సమరానికి సై

belgeam

నేడు ఫ్రాన్స్‌తో బెల్జియం సెమీస్ పోరు

సెయింట్ పీటర్స్‌బర్గ్: రష్యా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంది. మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్‌కు బెల్జియం, ఫ్రాన్స్ జట్లు సిద్ధమయ్యాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాగా, ప్రపంచకప్‌లో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ పోటీలు మిగిలాయి. ఈసారి యూరప్‌కు చెందిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. దక్షిణ అమెరికా జట్లు క్వార్టర్ ఫైనల్ దశలోనే ఇంటిదారి పట్టడంతో ఈసారి జరిగే ప్రపంచకప్ యూరప్‌కు దక్కనుంది. మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, ఫ్రాన్స్‌లతో పాటు బెల్జియం, క్రొయేషియా జట్లు సెమీఫైనల్‌కు దూసుకొచ్చాయి. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఇంగ్లండ్, క్రొయేషియా జట్లు అసాధారణ ఆటతో చివరి నాలుగు జట్లలో చోటు సంపాదించాయి. ఇక ఊహించినట్టుగానే ఫ్రాన్స్, బెల్జియంలు కూడా కప్పులో కొనసాగుతున్నాయి. అయితే టోర్నమెంట్ ఫేవరెట్లలో ఒకటిగా భావించిన బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. దీంతో దక్షిణ అమెరికా కప్పు ఆశలు ఆవిరయ్యాయి. మరోవైపు ఉరుగ్వే కూడా ఫ్రాన్స్ చేతిలో ఓడి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ పరిస్థితుల్లో చాలా ఏళ్ల తర్వాత మళ్లీ యూరప్ జట్ల మధ్య టైటిల్ సమరం జరుగనుంది.

జోరుమీదున్నాయి…

sprts
ఇదిలావుండగా ఈ టోర్నమెంట్‌లో ఇటు ఫ్రాన్స్, అటు బెల్జియం జట్లు అద్భుత ఆటతో సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. లీగ్ దశలో రెండు జట్లు కూడా అజేయంగా నిలిచాయి. సెమీస్‌కు చేరుకునే క్రమంలో ఫ్రాన్స్, బెల్జియంలు ఒక్క ఓటమి కూడా చవి చూడలేదు. క్వార్టర్ ఫైనల్ సమరంలో ఫ్రాన్స్ బలమైన ఉరుగ్వేను మట్టికరిపించింది. అంతకుముందు ప్రిక్వార్టర్ ఫైనల్లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా భావించిన అర్జెంటీనాను ఓడించింది. ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ అలవోక విజయం సాధించింది. ఈసారి కూడా ఫ్రాన్స్ విజయమే లక్షంగా పెట్టుకుంది. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో ఒకటిగా పరిగణించే ఫ్రాన్స్ ఈసారి అంచనాలకు మించి రాణిస్తోంది. మ్యాచ్ మ్యాచ్‌కు తన ఆటను ఎంతో మెరుగు పరుచుకుంటుంది. ఉరుగ్వే వంటి పటిష్ట జట్టుపై ఘన విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. మంగళవారం జరిగే సెమీఫైనల్లో బెల్జియంను ఓడించి టైటిల్ పోరుకు చేరుకోవాలని భావిస్తోంది. ఇదిలావుండగా బెల్జియంను కూడా తక్కువ అంచన వేయలేం. ఫిఫా ర్యాంకింగ్స్‌లో టాప్3లో ఉన్న బెల్జియం ఊహించినట్టుగానే సెమీస్‌కు చేరుకుంది. ఇక్కడికి చేరుకునే క్రమంలో అద్భుత విజయాలు సాధించింది. క్వార్టర్ ఫైనల్లో బలమైన బ్రెజిల్‌ను చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. లీగ్ దశలో బలమైన ఇంగ్లండ్‌ను ఓడించింది. అంతేగాక ప్రిక్వార్టర్ ఫైనల్లో జపాన్‌ను కంగుతినిపించింది. ఒక దశలో రెండు గోల్స్‌తో వెనుకబడ్డా అసాధారణ పోరాట పటిమతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. బ్రెజిల్‌తో జరిగిన పోరులోనూ అసాధారణ పోరాట పటిమను కనబరిచింది. ఈసారి కూడా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. లుకాకో, హజార్డ్ తదితరులతో బెల్జియం చాలా బలంగా ఉంది. దీంతో ఫ్రాన్స్‌కు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని చెప్పొచ్చు.