వెనకడుగేస్తున్న ఏడడుగులు

The diversion of the divorce

కాపురాల్లో కలతలు
ఆలు మగల మధ్య బేధాభిప్రాయాలు
విడాకులకు దారి తీస్తున్న వైనం
ఒకొరినొకరు అర్థం చేసుకోవడంలో వైఫల్యం
పోలీస్‌స్టేషన్లు, పంచాయతీ పెద్దలను ఆశ్రయిస్తున్న యువ జంటలు

శతమానం భవతి అంటూ సాగిన మంత్రోచ్చరణల మధ్య జరుగుతున్న వివాహ బంధాలు నిలబడలేకపోతున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో వైఫల్యం చెందుతున్నా రు. చిన్న చిన్న విషయాలకే విడిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కోటి ఆశలతో పెళ్లి చేసిన పెద్దలు ఆందోళనకు గురవుతున్నారు. ఆలు మగలు చిన్న చిన్న విషయాలకే ప్రతిష్టలకు పోయి పచ్చని కాపురంలో చిచ్చుపెట్టుకుంటున్నారు. నెల తిరగక ముందే కొన్ని జంటలు విడాకులు కోరుకుంటున్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉన్నత విద్యావంతులు సైతం ఇదే తోవన నడుస్తుండడం బాధాకరం. ఇటీవలి కాలంలో పోలీస్‌స్టేషన్లను, పంచాయతీ పెద్దలను ఆశ్రయిస్తున్న యువ జంటలు గణనీయంగా పెరుగుతున్నాయి. భారతీయ వివాహ వ్యవస్థ బలమైందని ప్రపంచం మొత్తం నమ్మే పరిస్థితుల నుండి ఇప్పుడు అక్కడ పటిష్టం కాదన్న భావన నెలకొనే పరిస్థితులు వచ్చాయి.

మన తెలంగాణ/ఖమ్మం : వివాహ బంధంతో ఒక్కటై జీవిస్తున్న దంపతుల మధ్య అహం, అపార్థాలు చిచ్చురేపుతున్నాయి. కట్నం తక్కువ తెచ్చావంటూ కొట్టడం, కాఫీలో చక్కెర తక్కువ వేశావంటూ తిట్టడం, వారాంతంలో తప్ప తాగి రావడం వంటివి తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. వ్యక్తిత్వం నిలుపుకునేందుకు ఇద్దరు నువ్వెంతో నేనంతే అంటున్నారు. ఇంటి గుట్టును పోలీస్ ఠాణా వరకు తీసుకెళ్తున్నారు. అంతేకాదు ఏడాదిలోపే విడాకులు కావాలంటూ పోలీసులను కోరుతున్నారు. మహిళా పోలీస్ ఠాణాకు రోజు ఎవరో ఒకరు ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారు. వివాహా బంధం కలకలం ఉండాలంటూ మహిళా పోలీస్ అధికారులు చెబుతున్నా విన్పించుకోవడం లేదు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం మూడుసార్లు కౌన్సిలింగ్ నిర్వహించాలంటూ వ్యవహరించినా మూడుసార్లు పూర్తయినట్లే భావించుకోండి అంటూ భార్యాభర్తలు వ్యవహరిస్తున్నారు.

ముంచేస్తున్న మద్యం : ముంబాయి, బెంగళూరు, ఢిల్లీ నగరాల తరహాలో కాస్మోపాలిటన్ సంస్కృతి నగరంలో రోజురోజుకు పెరుగుతుండడంతో కొత్తగా పెళ్లయిన యువకులు, విద్యావంతులు, ఉద్యోగం చేస్తున్న యువతులను పెళ్లి చేసుకున్న భర్తల్లో 60శాతం మంది మద్యం తాగడాన్ని తప్పుగా భావించడం లేదు. వారంతల్లో స్నేహితులతో కలిసి రాత్రంతా విందు, వినోదాల పేరుతో మద్యం తాగి ఆదివారం తెల్లవారుజామున ఇండ్లకు చేరుకుంటున్నారు. ఇది క్రమంగా అలవాటుగా మారి కొందరు ఇండ్లకే మద్యం తెచ్చుకుని రాత్రంతా తాగుతున్నారు. పెళ్లికి ముందు మద్యం తాగబోమంటూ చెప్పిన భర్త ఒక్కసారిగా విశ్వరూపం చూపించే సరికి భార్య తట్టుకోలేక పోతుంది. మద్యం తాగడం పైనే ఇద్దరి మధ్య మాటమాట పెరిగి ఇరువురి నడుమ గోడవలకు దారి తీస్తున్నాయి. తల్లిదండ్రులు ఆదరిస్తారన్న నమ్మకం ఉన్న యువతులు వెంటనే భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చేందుకు సిద్దమవుతున్నారు. మరి కొంత మంది యువకులు జల్సాలకు ప్రాధాన్యతనిస్తూ సహాధర్మచరణి నిర్లక్షం చేస్తున్నారు.

అడ్డొస్తున్న అహం : కొత్తగా పెళ్లయి భార్యా, భర్తలే నివాసముంటున్న జంటల్లో అభిప్రాయ బేధాలు తొందరగా బయటపడుతున్నాయి. 90శాతం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో అహం వల్లే చిన్న విషయాలు గొడవకు దారి తీస్తున్నాయి. ఒకరికి ఒకరు పరిస్థితులను అర్థం చేసుకోకపోవడం ఒకవైపే ఆలోచించడంతో అనవసరంగా పెళ్లి చేసుకున్నాం. మా అమ్మ, నాన్నలు నా గొంతు కోశారని భార్య అనుకుంటే కట్నంఇస్తే సరే. ఇంట్లో పనులు చేయదా అని భర్త అనుకుంటున్నాడు. చివరకు నువ్వెంతో నినంతే అంటూ మాటలతో మొదలైన యుద్దం చేతల వరకు వెళ్తుంది. సాఫ్ట్‌వేర్ కొలువురు చేసే కొన్ని జంటల్లో భార్యా, భర్తల మధ్య అహం సమస్యలను సృష్టిస్తుంది. నేను, అతను సమానంగా సంపాదిస్తున్నాం. ఒక్క పని చేయడం లేదు. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏ మాత్రం సహయం చేయకుండా ఉంటున్నాడు. మరి కొందరు యువతులు తమను ఉద్యోగం మానేయాలంటూ షరతులు విధిస్తున్నారంటూ చెబుతున్నారు.

కట్నం తీసుకోరా : ఐదు నుంచి పదేళ్లు కలిసి జీవిస్తున్నా భార్యా, భర్తల్లో 25 శాతం మందికి ఆర్థికాంశాలపై పట్టు ఉండడం లేదు. ఇద్దరు లేదా ఒక్కరు సంపాదిస్తున్నా ఖర్చుల విషయంలో ఇద్దరి మధ్య నియంత్రణ ఉండడం లేదు. అప్పులు పెరిగిపోవడం వంటివి దాంపత్య బంధాన్ని తెగేలా చేస్తున్నాయి. మీ పుట్టింటి నుంచి డబ్బు తీసుకు రా అంటూ అదనపు కట్నం డిమాండ్ చేస్తున్నారు. కొందరు బంగారం తాకట్టు పెడదామంటూ వేధిస్తున్నారు. మరి కొంత మంది భర్తలు ఇంటికి అవసరమైన సరుకులు, వస్తువులు అన్ని తెచ్చాను. మళ్లి డబ్బులు కావాలంటున్నావు ఎక్కడి నుంచి వస్తాయ్ అంటూ వేధించడంతో పాటు కోడుతున్నారు. ప్రధానంగా పిల్లల స్కూల్ ఫీజులు, పండుగలప్పుడు కొత్త దుస్తులు, సొంత ఊరికి వెళ్లేటప్పుడు ఖర్చుల విషయంలో అభిప్రాయ బేధాలు వస్తున్నాయి. అప్పులు ఇచ్చిన వారు ఫోన్ చేయడం, ఇంటికి రావడం వంటి వాటిని భార్య గుర్తు చేసినప్పుడు భర్త డబ్బు లేదు మీ ఇంటి నుంచి తీసుకుని రా అంటూ కసురుకుంటున్నాడు.