వ్యాసో నారాయణో హరిః

ph5

నేడు గురు పూర్ణిమ

గురువును దైవంతో సమానంగా భావించి ఆరాధించడం మన దేశంలో తరతరాల సంప్రదాయంగా వస్తోంది. పురాణాల ప్రకారం పరమ శివుడిని ఆదిగురువుగా పరిగణిస్తారు. భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణ పరమాత్ముడిని జగద్గురువుగా ఆరాధిస్తాం. కొన్ని అవతారాల్లో శ్రీమహావిష్ణువు సైతం గురువుల వద్దనే విద్యాభ్యాసం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు పరమ శివుడు ఆదిగురువుగా ఆవిర్భవించినందువల్ల ఈ రోజును గురుపూర్ణిమగా పాటించడం యోగ సంప్రదాయంలో అనాదిగా వస్తోంది.
గురుపూర్ణిమకు మరికొన్ని పౌరాణిక విశిష్టతలు కూడా ఉన్నాయి. పరాశర మహర్షికి, సత్యవతికి వ్యాస మహర్షి ఇదే రోజున జన్మించినందున గురుపూర్ణిమను వ్యాసపూర్ణిమ అని కూడా అంటారు. వ్యాసుడు మహాభారతంతో పాటు అష్టాదశ పురాణాలను రచించాడు. అపౌరుషేయాలైన వేద శ్లోకాలను సేకరించి, వాటిని రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనే నాలుగు వేదాలుగా విభజించాడు. అందుకే వ్యాసుడికి వేదవ్యాసుడనే పేరు వచ్చింది. గురు పూర్ణిమను హిందువులు మాత్రమే కాదు, బౌద్ధులు, జైనులు కూడా పాటిస్తారు.
గురుశిష్య పరంపర: గురుశిష్య పరంపర వేదకాలం నుంచే ఉండేది. నాటి గురువులు శిష్యులకు వేద విద్యను మౌఖికంగా చెప్పేవారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత శిష్యులు గురువులకు గురుదక్షిణ సమర్పించుకునేవారు. అద్వైత ఆచార్యుడు ఆదిశంకరాచార్యులు గురువు విశిష్టతను తన ‘ఉపదేశ సాహస్రి’లో వివరించారు.
గురుపూజ విశిష్టత: దత్త సంప్రదాయంలో గురుపూజకు చాలా విశిష్టత ఉంది. అత్రి అనసూయల తనయుడు, త్రిమూర్తి స్వరూపుడైన శ్రీదత్తాత్రేయుడిని గురుదత్తునిగా కొలుస్తారు. దత్తాత్రేయుని అవతారాలుగా పరిగణించే శ్రీపాద వల్లభుని, నృసింహ సరస్వతి స్వామిని, షిరిడీ సాయిబాబాను గురుపూర్ణిమ రోజున ప్రత్యేక పూజలతో ఆరాధిస్తారు. దత్త క్షేత్రాలలోను, దత్త పీఠాల్లోను, షిరిడీలోని ప్రధాన ఆలయం సహా దేశవ్యాప్తంగా ఉండే సాయిబాబా ఆలయాల్లో గురుపూర్ణిమ వేడుకలు ఏటా మూడు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. తమ తమ గురువులకు ఇతోధికంగా దక్షిణలు సమర్పించి, సత్కారాలు చేస్తారు.
గురుపూర్ణిమ నాడే చంద్రగ్రహణం:ఈసారి గురుపూర్ణిమ నాడే చంద్రగ్రహణం సంభవిస్తోంది. ఇది సుదీర్ఘ చంద్రగ్రహణం. యోగ సాధకులు, మంత్రవేత్తలు గ్రహణాలు చాలా విశిష్టమైనవిగా పరిగణిస్తారు. పర్వదినాల్లో గ్రహణాలు వచ్చినట్లయితే, అవి మరింత విశిష్టమైనవిగా భావిస్తారు. మంత్రోపదేశం పొందిన వారు గ్రహణకాలం ప్రారంభానికి ముందు స్నానం ఆచరించి, ఎలాంటి ఆహారం తీసుకోకుండా గ్రహణం పూర్తిగా విడిచిపెట్టే వరకు మంత్రజపం, ధ్యానం చేస్తారు. మంత్రోపదేశం లేని వారు నవ గ్రహశ్లోకాలలోని చంద్ర శ్లోకాన్ని ఈ సమయంలో పఠించుకోవచ్చు. గ్రహణం పూర్తిగా విడిచిన తర్వాత తిరిగి స్నానం ఆచరించి, ఇంట్లోని పూజా మందిరంలో ఉన్న దేవతామూర్తులకు సంప్రోక్షణ జరిపి ఆ తర్వాతే నిత్యపూజ చేస్తారు. గ్రహణం విడిచిన తర్వాత యథాశక్తి దానాలు చేస్తారు.
వ్యాసమహర్షి ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు. ప్రతి ద్వాపర యుగంలోను ఒకసారి వ్యాసుడు ఉద్భవిస్తాడు. ప్రస్తుతం మనం ఉంటున్నది వైవస్వత మన్వంతరంలో ని 28 వ యుగంలోని వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు కాలంలో. ఆయన జన్మించిన తిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకుంటాం. సాక్షాతు శ్రీ మహా విష్ణువు అవతారంగా భావించే వ్యాస భగవానుని గానూ ఆదిగురువుగానూ భావిస్తారు.
విష్ణు సహస్రనామ పీఠిక లో కూడా….. ‘వ్యాసాయ విష్ణు రూపాయ-వ్యాస రూపాయ విష్ణవే నమోవై బ్రహ్మ నిధయే వాశిష్టాయ నమోనమః అని వ్యాసునికి విష్ణువుకు అభేదం చెప్పబడింది.
వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే, పౌత్రమకల్మషమ్
పరాశరాత్మజమ్ వందే శుక తాతం తపోనిధిమ్
తాత్పర్యం: వశిష్టుని మునిమనుమడైన కల్మష రహితుడైన శక్తికి మనుమడైన పరాశరుని కుమారుడైన, శుకమహర్షి తండ్రి అయిన ఓ వ్యాస మహర్షి నీకు వందనము.
‘ వ్యాసో నారాయణో హరిః ‘ అన్నారు. వ్యాస భగవానులు సప్త చిరంజీవులలో ఒకరు.
~ పద్మారామశర్మ శఖునవీటి