ఆకలి, పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో సోషల్‌మీడియాను వేదికగా చేసుకుని ‘ప్యూర్’ సంస్థను నెలకొల్పారు. పేదవిద్యార్థులకు నిస్వార్థంగా సాయం చేయాలనుకున్నారు శైలా తాళ్లూరి, సంధ్యలు. వీరు తల్లీకూతుళ్లే కాదు గురుశిష్యులు కూడా. సమాజాన్ని ప్యూర్ చేస్తున్న శైలా తాళ్లూరి తన మనోభావాలను మనతెలంగాణ సకుటుంబంతో పంచుకుంది. పశ్చిమ […]

వాళ్లంతా బాల్యస్నేహితులు.. పెద్దయి వేరు వేరు రంగాల్లో స్థిరపడ్డారు. వారిలో కొందరు యుఎస్‌లో మరి కొంతమంది ఇండియాలో ఉంటున్నారు. వీరంతా కలిసి సమాజానికి ఏమైనా చేయాలనుకుని మళ్లీ ఒకటైనారు. చదువుతోనే ఆకలి, పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో సోషల్‌మీడియాను వేదికగా చేసుకుని ‘ప్యూర్’ సంస్థను నెలకొల్పారు. పేదవిద్యార్థులకు నిస్వార్థంగా సాయం చేయాలనుకున్నారు శైలా తాళ్లూరి, సంధ్యలు. వీరు తల్లీకూతుళ్లే కాదు గురుశిష్యులు కూడా. సమాజాన్ని ప్యూర్ చేస్తున్న శైలా తాళ్లూరి తన మనోభావాలను మనతెలంగాణ సకుటుంబంతో పంచుకుంది.

పశ్చిమ గోదావరి జిల్లాలోకు చెందిన శైలా తాళ్లూరి తండ్రి బ్యాంక్ ఆఫీసర్. తల్లి సంధ్య ప్రధానోపాధ్యురాలు. ప్రతి మూడేళ్లకు ట్రాన్స్‌ఫర్ కావడం వల్ల కొత్త స్కూళ్లు, కొత్త స్నేహితులు. అలా నెల్లూరులో విశ్వభారతి స్కూల్‌లో 4వ తరగతిలో ఉన్నప్పుడు ఏర్పడిన స్నేహితుల బృందమే ప్యూర్‌కు టీంగా ఉన్నారు. చిన్నప్పటి నుంచీ తల్లి నుంచి ఇతరులకు సాయం చేయాలి. ఉన్నంతలో కొంత పేదలకు పంచాలి అంటూ తల్లి సంధ్య టీచర్‌గా చెప్పిన మాటలు శైలా తాళ్లారిలో బాగా నాటుకుపోయింది. అమ్మగా కాకుండా, టీచర్‌గా ఆవిడ మాకిచ్చిన ధైర్యం, ఇతరులకు సాయం చేయాలని నేర్పించిన పాఠాలే ప్యూర్ ఏర్పడ్డానికి కారణం అంటోంది శైలా. డిగ్రీ వరకు ఇండియాలో చదువుకున్న శైలా యుఎస్‌లో మాస్టర్స్ చేసింది. ప్యూర్‌తో పాటు మనిషిగా నేను ఎదుగుతున్నాను. సంఘానికి నువ్వేంచేస్తున్నావు అని ఎవరైనా అడిగితే ప్యూర్ పేరు చెప్పను. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నానని చెప్తాను. యుఎస్ వెళ్లి 20 ఏళ్లయింది. మొదట్లో ఎవరికైనా సాయం కావాలనిపిస్తే డబ్బులు ఇచ్చేదాన్ని. కానీ డబ్బు కంటే ఇంకేదో ముఖ్యమనిపించింది. అలా మార్చి 17, 2016లో ప్యూర్ సంస్థను ఏర్పాటుచేశాం.

ప్యూర్ వెనుక కథ
2007 ఆగష్టులో కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాలు వరదకు గురయినప్పుడు వరద బాధితులను చూసి చలించిపోయింది. తిరుపతి హుండీలో వేయవలసిన డబ్బును వారికి ఖర్చుపెట్టాలనుకుంది. అలా మహబూబ్‌నగర్ జిల్లాలోని వడ్డేపల్లి మండలం తుమ్మలపల్లిని దత్తతు తీసుకుంది. అక్కడి రైతులకోసం విత్తనాలు కొనడానికి సాయం చేసింది. పదేళ్లక్రితం సంగతి ఇది. ప్రతి ఏడాది తిరుపతి వెంకన్న హుండీలో ఎంతో కొంత వేయడం ఆమెకు అలవాటు. ఆ డబ్బును సేవలకు ఖర్చుపెట్టడం మొదలుపెట్టింది.
2016లో ప్యూర్‌కి విత్తనం వేసింది అమ్మే. కస్తూర్‌బాలో ఎవరికైనా పెళ్లిళ్లయినా ఉంగరం, మంగళ సూత్రం లాంటివి ఇస్తుండేదాన్ని. ఎవర్నీ డెరెక్టుగా డబ్బులు అడక్కూడదేది మా రూల్. సోషల్‌మీడియా అనేది ప్యూర్‌కి బ్యాక్‌బోన్‌లాంటిది. మరొకటి సంధ్యగారు. ఇప్పటివరకూ 171 పాఠశాలలకు కావల్సిన అవసరాలను తీర్చాము. ఇందులో అమ్మా కూతుళ్ల బంధం ఏమీ లేదు. స్టూడెంట్ అండ్ టీచర్లమే. ప్యూర్‌కి లోగో డిజైన్ చేసింది నా చిన్నప్పటి స్నేహితురాలు అర్చన. యుఎస్‌లో శైల, దీప, విజయ్ కాగా ఇండియాలో చైర్మన్ విజయ్ ప్యూర్‌కు మూలస్తంభాలు.

ఎలాంటివారికి సహాయం అందుతుందంటే…
ప్యూర్ అనేది నాన్‌ప్రావిట్ సంస్థ. సాయం చేయాలనుకునేవారికి ఇదొక ప్లాట్‌ఫాం. ప్యూర్‌కు ఫండ్ ఇచ్చేవారిలో ఎక్కువగా సినిమా, మీడియా,ఎన్‌ఆర్‌ఐలు ఉంటారు. సోషల్‌మీడియాలో ఎవరికైతే ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుందో వాళ్లకి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపించి సర్కిల్ పెంచుకుంటోందీ సంస్థ. 3 నెలల్లో 20 స్కూల్స్‌ను గోల్‌గా పెట్టుకుంటాం. కొన్ని స్కూళ్లను దత్తత తీసుకుంది.

ఎందుకుచేస్తున్నామంటే ..
గవర్నమెంటు స్కూల్‌లో చదువుకుని వచ్చానని చెప్పుకోవడానికి చాలా మంది బిడియపడతారు. ఎందుకంటే అక్కడ అలాంటి పరిస్థితులుంటాయి. సరైన వసతులుండవు. అలాంటి దుర్భర పరిస్థితిని దూరం చేయాలనుకున్నాం అంటోంది శైలా. ప్రతి స్కూల్లో డిజిటల్ క్లాస్ రూం ఉండేలా చూస్తున్నాం. మారుమూల ఊళ్లల్లో కూడా ప్యూర్ వెళ్లి చూస్తుంటుంది. మేం ఇంత నమ్మకంగా పిల్లల కోసం ఏమైనా చేయగలుగుతున్నాం అంటే అక్కడి టీచర్ల కృషి ఉంది. అక్కడ లోకల్‌గా ఉన్న యువత వాలంటరీగా పనిచేస్తుంటారు. ప్రతి దానికి పర్యవేక్షణ ఉంటుంది. అంతేకాకుండా సింగిల్ మదర్ ఉన్న 85 మంది పిల్లల్ని చదివిస్తున్నాం.

ప్యూర్‌ను విస్తరించాలనుంది..
పిల్లలకు సైకిళ్లు, చదువుకు ఆటంకంలేకుండా చేస్తున్నాం. ఇప్పటివరకు 300 నుంచి 400 వరకు స్కూల్ పిల్లలకు సైకిళ్లను అందించాం. చుట్టుపక్కల గ్రామలకు చెందిన విద్యార్థులకు నడిచిరావడం కష్టంగా ఉండటంతో అంతే కాకుండా వారి సొంత పనులకు కూడా వాడుకునేందుకు వీలుగా ఉంటుందని అలా నిర్ణయం తీసుకున్నాను. 2.5 లక్షల మందికి సహాయం చేయడం మా ముఖ్య కర్తవ్యంగా మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌ని కలిసి చెప్పాం. మా అమ్మ సంధ్య ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతుంది. వారి కష్టసుఖాలను తెలసుకుని వారికి తగిన సాయం చేసేవరకు ఊరుకోదు. ఇప్పటి వరకు ప్యూర్‌కు చాలా అవార్డులు వచ్చాయి. క్యాన్సర్ వచ్చిన వారికి సాయం చేసేందుకు నా జుట్టును కూడా ఇచ్చాను. నాది చాలా పొడవైన జుట్టు. మోకాళ్ల వరకూ ఉండేది.

తెలుగు బాగా నేర్చుకున్నా.. యుఎస్‌లో ఉంటున్న నేను హైదరాబాద్‌ను మిస్ అవుతున్నందుకు బాధగా ఉంది. తెలుగమ్మాయిని అయినప్పటికీ ఒకప్పుడు తెలుగు సరిగ్గా మాట్లాడలేకపోయేదాన్ని . ఒక మీటింగ్‌కు వెళ్లినప్పుడు తెలుగులో మాట్లాడమన్నారు. నేను మాట్లాడుతుంటే చాలామంది నవ్వుతున్నారు. ఇప్పుడు ఫరవాలేదు. ఫేస్‌బుక్‌లో తెలుగులోనే కామెంట్లు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈవ్‌టీజింగ్‌కు గురయ్యే ఆడపిల్లలకి ధైర్యాన్ని చెపుతూ ఉంటాను. నాకు ఇద్దరు పిల్లలు. అమెరికాలో సంగీతం నేర్చుకుంటున్నారు. మన దేశంలో సంస్కృతి, సంప్రదాయాలే కాదు ఇతర దేశాల్లో ఉన్న మంచి అలవాట్లని కూడా మనం నేర్చుకోవాలి. వారి పరిశుభ్రత, ప్రతిభను గుర్తించి మనం కూడా నేర్చుకోవాలి.

ఇప్పటి వరకు…
ప్రభుత్వ పాఠశాలలకు బుక్స్, సైకిల్స్, వాటర్ బాటిల్స్, పుస్తకాలు, డిజిటల్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు చేశాం. చదువులో వెనుకబడుతున్న పిల్లల్ని గుర్తించి వారికి శారీరక, మానసిక ఇబ్బందులు ఉంటే వైద్యసహాయం చేశాం. ఫ్లోరైడ్ బాధితులకు దంత సమస్యలను పరిష్కరించాం. మన దేశంలో పాఠశాలల్లో టాయిలెట్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం నుండి మాకు ఎలాంటి ఫండ్స్ రావు. కానీ మేము చేసే ఈ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఉంటే చాలు. బంగారం, డైమండ్స్ అంటే ఇష్టం ఉండేది. కానీ ప్యూర్ సంస్థ పెట్టినప్పటినుండీ కొనడం మానేశాను. నా భర్త ఐటి మేనేజర్. మా పనికి ఏమీ ఆటంకం కలిగించరు. ఆర్థికంగా సహాయం అందచేస్తూ ఉంటారు. స్వతంత్రంగా ఎవరిపని వారు చేసుకుంటాం. అమెరికాలో ప్యూర్ యూత్ అనే ట్రస్టు ప్రారంభించాం. అక్కడ ఇండియన్ యువతకు మార్గదర్శకంగా ఉంటున్నాం. అక్కడ ఒక ఆఫ్రికన్, అమెరికన్, ఇండియన్ అమ్మాయిలు ఇటువంటి సంస్థల కోసం ఫండ్స్ వసూలు చేసి మా పనిలో సహకరిస్తున్నారు. ఇలా చాలా మంది పిల్లలు వచ్చి మా సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్నారు.

-మల్లీశ్వరి వారణాసి