సమరానికి రె‘ఢీ’

  • ఆత్మవిశ్వాసంతో కోహ్లి సేన, నేడు పాక్‌తో పోరు

team-india

బర్మింగ్‌హామ్ : చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ సమరానికి సర్వం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య ఆదివారం పోరు జరుగనుంది. రెండు జట్లు కూడా విజయమే లక్షంగా సర్వం ఒడ్డేందుకు సిద్ధమయ్యాయి. సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో కూడిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు సర్ఫరాజ్ అహ్మద్ సారథ్యంలోని పాకిస్థాన్ కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. దీంతో మ్యాచ్ నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.
అందరి దృష్టి కోహ్లిపైనే…
కాగా, పాకిస్థాన్‌తో మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై నిలిచింది. కొంతకాలంగా కోచ్ కుంబ్లేతో విభాదాల నేపథ్యంలో కోహ్లి ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలా ఆడుతాడనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన కోహ్లి ఇటీవల ముగిసిన ఐపిఎల్‌లో పేలవమైన ఆటతో నిరాశ పరిచాడు. అంతేగాక, అంతకుముందు జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌లో కూడా కోహ్లి అనుకున్న విధంగా రాణించలేదు. ఈ పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ కోహ్లికి కీలకంగా మారింది. ఇందులో రాణించడం ద్వారా మళ్లీ ఫాంను దొరక బుచ్చుకోవాలనే పట్టుదలతో కోహ్లి ఉన్నాడు.
యువీ, రోహిత్‌లే కీలకం..
ఈ మ్యాచ్‌లో భారత ఆశలన్నీ రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్‌లపై నిలిచాయి. ఎంతో అనుభవజ్ఞులైన ఇద్దరు జట్టుకు అండగా నిలువాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇద్దరు ఇటీవల కాలంలో అంతంత మాత్రం ఆటతో నిరాశ పరుస్తున్నారు. కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించడం ద్వారా మళ్లీ గాడిలో పడాలని తహతహలాడుతున్నారు. వన్డేల్లో వీరిద్దరికి కళ్లు చెదిరే రికార్డు ఉంది. రోహిత్ తనదైన రోజు ఎంతటి బౌలింగ్‌నైన చిన్నాభిన్నం చేయగలిగే సత్తా కలిగిన వాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే రోహిత్ పూర్తి సామర్థం మేరకు ఆడితే భారత్‌కు భారీ స్కోరు కష్టమేమి కాదు. మరోవైపు యువరాజ్ కూడా జట్టుకు కీలకంగా మారాడు. గాయం వల్ల తొలి రెండు వార్మప్ మ్యాచ్‌లకు దూరమైన యువరాజ్ ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతోఉన్నాడు. కాగా, మరో సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ కూడా మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యాడు. జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న ధోనీ చెలరేగితే అడ్డుకోవడం పాకిస్థాన్ బౌలర్లకు కష్టమే. ఒకప్పుడు విధ్వంసక బ్యాటింగ్‌కు పెట్టింది పేరుగా ఉన్న ధోనీ ప్రస్తుతం అనుకున్న విధంగా రాణించడం లేదు. అయితే పాక్‌పై అద్భుత రికార్డు కలిగిన ధోనీ మరోసారి చెలరేగేందుకు తహతహలాడుతున్నాడు. ఎంతో అనుభవజ్ఞుడైన ధోనీ విజృంభిస్తే భారత్‌కు విజయం నల్లేరుపై నడకే. ఇక, స్టార్ ఆటగాడు రహానెకు పాకిస్థాన్ మ్యాచ్‌లో జట్టులో చోటు దక్కడం అనుమానంగా ఉంది. పేలవమైన ఫాంతో సతమతమవుతున్న రహానె రెండు వార్మప్ మ్యాచుల్లో కూడా విఫలమయ్యాడు. దీంతో అతనికి తుది జట్టులో సంపాదించడం అంత సులువుకాదనే చెప్పాలి. యువ ఆటగాడు కేదార్ జాదవ్‌కు జట్టులో చోటు దక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అంతేగాక, వార్మప్ మ్యాచ్‌లో సత్తా చాటిన యువ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా తుది జట్టులో చోటు సంపాదించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. బ్యాటింగ్‌లో అశ్విన్ కంటే కాస్త మెరుగ్గా ఉన్న రవీంద్ర జడేజాకే తుది జట్టులో చోటు లభించే అవకాశాలున్నాయి.
ఫాస్ట్ బౌలర్లపైనే…
ఇక, టీమిండియా ఆశలన్నీ ఫాస్ట్ బౌలర్లపైనే నిలిచాయి. ఇంగ్లాండ్ పిచ్‌లపై చెలరేగేందుకు భారత ఫాస్ట్ బౌలర్లు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్నారు. భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రిత్ బుమ్రాతో పాటు ప్రధాన అస్త్రం మహ్మద్ షమి సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కాలంలో భువనేశ్వర్ నిలకడైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. గతంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచుల్లో అద్భుతంగా రాణించిన భువనేశ్వర్ ఈసారి కూడా జట్టును ఆదుకునేందుకు సిద్ధమయ్యాడు. బుమ్రా, ఉమేశ్‌లు కూడా బంతితో మ్యాజిక్ చేసేందుకు తహతహలాడుతున్నారు. వార్మప్ మ్యాచుల్లో సత్తా చాటిన షమి కూడా జోరుమీదున్నాడు. దీంతో భారత బౌలింగ్ లైనప్ చాలా బలంగా మారింది. పాక్ బ్యాటింగ్ లైనప్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసేందుకు వీరంత సిద్ధంగా ఉన్నారు.
మాలిక్‌పైనే ఆశలు..
మరోవైపు పాకిస్థాన్ ఆశలన్నీ సీనియర్ ఆటగాడు, హైదరాబాదీ అల్లుడు షోయబ్ మాలిక్‌పై నిలిచాయి. భారత్‌పై మెరుగైన రికార్డును కలిగిన మాలిక్ ఈసారి కూడా చెలరేగేం దుకు తహతహ లాడు తున్నాడు. ఇటు బ్యాట్‌తో అటు అవసరమైతే బంతితో చెలరేగే సత్తా మాలిక్‌కు ఉంది. ఇక, యువ సంచలనం బాబర్ ఆజమ్‌ను కూడా తక్కువ అంచన వేయలేం. వన్డేల్లో ఆశాశమే హద్దుగా చెలరేగి పోతున్న బాబర్ భారత్‌పై కూడా విజృంభించేందుకు తహతహలాడుతున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన బాబర్ చెలరేగితే భారత బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. అంతేగాక అహ్మద్ షెజాద్, మహ్మద్ హఫీజ్, అజహర్ అలీ, కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులతో బ్యాటింగ్ బలంగా ఉంది. దీంతోపాటు మహ్మద్ అమేర్, వాహబ్ రియాజ్, ఫహీం అశ్రఫ్, జునేద్ ఖాన్ తదితరులతో బౌలింగ్ కూడా బలంగానే కనిపిస్తోంది. భారత్‌తో పోల్చితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కాస్త బలహీనంగా ఉన్న పాకిస్థాన్ తనదైన రోజు ఎంతటి పెద్ద జట్టుకైన కంగుతినిపిస్తోంది. దీంతో భారత్ ఏమాత్రం నిర్లక్షంగా ఆడిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో పాకిస్థాన్ రెండు పోటీల్లో విజయం సాధించింది. భారత్‌కు ఒక విజయం మాత్రమే దక్కింది. ఈ రికార్డును సరిచేయాలనే పట్టుదలతో టీమిండియా ఉంది.
జట్ల వివరాలు
భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానె, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేదార్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోనీ, దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమి, బుమ్రా, హార్ధిక్ పాండ్యా.
పాకిస్థాన్: సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), అహ్మద్ షెజాద్, అజహర్ అలీ, షోయబ్ మాలిక్, బాబర్ ఆజమ్, ఫహీం అశ్రఫ్, హసన్ అలీ, వహాబ్ రియాజ్, మహ్మద్ అమేర్, మహ్మద్ హఫీజ్, షాదాబ్ ఖాన్, జునేద్ ఖాన్, ఇమాద్ వసీం, హారిస్ సోహైల్.