వెలుగుల శకం

Eye-Test

సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అన్ని అవయవాల్లోకీ కన్ను చాలా సున్నితమైంది. ప్రధానమైంది. కంట్లో చిన్న నలక పడినా అల్లాడిపోతుంటాం. అలాంటిది అంధత్వాన్ని తల్చుకుంటేనే భయమేస్తుంది. మన శరీరంపై జీవనవిధానం, తినే తిండి ఇవన్నీ ప్రభావం చూపుతాయి. ఈమధ్య ప్రతి ఒక్కరూ కంప్యూటర్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగించేవారే. వీటి ప్రభావం కంటిపై ఎంతో పడుతుంది. సరైన నిద్ర లేకపోవడం, పగలూ రాత్రి తేడాలేకుండా పనిచేయడాలు, పోషకాహార లోపం, బర్గర్లు, పి జ్జాల వంటి చిరుతిండ్లు…వీటన్నింటి ప్రభావం శరీరంపై తప్పకుండా పడుతుంది. ఆకుకూరలు తక్కువగా తినడం, ఇంటి భోజనం తినకపోవడం, కాలుష్యప్రభావం, చీకట్లో సెల్‌ఫోన్లు చూడటం …ఇలాంటి అలవాట్లు అప్పటికప్పుడు ఎఫెక్ట్ కాకున్నా దీర్ఘకాలంలో రోగాలపాలయ్యేలా చేస్తాయి. ఆరోగ్యానికి ధనిక పేదా అనే తేడా ఉండదు.దేశంలో ఎక్కడా ప్రవేశపెట్టని కంటి వెలుగు అనే కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు, అద్దాలు, ఆపరేషన్లు చేయించడానికి సిద్ధంకానుంది. ఈ పథకానికి పేద ధనిక తేడాలేదు. పట్నం పల్లె అనిలేదు.

వృద్ధుల బాధలు చూడలేకనే…

గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు కంటిచూపు సమస్యతో బాధపడుతున్న దృశ్యాలను ముఖ్యమంత్రి స్వయంగా గమనించిన తర్వాత ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. దృష్టిదోషంతో బాధపడుతున్న వృద్ధులు అక్షరాలను చూడలేక పక్కనవున్నవారితో చదివి వినిపించుకుంటున్నట్లు స్వయంగా గమనించారు. సకాలంలో ఈ సమస్యను పరిష్కరించకపోతే మొత్తానికే చూపు పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసి గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేయడం అవసరమని భావించారు. దాని పర్యవసానమే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమవుతున్న ‘కంటివెలుగు’. గ్రామాల్లో చాలా మంది అవగాహనాలేమితో దృష్టిదోషం వచ్చిందన్న అంశాన్ని కూడా గుర్తించలేకపోతున్నారని, కొన్ని సందర్భాల్లో ఇతరులపై ఆధారపడే అవకాశం కూడా ఉండడంలేదని సిఎం గ్రహించారు. మరికొన్ని సందర్భాల్లో తగిన ఆర్థిక వనరులు లేక కంటి వైద్యుల దగ్గరకు వెళ్ళలేకపోతున్నారని, కళ్ళజోళ్ళు కొనుక్కునే ఆర్థిక స్థోమత కూడా వారికి లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ అర్థం చేసుకున్నారు. సకాలంలో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం ద్వారా మరింత ముదరకుండా చేయడంతో పాటు సమాజానికి వారి ఉత్పాదకతను వినియోగించుకోవచ్చని భావించారు. ఎట్టకేలకు ‘కంటి వెలుగు’ ద్వారా ఒక చక్కటి పరిష్కారం లభిస్తుందని నిర్ణయం తీసుకున్నారు. కంటి సమస్యలను నివారించడం ద్వారా ప్రభుత్వానికి ఒక మేరకు ఖర్చు అవుతున్నప్పటికీ దీర్ఘకాలంలో వారివారి పనులను చేసుకోవడంపై దృష్టిని కేంద్రీకరించవచ్చునని, అంతిమంగా అది తెలంగాణ సమాజానికి ఉపయోగపడుతుందని, ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఏర్పడదని సిఎం అభిప్రాయపడినట్లు వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు వివరించారు.

ఏటేటా పెరుగుతున్న దృష్టిదోషం సమస్య :

సమైక్య రాష్ట్రంలో (2001లో) అంధత్వ సమస్యపై అప్పటి ప్రభుత్వం ఒక సర్వేను నిర్వహించినప్పుడు మొత్తం జనాభాలో దాదాపు 1.84% మంది దృష్టిదోష సమస్యలతో బాధపడుతున్నారని, ఇందులో మెజారిటీ కేసులను వైద్యం ద్వారా పరిష్కరించవచ్చునని తేలింది. కేవలం ఒక రాష్ట్రంలోనేకాక దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నట్లు తేలింది. 2001 నాటికి దేశం మొత్తంమీద 1.87 కోట్ల మందికి దృష్టిదోష సమస్య ఉన్నట్లు తేలగా 2020 నాటికి ఇది రెట్టింపై 3.16 కోట్ల మందికి చేరుకునే అవకాశం ఉందని ఆ సర్వే అంచనా వేసింది. దాని కొనసాగింపుగా జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో అధ్యయనం చేయించగా 1980లో కేవలం దేశ జనాభాలో ఒకటిన్నర శాతం మందికి మాత్రే కంటి సంబంధ సమస్యలు ఉన్నట్లు తేలితే ఇరవై ఏళ్ళలో అది గణనీయంగా పెరిగినట్లు తేలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 7.14 లక్షల మందికి కాటరాక్ట్ సంబంధ సమస్యలు ఉన్నట్లు తేలింది. సుమారు 1.60 లక్షల మందికి మయోపియా, 22 వేల మందికి హైపరోపియా లాంటి సమస్యలు ఉన్నాయని, సుమారు 53 వేల మందికి కాటరాక్ట్ సర్జరీలు చేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ఐ డిజీజెస్ స్టడీ తేల్చింది. సకాలంలో వైద్యం చేయించినట్లయితే దాదాపు 90% కార్నియల్, గ్లకోమా సంబంధ వ్యాధులను అరికట్టవచ్చునని తన అధ్యయనంలో తేల్చింది.
ఎక్కువగా నలభై ఏళ్ళ పైబడినవారిలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోనే ఈ సమస్యలు అధికంగా ఉన్నట్లు ఆ అధ్యయనంలో తేలింది. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 6150 మందిని పరీక్షించగా 82% (4824 మందికి) ప్రజలకు దృష్టిదోషంపై కనీస అవగాహన లేదని తేలింది. ఆదిలాబాద్ జిల్లాలోనైతే అప్పటికే కొద్దిమంది కళ్ళజోళ్ళు వాడుతున్నట్లు తేలింది. ప్రజలు ఎదుర్కొంటున్న దృష్టిదోషం సమస్యల్లో దాదాపు 90% వరకు సకాలంలో చికిత్స చేయడం ద్వారా నివారించగలిగినవేనని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఎక్కువ మందికి దూరంగా ఉండే వస్తువులను గమనించడంలోనే సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయిందని పేర్కొనింది.
దేశంలోనే మొదటిసారి..

Eye-test-2

కంటి వెలుగును విజయవంతం చేయడానికి ప్రభుత్వం ప్రకడ్బందీ ప్రణాళికను రూపొందించింది. ఆగష్టు 15వ తేదీ నుంచి జనవరి వరకు ఈ పథకం కొనసాగనుంది. దీనికోసం ప్రభుత్వం సుమారు రూ.50 నుంచి రూ.100 కోట్లను కేటాయించింది. కంటి అద్దాలతో పాటు మందులు, ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఈ పథకాన్ని మన రాష్ట్రంలో ప్రవేశపెడుతోంది. గతంలో ఈ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను చాలా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి. ఈ పథకాన్ని కూడా దేశవ్యాప్తంగా విజయవంతం చేయాలని,ఇందుకోసం ప్రభుత్వం పక్కా ప్రణాళికలను రూపొందించింది. ఈ నేపథ్యంలో శిబిరాల నిర్వహణకు సంబంధించి అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. శిబిరాలకు సంబంధించి స్థానికంగా రెవెన్యూ అధికారులే ఏర్పాట్లను చూసుకోనున్నారు.

కంటి వైద్యానికి సరైన చికిత్స లేక….

గ్రామీణ ప్రాంతాల్లో కంటికి సంబంధించిన వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా గ్రామాల్లో కంటి వైద్యానికి సరైన చికిత్సా సౌకర్యం లేదు. కంటికి సంబంధించి సరోజినీ ఆస్పత్రి తప్ప మరో ఆస్పత్రి లేదు. కంటికి సంబంధించిన ఆస్పత్రులు ప్రస్తుతం ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో దీనికి సంబంధించి సిబ్బంది కూడా ఉండేవారు కాదు. జిల్లా ఆస్పత్రుల్లో ఒకరు లేదా ఇద్దరు ఆప్టోమెట్రిస్ట్‌లు ఉండేవారు. గ్రామాల నుంచి కంటికి సంబంధించిన వ్యాధితో వచ్చిన వారికి అక్కడ ఉన్న కొద్ది పాటి పరికరాలతో వారిని పరీక్షించి సరోజీని ఆస్పత్రికి పంపించే వారు. ఇందులో ఎక్కువగా పేదలే ఉండేవారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది ఆప్టోమెట్రిస్ట్‌లు ఉంటే సరోజినీ ఆస్పత్రితో పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లోనే వారు సేవలను అందించేవారు. దీంతో పేదలకు కంటి వైద్యం అందని ద్రాక్షగా మారింది. కంటి వెలుగు పథకం ప్రకటించిన తరువాత మరో 50 మంది రెగ్యులర్ పోస్టులను ప్రభుత్వం కొత్తగా నియమించుకుంది. వీరు ప్రస్తుతం పీహెచ్‌సీలలో అందుబాటులో ఉండనున్నారు. దీంతోపాటు అన్ని జిల్లా ఆస్పత్రుల్లో కంటికి సంబంధించిన వ్యాధులను గుర్తించడా\
నికి చికిత్స చేయడానికి ప్రభుత్వం నిధులను కేటాయించింది.

కంటి వెలుగు లక్ష్యాలు.. వాటికి సంబంధించి ఏర్పాట్లు…

రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించడం. అద్దాలను ఉచితంగా పంపిణీ చేయడం, కంటి ఆపరేషన్‌లతో పాటు ఇతర చికిత్సలను ఉచితంగా నిర్వహించడమే కంటి వెలుగు పథకం లక్షంగా ప్రభుత్వం నిర్దేశించింది. వీటితో పాటు సాధారణ కంటి వ్యాధులకు మందులను అందించడం, హానికరమైన కంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడం లాంటివి ఈ శిబిరాల్లో నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ, గ్రామాల్లో ఈ శిబిరాలను నిర్వహించనున్నారు. ప్రతి వైద్య శిబిరంలో వైద్యాధికారి, ఆప్టోమెట్రిస్ట్, ఎఎన్‌ఎంలు, సూపర్‌వైజర్‌లు, ఆశావర్కర్లు, 6 నుంచి 8 మంది సహాయ బృందాలు పనిచేస్తాయి. ప్రతి బృందానికి ఒక వాహనం సమకూర్చుతారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే శిబిరంలో 250 మందికి, పట్టణ ప్రాంతాల్లో 300 మంది కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో సుమారు 40 శాతం మందికి అద్దాలు లేదా శస్త్ర చికిత్సలు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. దీనికి సంబంధించి షెడ్యూల్‌ను అధికారులు ఇప్పటికే రూపొందించారు. ప్రతి జిల్లాలో అత్యవసర పరిస్థితుల దృష్టా 4 నుంచి 6 మంది అదనపు వైద్యాధికారులను, ఆప్టోమెట్రిస్ట్‌లను అందుబాటులో ఉంచారు. 940 మంది వైద్యాధికారులు, 1000 మంది ఆప్టోమెట్రిస్టులు, దాదాపు 8,000ల మంది సహాయక సిబ్బంది మొత్తం 799 బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ శిబిరాల్లో వైద్యులు పాల్గొనడం వల్ల పీహెచ్‌సీలకు ఇబ్బందులు తలెత్తకుండా ఒక్కో పీహెచ్‌సీలో ఒక్కరిని కచ్చితంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

శిబిరాల నిర్వహణ…భాగస్వాముల వివరాలు…

పాఠశాలలు, సామాజిక భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, ఏదైనా ఇతర ప్రభుత్వ భవనాల్లో ఈ శిబరాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా శిబిరాలను నిర్వహించే తేదీని ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 9 గంటలకు ఈ శిబిరం ప్రారంభమై సాయంత్రం 5 గంటలు ముగుస్తుంది. ఈ శిబిరాల్లో కింద పేర్కొన్న విధంగా కంటి సేవలను అందించనున్నారు.
-స్నెల్లెన్ చార్టు సాయంతో ప్రాథమిక కంటి పరీక్ష (అన్ ఎయిడెడ్ విజువల్ ఆక్యుటీ)
-కచ్చితమైన కంటి పరీక్ష (ఆబ్జెక్టివ్ రిఫ్రాక్షన్ అండ్ సబ్జెక్టివ్ రిఫ్రాక్షన్)
-అవసరమైన మందుల పంపిణీ, కంటి అద్దాల పంపిణీ
-కంటి శస్త్ర చికిత్సలు, అవసరమైన వారిని గుర్తించి ఆస్పత్రులకు రెఫర్ చేయడం.
సాధారణ రిఫ్రాక్టివ్ దోష దిద్దుబాట్లకు సంబంధించి అదే రోజున శిబిరంలోనే రీడింగ్ గ్లాసెస్ ఇస్తారు. ప్రిస్క్రిప్షన్ ప్రకారం కంటి అద్దాలను తయారు చేయాల్సి ఉన్నందున ప్రధాన శాఖలను భాగస్వాములను చేయాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం ఈ విధంగా అంచనా వేస్తోంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

రాష్ట్ర స్థాయిలో నోడల్ ఆఫీసర్…

కంటి వెలుగుకు సంబంధించిన కార్యక్రమానికి రాష్ట్ర నోడల్ ఆఫీసర్‌గా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కరుణ వాకాటిని ప్రభుత్వం నియమించింది. పాత పది జిల్లాలకు ఒక నోడల్ ఆఫీసర్‌ను జిల్లా నోడల్ ఆఫీసర్‌గా డీఎంహెచ్‌ఓలను ప్రభుత్వం నియమించింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కంటి పరీక్షల వైద్య శిబిరాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో జరిగే ఈ కార్యక్రమానికి డీఎంహెచ్‌ఓలు, కలెక్టర్లకే ప్రభుత్వం పూర్తి బాధ్యత అప్పగించింది. ఎంపిక చేసిన ప్రతి టీంలో ఐదుగురు సభ్యులు ఉంటారు. అందులో ఒక డాక్టర్, ఆప్టోమెట్రిస్ట్ట్, ఫార్మాసిస్టు, డాటా ఎంట్రీ ఆపరేటర్‌తో పాటు నర్సు ఉంటారు.

అంధత్వ నివారణే ప్రభుత్వ ధ్యేయం

రాష్ట్ర వ్యాప్తంగా 3.2 కోట్ల మందికి స్క్రీనింగ్ టెస్టులను నిర్వహిస్తాం. మొదటి విడతగా 40లక్షల అద్దాలు పంపిణీ చేయనున్నాం. మిగతావి అవసరాలకు అనుగుణంగా సమకూర్చుతాం. హైదరాబాద్‌లో ఎక్కువ అద్దాలు అవసరమవుతాయని గుర్తించాం. రాష్ట్ర వ్యాప్తంగా 3.2 కోట్ల మందికి కంటికి సంబంధించి స్క్రీనింగ్ టెస్టులను చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దగ్గరి చూపునకు సంబంధించి అద్దాలు శిబిరాల్లోనే అందజేస్తాం. దూరం చూపునకు సంబంధించి అద్దాలకు సమయం తీసుకుంటాం. ఆరోగ్య శ్రీ పథకం కింద కంటి ఆపరేషన్లు చేయడానికి కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు  ముందుకొచ్చాయి.

కరుణ వాకాటి
రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ
సంక్షేమ శాఖ కమిషనర్

వర్తింపయ్యే మొత్తం జనాభా 3.50 లక్షలు
కంటి అద్దాల సంఖ్య 40 లక్షలు
ప్రథమ శ్రేణి సంరక్షణకు సంబంధించి అంచనా వేసిన ప్రజల సంఖ్య 50 లక్షలు
ద్వితీయ శ్రేణి సంరక్షణకు సంబంధించి అంచనావేసిన ప్రజల సంఖ్య 2.6 లక్షలు
తృత్రీయ శ్రేణి సంరక్షణకు సంబంధించి అంచనావేసిన ప్రజల సంఖ్య 0.15 లక్షలు
ఇంత మంది జనాభా కంటి వెలుగు కార్యక్రమం కింద శిబిరాల్లో పాల్గొంటారని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది.

 ఇప్పటికే ట్రయల్న్ నిర్వహించాం

ఇప్పటికే అన్ని జిల్లాల్లో ట్రయల్ రన్ నిర్వహించాం. అధికారులతో పాటు సిబ్బంది శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు. అదనపు సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీల్లో కంటికి సంబంధించిన పరికరాలను సమకూర్చాం. గ్రామంలో ఎప్పుడు శిబిరాలను నిర్వహిస్తారన్న విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందిస్తాం.

శ్రీనివాసరావు
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సంచాలకులు

                                                                                                                                       ఎల్.వెంకటేశం

                                                                                                                                  స్టేట్ బ్యూరో రిపోర్టర్