వైవిధ్యాల కథానికలు

కాళోజీ అవార్డు గ్రహీత డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ కథానికలను కూడా రచించారు. మూసధోరణిలో కాకుండా వైవిధ్యభరితంగా వాటిని తీర్చిదిద్దడం విశేషం. చదువుకునే దశ నుండి ఆయన కథానికలు రాస్తున్నారు. తొమ్మిదో తరగతి చదివేటప్పుడు చందమామ పిల్లల పత్రికలో ప్రచురణార్థం ‘రాజుకథ’ అనే కథ రాశారు. అయితే ఆ కథ అచ్చురూపంలోకి రాలేదు. వేణుగోపాల్ రాసిన కథానికల్లో వస్తువైవిధ్యం కనబడుతుంది. స్నేహితుడిని మోసం చేసిన డబ్బులతో వ్యాపారం ప్రారంభించడం, తనను గుర్తుపట్టకుండా ఉండడం కోసం అతడిని మరో ప్రాంతానికి […]

కాళోజీ అవార్డు గ్రహీత డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ కథానికలను కూడా రచించారు. మూసధోరణిలో కాకుండా వైవిధ్యభరితంగా వాటిని తీర్చిదిద్దడం విశేషం. చదువుకునే దశ నుండి ఆయన కథానికలు రాస్తున్నారు. తొమ్మిదో తరగతి చదివేటప్పుడు చందమామ పిల్లల పత్రికలో ప్రచురణార్థం ‘రాజుకథ’ అనే కథ రాశారు. అయితే ఆ కథ అచ్చురూపంలోకి రాలేదు. వేణుగోపాల్ రాసిన కథానికల్లో వస్తువైవిధ్యం కనబడుతుంది. స్నేహితుడిని మోసం చేసిన డబ్బులతో వ్యాపారం ప్రారంభించడం, తనను గుర్తుపట్టకుండా ఉండడం కోసం అతడిని మరో ప్రాంతానికి పంపే ప్రయత్నం చేయడం ‘వంచన’ కథావస్తువు. కేర్‌టేకర్ కావాలన్న ప్రకటనకు స్పందించి, దరఖాస్తు చేసుకున్న యువకులు అమ్మాయికి కేర్‌టేకర్‌గా ఉండొచ్చని ఆశ పడితే ఆఖరికి కుక్కకు కేర్‌టేకర్‌గా ఉండడం ఆ ఉద్యోగం అని తెలిసి నివ్వెరపోవడం ‘పూవులో ముళ్లు’ కథానికలో వస్తువు. మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయో విస్పష్టంగా చెప్పిన కథానిక ‘పిచ్చితల్లి’. ప్రలోభాలకు గురై వెళ్ళిపోయిన భార్యను భర్త తిరిగి స్వీకరించడం ‘విలువలు’ కథానిక వస్తువు. అత్తగారింటి హింసలకు కోడలు బలైన సంఘటనను ‘పువ్వురాలు కాలం’ కథానిక చిత్రించింది.
ఈ కథానికల్లో పాత్రలను చిత్రించిన తీరు అబ్బురపరుస్తుంది. ఆయా పాత్రలను సమగ్రంగా మలచడం కనబడుతుంది. ‘వంచన’ కథానికలో నారాయణ తను పనిచేసిన ెటల్ యజమానిని, గోవిందును మోసం చేస్తాడు. కుంటి వీరప్పను ప్రలోభపరిచి గోవిందును అడ్డం తప్పించేందుకు పావుగా వాడుకుంటాడు. ‘పిచ్చితల్లి’ కథానికలో అవ్వ మానసిక వ్యాధికి లోనవుతున్న దశను పట్టిచూపే యత్నం సమర్థవంతంగా చేశారు. తొమ్మిదేళ్లు పెంచి పెద్ద చేసిన అనంతరం మనవరాలు చూపిన ప్రేమరాహిత్యాన్ని అవ్వ తట్టుకోలేకపోతుంది. ఆ అవ్వ మానసిక చిత్రణ కథానికకు చక్కటి రూపునిచ్చింది. మొక్కలను పీకేయడం, కుండలోని నీళ్లను తనమీద గుమ్మరించుకుని కుండ పగులగొట్టడం ఆమె మానసిక వ్యాధి లక్షణాలను చూపించే ఘటనలు. అవసానదశలో తనకు లక్ష్మి సహాయంగా ఉంటుందని దొరసాని ఆ పాపను ప్రలోభపర్చడం, ఆ ప్రలోభాలకు లక్ష్మి లోనుకావడం మనుష్యుల స్వార్థ చింతనకు దృష్ట్యాంతాలు.
నిరుద్యోగం వల్ల మాధవరావు ఎదుర్కొన్న ఛీత్కారాలు, అతని మిత్రుడు విష్ణుమూర్తి టేక్ ఇట్ ఈజీ పాలసీ, కొత్తాపాతా తారతమ్యం లేని నళినీరావు కలుపుగోలుతనం చక్కగా చిత్రించిన కథానిక ‘పూవు లో ముళ్లు’. కాలేజీ దశ నుండి రాజు లోని మంచితనాన్ని చూపే ప్రయత్నం చేసిన కథానిక ‘విలువలు’. పెళ్ళి తర్వాత తన భార్య ప్రజ్ఞ తనను విడిచిపెట్టి వెళ్ళిపోవడంలోనూ తన తప్పు ఉందని చెప్పుకునే చక్కటి వ్యక్తిత్వం రాజు సొంతం. తనను వదిలివెళ్ళిన భార్య ను తిరిగి స్వీకరించి, మంచితనానికి పరాకాష్ఠగా నిలిచాడు.
పూలను అమితంగా ప్రేమించే నైజం ఉన్న ఉమలోని సున్నిత మనస్కురాలిని చిత్రించిన కథానిక ‘పువ్వురాలు కాలం’.గోడలో మొలిచిన గడ్డిమొక్కకు పూసిన నీలం రంగు పూలను ఉమ తదేకంగా చూడడం ద్వారా ఉమకు పూలపై ఉన్న పిచ్చి వ్యామోహం పాఠకులకు తెలుస్తుంది. కోడలిని హింసించే అత్త, రెండో పెళ్ళికి సిద్ధమైన భర్త శ్రీశైలం కుటిల స్వభావాలు కళ్లకు కట్టినట్టు చిత్రించారు రచయిత.
అమ్మంగి వేణుగోపాల్ కథానికల్లో వర్ణనలు వస్తు ప్రాధాన్యతను ఇనుమడింపజేస్తాయి. ‘వంచన’ కథానికలో నారాయణ ెటల్ సమీపంలోని వంతెన, మురికి వాగుల వర్ణన ద్వారా అక్కడి వాతావరణాన్ని తెలియపరుస్తారు. గుడిసె నుండి మేడకు దారిని వివరించడమూ వస్తు ప్రాధాన్యతను పెంచేందుకు చేసే యత్నమే. ‘పూవులో ముళ్ళు’ కథానికలో వదినెపై మాధవరావు అభిప్రాయాలను చిన్న చిన్న వాక్యాల తో వర్ణించారు. ‘బేబీ’ అనే కుక్క అందాన్ని మిసెస్ నళినీరావుచే వర్ణింపజేశారు. ఈ వర్ణన ‘బేబీ’ అంటే అమ్మాయే అనేంత స్థాయిలో ఉండడం మాధవరావు, విష్ణుమూర్తిలతో పాటు ప్రేక్షకులను కూడా పక్కదారి పట్టించేందుకు వేణుగోపాల్ చేసిన ప్రయత్నమే. తద్వారా కథనంలో బిగిని ఏమాత్రం సడలనీయకుండా నడిపిస్తారు రచయిత. ‘బేబీ’ ఎవరనే సందేహంతో చివరివరకు పాఠకుడిని చదివింపజేస్తారు.
పర్యావరణంపై సానుకూల దృష్టి అమ్మంగి వేణుగోపాల్‌కు ఉంది. ఈ విషయం ఆయన రాసిన కథానికల్లో గమనించవచ్చు. పైన పేర్కొన్న కథానికల్లోనూ రెండింటి పేర్లలో పూలున్నాయి.‘పువ్వురాలు కాలం’, ‘పూవులో ముళ్లు’ అనే పేర్లు పెట్టడం పర్యావరణంపై ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శనం. పర్యావరణ ప్రేమికుడికి మొక్కలంటే అమిత ప్రేమ ఉంటుంది. వారి దృష్టిలో మొక్కలను పీకేయడమంటే మరణించినట్టే. ఈ ప్రతీకనూ తన కథానికల్లో ఉపయోగించుకున్నారు. ‘పిచ్చితల్లి’ కథానికలో మొక్కలను పీకేయడం ద్వారా అవ్వ దృష్టిలో లక్ష్మి మరణించినట్టేనని సమర్థవంతంగా చెప్పారు. ‘పువ్వురాలు కాలం’ కథానికలో మొక్కలను దున్నపోతు ధ్వంసం చేస్తుంది. దీని ద్వారా ఉమ మరణానికి ఆమె భర్తే కారకుడని చెప్పగలిగారు. ‘పువ్వురాలు కాలం’ కథానికలో పూలకు సంబంధించిన వివిధ పోలికలను వాడారు. ఈ విధం గా పర్యావరణానికి సంబంధించిన వివిధ అంశాలను తన కథానికల్లో వాడుకుని, తనకు పర్యావరణంపై ఉన్న ఆసక్తిని వెల్లడిచేశారు రచయిత.
కథానికలకు పేర్లు పెట్టడంలోనూ వేణుగోపాల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మోసం కథావస్తువుగా ఉన్న కథానికకు ‘వంచన’ అని నేరుగా కథావస్తువు ధ్వనించే పేరు పెట్టారు. పిచ్చిగా పిల్లలను ప్రేమించే సున్నిత మనస్కులు ఆ పిల్లలు మానసికంగా దూరమైతే ఎలా బాధపడతారో చెప్పే కథానికకు ‘పిచ్చితల్లి’ అనే పేరు తీసుకున్నారు. పువ్వులంటే అమితంగా ఇష్టపడే పువ్వులాంటి ఉమ నేలరాలిపోయే కథానికకు ‘పువ్వురాలు కాలం’ అనే పేరు పెట్టారు. ‘విలువలు’ అనే పేరు పెట్టడం ద్వారా విలువలను త్రికరణశుద్ధితో ఆచరించాలనే సందేశం కథానికలో ఉంటుందని తెలియజేస్తారు. అమ్మాయిలను పూలతో పోలుస్తారు. మంచి భావనలను సైతం పూలతో పోల్చవచ్చు. అందుకే అమ్మాయిగా భావించిన బేబీ చివరికి కుక్క అని తేలే సన్నివేశంతో కూడిన కథను ‘పూవులో ముళ్లు’ గా పేర్కొన్నారు.
చెప్పబోయే అంశాన్ని పాఠకులకు నెమ్మదిగా ఇంజెక్ట్ చేసేందుకు కథానికల ప్రారంభాన్ని ఉపయోగించుకుంటారు వేణుగోపాల్. ‘పూవులో ముళ్లు’ కథానిక ఆరంభంలోనే మాధవరావు తన ఇంజనీరింగ్ సర్టిఫికెట్‌ను ఆనందంగా చూసుకుంటుంటాడు. అతని పెద్దన్నయ్య అతని డిగ్రీ వృధా అని విమర్శిస్తాడు. దీంతో ఇది ఒక నిరుద్యోగికి చెందిన కథగా పాఠకులకు అవగతమౌతుంది. ‘వంచన’ కథానిక ఆరంభం వంతెన పరిసర ప్రాం తాలను వర్ణించి కథానిక స్థలాన్ని పాఠకుడికి పరిచయం చేస్తుంది. ‘పిచ్చితల్లి’ కథానిక ఆరంభం వర్షాలతో నీటిమయమైన గుడిసెను, అందులోని అవ్వ, పాపల పరిస్థితిని వివరిస్తుంది. తద్వారా వారి పేదరికాన్ని గురించి చెప్పడం రచయిత లక్ష్యం. పాప లక్ష్మి మనసు మారడం వెనుక అసలు కారణం పేదరికమే.
‘విలువలు’ కథానిక ఆరంభంలో ఎంతో కాలంగా వెతుకుతున్న పుస్తకం దొరకడాన్ని పేర్కొని, తర్వాత మిత్రుడు కలుస్తాడన్న సూచన చేస్తారు రచయిత. మంచి పుస్తకం ఉత్తమ స్నేహితుడితో సమానం కదా! ‘పువ్వురాలు కాలం’ కథానిక ఆరంభంలో ఉమ తరగతికి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుడు అటెండెన్స్ తీసుకుంటూ ‘ఎస్.ఉమ’ అనే పేరులోని అక్షరాల్ని కలిపేసి ‘సుమ’ అంటాడు. తద్వారా ఉమకు ఆ పేరంటే ఇష్టమని పేర్కొనడం రచయిత ఉద్దేశ్యం. పూవులన్నా, పూలకు సంబంధించినవేవైనా ఆమెకు ప్రాణమని రచయిత ఈ సన్నివేశం ద్వారా తెలియపరుస్తారు. ఈ విధంగా కథానికల ఆరంభం కథాంశానికి చక్కని పునాదిని ఏర్పర్చడం అమ్మంగి వేణుగోపాల్ కథానికల స్వభావం. అమ్మంగి వేణుగోపాల్ కథానికల్లో తప్పకుండా చెప్పుకోవలసిన అంశం ముగింపు. ముగింపులో మెలికలుగానీ, ప్రతీకలుగానీ తప్పనిసరిగా ఉంటాయి. కరుణరసమో,హాస్యరసమో తొణికిసలాడుతుంది. ‘పిచ్చితల్లి’ కథానిక లక్ష్మికి అవ్వ దూరంగా వెళ్ళడంతో ముగుస్తుంది. ‘పండు రాలిపోతే రాలిపాయె, పూతను రాలగొట్టకు పుణ్యముంటది’ అని తాను చనిపోయినా మనవరాలికి ఏమీ కాకూడదని మొదట్లో దేవుడిని ప్రార్థించిన అవ్వ కథానిక చివరికొచ్చేసరికి తద్భిన్నంగా ప్రవర్తిస్తుంది. లక్ష్మి చనిపోయినట్టుగా భావిస్తుంది. కథానిక ముగింపు ప్రతీకాత్మకంగా ముగుస్తుంది. ఈ ముగింపులో అక్కడక్కడా ఉన్న చిన్న చిన్న మొక్కలను అవ్వ పీకేస్తుంది. మూకో నీళ్ల కుండ ఉంటే తన తల మీది నుండి నీళ్లు గుమ్మరించుకొని, ఖాళీ కుండను నేలకేసి కొడుతుంది. చెల్లాచెదురైన కుండ పెంకులను ఏరి తనగంతలో కట్టుకుంటుంది. ఈ ప్రతీకల ద్వారా లక్ష్మి ఇక తన దృష్టిలో చనిపోయినట్టేనని అవ్వ చెప్పకనే చెప్పినట్టు పాఠకునికి తెలిసిపోతుంది. ఆ విధంగా లక్ష్మికి నీళ్లు వదిలింది అవ్వ.
‘వంచన’ కథానిక ముగింపులో తనమనస్సు పూర్తిగా తేలికపడిందని, తన మోసాన్ని గుర్తించే గోవిందు బాధ ఇక లేదని నారాయణ సంతృప్తిపడతాడు. ఈ విషయాన్ని ‘ఆ రోజు ఎంత గిరాకి అయిందో తెలుసుకోడానికి నోట్లు లెక్కపెట్టసాగాడు’ అనే వాక్యంతో ప్రతీకాత్మకంగా చెప్పారు రచయిత. ‘పూవులో ముళ్లు’ కథానిక చక్కటి మెలికతో ముగుస్తుంది. మాధవరావు, విష్ణుమూర్తి సహా పాఠకులు కూడా ‘బేబీ’ అంటే మిసెస్ నళినీ రావు కూతురే కావచ్చనుకుంటారు. కథానిక చివరికొచ్చేసరికి కుక్క అని తెలిసి ఆశ్చర్యంలో మునిగిపోతారు పాఠకులు. ‘విలువలు’ కథానిక గార్డు పచ్చజెండా ఊపడం అనే ప్రతీకతో ముగుస్తుంది. రాజుప్రజ్ఞల కొత్త జీవితానికి ఊపిన పచ్చజెండాయే అది. ‘పువ్వురాలు కాలం’ కథానిక కూడా ప్రతీకలతోనే ముగుస్తుంది. అత్తగారింటికి శ్రీశైలం వెళ్ళినప్పుడు దున్నపోతు మల్లెపందిరిని నేలమట్టం చేస్తుంది. ఇత ర పూలమొక్కలపై కూడా ప్రతాపం చూపిస్తుంది. ఆ మల్లె పందిరి ఉమ. దున్నపోతు శ్రీశైలం. అతను చేసి న జీవన విధ్వంసాన్ని ప్రతీకాత్మకంగా చెప్పారు రచయిత. అతను తన భార్య ఉమ అంత్యక్రియలు చేయడంతో విషాదాంతంగా ముగుస్తుంది ఈ కథానిక.
అమ్మంగి వేణుగోపాల్ రచించిన కథానికల్లో వైవి ధ్యం సుస్పష్టంగా కనబడుతుంది. ఆయన సాహిత్య స్వర్ణోత్సవం ఫిబ్రవరి మూడున జరుగనున్నది. ఈ సందర్భంలో ఆయన సాహిత్య సృజనను ఒకసారి అవలోకిస్తే విభిన్న ప్రక్రియల్లో విస్తృతంగా కృషి చేసిన అమ్మంగి కథానిక రచనపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం లోటుగా కనబడుతుంది. కథానిక రచనపై ఆయన దృష్టి కేంద్రీకరిస్తే జాతీయ స్థాయి అవార్డుల కథకుడు మనకు లభించేవారు.

 డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు
9441046839

Comments

comments

Related Stories: