వేతన అసమానత పేదరికం

అభివృద్ధి గూర్చి, జిడిపి వృద్ధి రేటు గూర్చి ప్రభుత్వాలు ఎన్ని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ దాని ఫలితం శ్రామిక ప్రజల జీవన మెరుగుదలలో ప్రతిఫలించటం లేదనేది వాస్తవం. జిడిపి వృద్ధిరేటులో మొనగాళ్లం తామంటేతామని యుపిఎ, ఎన్‌డిఎ నేతలు జబ్బలు చరుస్తున్నప్పటికీ దేశ సంపద సృష్టిలో 73 శాతం 1 శాతం వ్యక్తుల హక్కుభుక్తమైనట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. సంపద పంపిణీలో అసమానత, వేతనాలలో తీవ్ర అసమానతతో శ్రమ దోపిడీ విచ్చల విడిగా సాగుతున్నది. వేతన అసమానతలను ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ […]

అభివృద్ధి గూర్చి, జిడిపి వృద్ధి రేటు గూర్చి ప్రభుత్వాలు ఎన్ని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ దాని ఫలితం శ్రామిక ప్రజల జీవన మెరుగుదలలో ప్రతిఫలించటం లేదనేది వాస్తవం. జిడిపి వృద్ధిరేటులో మొనగాళ్లం తామంటేతామని యుపిఎ, ఎన్‌డిఎ నేతలు జబ్బలు చరుస్తున్నప్పటికీ దేశ సంపద సృష్టిలో 73 శాతం 1 శాతం వ్యక్తుల హక్కుభుక్తమైనట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. సంపద పంపిణీలో అసమానత, వేతనాలలో తీవ్ర అసమానతతో శ్రమ దోపిడీ విచ్చల విడిగా సాగుతున్నది. వేతన అసమానతలను ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఒ) తాజా నివేదిక ఎండగట్టింది. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు అమలుపరిచిన తొలి రెండు దశాబ్దాల్లో (19912011) సగటు దిన నిజ వేతనాలు దాదాపు రెట్టింపు అయినాయి; అయితే తక్కువ స్థాయి వేతనం, వేతన అసమానత తీవ్రమైన సమస్యగా కొనసాగుతున్నదని ఐఎల్‌ఒ విశ్లేషణ తెలిపింది. ఈ అసమానత గ్రామీణ పట్టణ, పురుషులు స్త్రీలు, రెగ్యులర్ క్యాజువల్ కార్మికుల మధ్య అంటే అన్ని స్థాయిలో ఉన్నట్లు పేర్కొన్నది. సగటు వేతనంలో ప్రాంతీయ అసమానతలు కాలక్రమేణా పెరిగినట్లు వెల్లడించింది.

ప్రభుత్వ విధాన నిర్ణయాల ఫలితాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలన్నా, విశ్లేషించాలన్నా గణాంక సమాచారాన్ని ఎప్పటికప్పుడు తాజా పరుస్తూ ఉండాలి. కాని అటువంటిదిలేనందున 201112 సమాచారంపై ఆధారపడటం తమ విశ్లేషణకు అవరోధమైనట్లు ఐఎల్‌ఒ పేర్కొన్నది. జాతీయ శాంపిల్ సర్వే కార్యాలయం (ఎన్‌ఎస్‌ఎస్‌ఒ) ఉపాధి నిరుద్యోగంపై కడసారి సర్వే చేసింది ఆ సంవత్సరమే. అది యుపిఎ ప్రభుత్వ కాలం. మరి ఎన్‌డిఎ ప్రభుత్వంలో వేతనాలు ఎంతమేరకు పెరిగాయి, అసమానత తగ్గిందా, పెరిగిందా విశ్లేషించాలంటే ఈ లెక్కన మరెన్నో సంవత్సరాలు వేచి ఉండక తప్పదు. అప్పటికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో గదా!

ఐఎల్‌ఒ సోమవారం ప్రచురించిన వేతన నివేదిక ప్రకారం 2009 10 లో వేతన కార్మికులందరిలో మూడవ వంతుకు జాతీయ కనీస వేతనం కన్నా తక్కువ చెల్లించారు. క్యాజువల్ కార్మికుల్లో 41 శాతం, వేతన కార్మికుల్లో 15 శాతం వారిలో ఉన్నారు. 201112 లో భారతదేశంలో రోజుకు సగటు వేతనం రూ. 247. అది 1993 94 లోని సంఖ్య రూ. 128కి దాదాపు రెట్టింపు. అయితే సగటు వేతన ఉత్పాదకత నిజ సగటు వేతనం కన్నా వేగంగా పెరిగింది. వేతన పెరుగుదల గ్రామీణ ప్రాంతాల్లో క్యాజువల్ కార్మికులకు మరింత శీఘ్రంగా పెరిగింది. ప్రాతిపదికగా తీసుకున్న సంవత్సరంలో వారి వేతనం అతి తక్కువ స్థాయిలో ఉన్నందున వేతన పెరుగుదల హెచ్చుగా కనిపిస్తున్నది. అయినప్పటికీ వేతన వ్యత్యాసం కొనసాగుతున్నది. ఆదాయార్జన జనాభాలో 62 శాతంగా ఉన్న క్యాజువల్ కార్మికుల సగటు వేతనం రోజుకు రూ. 143 మాత్రమే. పట్టణ ప్రాంతాల్లో దిన వేతనాలు (రూ. 384) గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే (రూ. 175) రెట్టింపుకుపైగా ఉన్నాయి. పురుషులు స్త్రీల మధ్య వేతన వ్యత్యాసం 199394 లో 48 శాతం ఉండగా, 201112లో 34 శాతానికి తగ్గింది. అంతర్జాతీయ ప్రమాణాలతో (23 శాతం) చూచినపుడు ఈ వ్యత్యాసం ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉంది.

ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన నాటి నుంచి ప్రభుత్వాలు పెట్టుబడి అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వం కార్మిక సంస్కరణల పేరుతో శ్రమ జీవులను అణచివేస్తున్నది. కనీస వేతన చట్టాల అమలు అటకెక్కింది. కార్మికుల సమష్టి బేరసారాల యంత్రాంగం పనిచేయటం మానేసింది. విధిలేక కార్మికులు ఎక్కడైనా సమ్మె చేస్తే హింస ఎదురవుతున్నది, ఉద్యోగ ఉద్వాసనకు గురికావలసి వస్తోంది. జాతీయ కనీస వేతనం అంటూ భారత ప్రభుత్వం ప్రకటించినా, రివిజన్ చేసినా దాన్ని పట్టించుకునే యజమాని లేడు. ఎందుకంటే అది సూచనాత్మకం తప్ప చట్టబద్ధ ఆదేశం కాదు. ప్రభుత్వమే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పని పద్ధతులు ప్రవేశపెట్టి తక్కువ వేతనాలు చెల్లిస్తోంది. ఇక ప్రైవేటు రంగాన్ని శాసించే దెవరు? వేతనాలు పెరిగినట్లు కనిపిస్తున్నా ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరుగుతూ వాటి నిజ విలువ తరుగుతూ జీవితాలు దుర్భరమవుతున్నాయి. ఆదాయార్జన జనాభాలో 62 శాతం అతి తక్కువ వేతనాలకు పని చేస్తున్న క్యాజువల్ కార్మికులైనందున వారు పేదరికం అంచునే ఉన్నారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న కోట్లాది మందికి వీరు అదనం. పేదలను ఆదుకోవటానికంటూ ప్రభుత్వాలు ఎన్ని తాయిలాలు (ఓట్ల కోసం) ప్రకటించినా అవి ఉపాధి, వేతన ఆర్జనకు ప్రత్నామ్నాయం కాజాలవు. అందువల్ల, కనీస వేతనాలను గణనీయంగా పెంచి చట్టబద్ధంగా అమలు చేస్తే దాని ప్రభావం పేదరికం తగ్గుదలకు దారి తీస్తుంది.