వైతాళికుడు వట్టికోట

aa

జాతిని జాగృత పరిచి నూతన సమాజ ఆవిర్భావానికి కారకులైన బుద్ధి జీవులను, సామాజిక కార్యకర్తలను ‘వైతాళికులు’ అని అంటారు. అటువంటి వైతాళికులలో వట్టికోట ఆ ళ్వారుస్వామి ఒకరు. తెలంగాణ జాతిని జాగృత పరచడానికి ఒక చేతిలో గన్ను, మరో చేతిలో పెన్ను పట్టి మట్టి గడ్డపై పోరు విత్తనాలు చల్లి ఉద్యమ సుమాలను విరబూయించిన మహోన్నత వ్యక్తి వట్టికోట ఆళ్వారుస్వామి. నాటి తెలంగాణ సమాజం ఒక వైపు వలస వా దం కింద, మరో వైపు భూస్వామ్యం కింద నలిగింది. ఈ స్థితిలో తన సామాజిక బాధ్యత నెరవేర్చడమే గాక బహుముఖ రంగాలలో తన మార్గదర్శకత్వాన్ని అందించిన నవయుగ తెలంగాణ వైతాళికుడు, అక్షర శిల్పి మన వట్టికోట ఆళ్వారుస్వామి. 1915 నవంబరు 1న నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ సమీపంలోని చెర్వు మాధవరం గ్రామంలో జన్మించిన వట్టికోట చిన్న తనంలోనే తల్లి సింహాద్రమ్మ, తండ్రి రామచంద్రాచార్యులను పోగొట్టుకున్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ కడుపేదరికాన్ని అనుభవించిన మట్టి బిడ్డ ఆళ్వారుస్వామి తల్లిదండ్రుల మరణానంతరం పరాయి ఇండ్లలో వంటపని చేసి శ్రామిక వృత్తిలో జీవనం సాగించాడు. హోటల్‌లో సర్వర్‌గా నాలుగు రూపాయల జీతంతో పనికి కుదిరాడు. నకిరేకల్‌లోని కాంచనపల్లి సీతారామరావు అనే ఉపాధ్యాయుడి దగ్గర ఇంట్లో వండిపెడుతూ అక్షరాలు దిద్దినాడు. తదనంతరం సూర్యాపేటకు నివాసం మార్చిన తర్వాత కోదాటి నారాయణరావు గ్రంధాలయానికి వెళ్ళడం అలవాటైంది. అక్కడే పత్రికలు, గ్రంథాలు అధ్యయనం చేయడం ప్రారంభించాడు. విజయవాడలో కొద్ది కాలం పాటు హోటల్ కార్మికుడిగా పనిచేస్తూ నాటి స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపాడు. 1933లో హైదరాబాద్ వచ్చి ‘గోల్కొండ’ పత్రికలో ప్రూఫ్ రీడర్‌గా పనిచేశాడు. 1938లో ‘దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి దాని ద్వారా ప్రముఖ రచయిత, కవులు రాసిన పుస్తకాలు ప్రచురించి ఊరూర గ్రంథాలు పంచుతూ లోకాన్ని చైతన్యం గావించాడు.
1937లో నిజామాబాద్‌లో జరిగిన ఆంధ్రమహాసభలో పాల్గొని ఆళ్వారుస్వామి అతివాదుల పక్షాన నిలిచాడు. 1942లో ‘క్విట్ ఇండియా’ ఉద్యమ స్ఫూర్తితో సత్యాగ్రహం చేసి సికింద్రాబాద్‌లో జైలు జీవితం గడిపాడు. స్టేట్ కాంగ్రెస్, ఆర్య సమాజం, ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ, అభ్యుదయ రచయితల సంఘం వంటి సామాజిక సాహిత్య సంస్థలన్నింటిలో కార్యకర్తగా, నాయకుడిగా పనిచేశారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు రావి నారాయణరెడ్డి బద్దం ఎల్లారెడ్డి లతో కలిసి నడిచారు. స్వాతంత్య్ర, సాహిత్య రంగాలలో చురుకుగా పని చేస్తూ ప్రజాహిత ప్రభుత్వానికై డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేపట్టిన మహనీయుడు. 1946లో నిజామాబాద్ జైలులో ఉన్నప్పుడే ..“ఓ నిజాము పిశాచమా? కానరాడు/ నిన్ను పోలినరాజు మాకెన్నడేని / తీగలను తెంపి అగ్నిలో దింపినావు/ నా తెలంగాణ కోటి రతనాల వీణ” అనే వాక్యాలను జైలు గోడల మీద దాశరథితో కలిసి బొగ్గుతో రాశాడు. జైలు అధికారులు ఎన్నిసార్లు చెరిపినా తిరిగిరాస్తూ పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నాడు. ఆళ్వారుస్వామి జైలులో ఉన్నప్పుడే అక్కడి ఖైదీలతో ఏర్పడ్డ సంబంధాలతో “జైలులోపల” పేరిట కథలు రాశాడు. వట్టి కోట ఆళ్వారుస్వామి రాసిన “ప్రజల మనిషి” నవల తొలి తెలంగాణ నవలగా ప్రసిద్ధి గాంచింది. తెలంగాణ ప్రాంతంలో నాటి పట్వారీలు, ప్రభుత్వాధికారులు చేస్తున్న దోపిడికి, దౌర్జన్యాన్ని ఎలుగెత్తిన నవల, సమస్యల పరిష్కారం కోసం పోరాటమే తీర్పు వేరే మార్గం లేదని ప్రబోధించిన నవల… ప్రజల మనిషి. ఈ నవలలో ప్రజల మనిషి ‘కంఠీరవం’ పాత్ర వట్టికోట ఆళ్వారుస్వామితో పోల్చదగింది. ఇక రెండో నవల ‘గంగు’ అసంపూర్తి రచన అయినప్పటికీ నాటి తెలంగాణ సాయుధపోరాటం స్థితిగతులను వివరించి నూతన చైతన్యానికి ప్రతీకగా నిలిచింది. స్వాతంత్య్రానంతరం పరిణామాలతో నిరాశ చెందిన ఆళ్వారుస్వామి నాటి రాజకీయ నాయకులపై, సామాజిక స్థితిగతులపై వ్యంగ్యంగా సంధించిన అస్త్రమే, ‘రామప్ప రభస’ వ్యాసాలు.
1951లో ‘గుమస్తా’ అనే పత్రిక స్థాపించి వారి హక్కుల కోసం పోరాడినాడు. తాను జీవించిన 46 సం॥రాలలో 22 సం॥రాలు నిరంతరం ప్రజల కోసం ప్రజల మధ్య గడిపినాడు. 1953 వరకు జైలులోనే ఉన్న ఆళ్వారు తదనంతరం రాజకీయాల కతీతంగా కొంత కాలం గడిపి తర్వాత కమ్యూనిస్టుగా మారాడు. దాశరథి చేత “అబద్ద అసురుల పాలిట తల్వార్ ఆళ్వార్‌” అని, 12 మంది ఆళ్వారులలో ఒకరు అయ్యారని కాళోజీ చేత పిలువబడ్డ నిఖార్పైన వ్యక్తి. ఆళ్వారుస్వామి 1961 ఫిబ్రవరి 5న తుదిశ్వాస విడిచినాడు. ఆయన మన మధ్య భౌతికంగా లేక పోయినా ఆయన స్ఫూర్తి మనకు మార్గదర్శనం అవుతుంది. తెలంగాణ ప్రజల జీవితాన్ని, సంస్కృతి, తిరుగుబాటు తత్వాన్ని పోరాట నేపథ్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని ప్రజలలో చైతన్యం గావించిన గొప్ప రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి. గ్రంథ పఠనం వల్ల లోక జ్ఞానం కలుగుతుందని, సమాజాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని ఊరూర గ్రంథాలయోద్యమం నిర్వహించి ప్రచారం గావించిన మట్టి మనిషి వట్టి కోట. నిబద్ధత కలిగిన వ్యక్తే గాకుండా చెప్పింది జీవితంలో ఆచరించిన మహనీయుడు ఆయన. ఆయన జీవితంపై ప్రజలలో మరింత అవగాహన కలిగే విధంగా కృషి చేయడమే మనం ఆయనకిచ్చే ఘనమైన నివాళి కాగలదని ఆశిద్దాం.

కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి
9441561655

Comments

comments