శాపం బిజెపికి కాదు.. టిడిపికే: రాకేష్ సింగ్

BJP MP Rakesh Singh Addressing Floor Test in Lok Sabha

న్యూఢిల్లీ: అన్యాయం చేసిన బిజెపికి కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందని, ఆ పార్టీ శాపానికి గురి కానుందని అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభిస్తూ ఎంపి గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఎంపి రాకేష్ సింగ్ తనదైన శైలిలో స్పందించారు. “గల్లా గారూ… మీరు బిజెపికి శాపం తగులుతుందని వ్యాఖ్యానించారు. కానీ, ఎప్పుడైతే మీరు కాంగ్రెస్ పక్కన కూర్చున్నారో, అప్పుడే మీకు శాపం తగిలినట్టే. ప్రజలు వెలేసేది బిజెపిని కాదు. టిడిపినేనని తొందర్లోనే తెలుస్తుంది” అని అన్నారు. దీంతో బిజెపి సభ్యులు బల్లలు చరుస్తూ తమ హర్షాన్ని వ్యక్తం చేయగా, టిడిపి సభ్యులు సభలో నిరసన తెలిపారు. ఆపై తన ప్రసంగాన్ని కొనసాగించిన రాకేష్, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని కర్ణాటకలో ప్రభుత్వాన్ని ప్రారంభించిన కుమారస్వామి కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

అంచనాలు, వాస్తవికత మధ్య భేదం ఇప్పుడు తగ్గిందన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వం చేసిన అభివృద్ధి నినాదం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోందని తెలిపారు. దేశ వనరులు పేదలకు సంబంధించినవని, అవి వారికే దక్కాలన్నారు. దేశంలో మొదటిసారిగా ఇంత మెజార్టీతో కాంగ్రెస్సేతర ప్రభుత్వం ఏర్పడిందన్నారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలతో బలమైన ఈ ప్రభుత్వం ఏర్పడిందని, పరస్పర విరుద్ధమైన శక్తులు ఏకమై అవిశ్వాసం తీసుకొచ్చాయని దుయ్యబట్టారు. ప్రజలు విశ్వసించిన ప్రభుత్వంపై ప్రజల నమ్మకం కోల్పోయిన పార్టీలు తెచ్చిన అవిశ్వాసం ఇదని ఆయన అభివర్ణించారు. 2019లో నరేంద్ర మోడీ నాయకత్వంలో చేయబోయే విజయయాత్రను అడ్డుకునే విఫల ప్రయత్నమని పేర్కొన్నారు. 60 ఏళ్లు ఒక కుటుంబం దేశాన్ని పరిపాలించదని రాకేష్‌సింగ్ గుర్తు చేశారు. 48 ఏళ్లు నెహ్రూ, ఇందిరా, రాజీవ్, మన్మోహన్‌ల నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిందన్నారు. 48 ఏళ్ల స్కాముల ప్రభుత్వాలను 48 నెలల్లో స్కీమ్‌ల ప్రభుత్వంగా మార్చామన్నారు. గరీబీ హఠావక్ష అనే పెద్ద మాటలు చెప్పారు, ఇప్పటిదాకా పేదరికం అలాగే ఉందని విమర్శించారు.

Comments

comments