విషాదాంత కథల రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య

మొన్న 18-05- 2018 నాడు నాకు అత్యంత అభిమానపాత్రుడైన కథారచయి త పెద్దిభొట్ల సుబ్బరామ య్య విజయవాడలో చివరిశ్వాస విడిచాడని తెలిసినప్పుడు చాలా బాధపడ్డాను. నేను 1964 నుండి 1970 వరకు నల్లగొండ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్న రోజుల్లో నాకు సుబ్బరామయ్యతో పరిచయం యేర్పడింది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారి శాశ్వతంగా నిలిచిపోయింది. పందొమ్మిది వందల అరవైలలోనూ, డ్బ్బైలలోను సుబ్బరామయ్య విస్తృతంగా కథలు రాశాడు. అప్పుడప్పుడు చిన్నచిన్న నవలలు కూడా ఆయన రాశాడు. […]

మొన్న 18-05- 2018 నాడు నాకు అత్యంత అభిమానపాత్రుడైన కథారచయి త పెద్దిభొట్ల సుబ్బరామ య్య విజయవాడలో చివరిశ్వాస విడిచాడని తెలిసినప్పుడు చాలా బాధపడ్డాను. నేను 1964 నుండి 1970 వరకు నల్లగొండ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్న రోజుల్లో నాకు సుబ్బరామయ్యతో పరిచయం యేర్పడింది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారి శాశ్వతంగా నిలిచిపోయింది. పందొమ్మిది వందల అరవైలలోనూ, డ్బ్బైలలోను సుబ్బరామయ్య విస్తృతంగా కథలు రాశాడు. అప్పుడప్పుడు చిన్నచిన్న నవలలు కూడా ఆయన రాశాడు. కానీ ఆయన ప్రతిభ కథానిక రచనల్లో కనిపించినంత ప్రముఖంగా నవలా రచనల్లో కనిపించలేదు. అయితే ఆయన రచించిన ఒక నవలిక “అంగారతల్పం” నన్ను ప్రగాఢంగా ప్రభావితం చేసింది. ఈ నవలిక ‘భారతి’ మాసపత్రికలో వెలువడినప్పుడు నేను చదివి సుబ్బరామయ్య గార్కి చాలా పెద్ద ఉత్తరం- ఎంత పెద్ద ఉత్తరమంటే ‘అంగారతల్పం’ నవల ఎన్ని పేజీలుందో నేను రాసిన ఉత్తరం అన్ని పేజీలుంది. (నా చేతిరాతలో ఆ ఉత్తరం వంద పేజీలుంటుందని సుబ్బరామయ్య గారే చెబుతుండేవాడు) ఆ ఉత్తరం చదివి సుబ్బరామయ్య గారు బోల్డు ఆశ్చర్యపడిపోయి “నాకు ఇంత గొప్ప పాఠకుడు లభించినందుకు చాలా గర్విస్తున్నాన”ని జవాబు రాశాడు. జవాబు రాయడంతో పాటు ఆయన రచించిన నాల్గైదు పుస్తకాలు కూడా పంపించాడు. ఆ పుస్తకాలన్నీ చదివి (వాటిల్లో రెండు నవలలు ‘ధ్రువతార’, ‘ముక్తి’ – రెండు కథాసంకలనాలు ఉన్నాయి) నేనాయనకు ఉత్తరాలు రాశాను. ఇలా నేనాయనకు ఎన్ని సుదీర్ఘమైన ఉత్తరాలు రాశానో లెక్కలేదు. నేను రాసిన ఉత్తరాలకు ఆయన క్లుప్తంగా పోస్టుకార్డుల ద్వారా సమాధానాలు రాసేవాడు. నేను ఆయనకు రాసిన ఉత్తరాల్లో ఆయన కథల్లో నాకు నచ్చని విషయాల్ని కూడా ప్రస్తావించేవాడిని. నా విమర్శను ఆయన సహృదయంతో స్వీకరించేవాడు తప్ప ఇలా రాశారేమిటని ఎప్పుడూ అనేవాడు కాదు. నన్ను చాలా ఆశ్చర్యపరచిన విషయమేమిటంటే: ఆయన రాసిన ప్రతి కథ విషాదాంతంగానే ముగిసేది. ఆయన సృష్టించిన పాత్రలన్నీ భయంకరమైన పేదరికంతో తల్లడిల్లుతున్నవాళ్ళే. బ్రాహ్మణ కుటుంబాలకు చెందినవాళ్ళే ఆయన పాత్రలు. ఒకసారి ఒక సభలో… (సుబ్బరామయ్య షష్టిపూర్తి సందర్భంగా జరిగిన సభ) వేగుంట మోహనప్రసాద్ మాట్లాడుతూ సుబ్బరామయ్య సృష్టించిన పాత్రల్ని “దళిత బ్రాహ్మణులు” అన్నాడు. ఆయన సృష్టించిన పాత్రల్లో చాలా పాత్రలు పతితులు, భ్రష్టులు, బాధాసర్పదష్టులు కావడాన్నే మనం చూస్తాం.
ఆయన రాసిన “నీళ్ళు” కథ చాలామంది పాఠకులకు కన్నీళ్ళు తెప్పించింది. బొత్తిగా నీళ్ళు దొరకని ప్రాంతం నుండి నీళ్ళు సమృద్ధిగా దొరికే విజయవాడ కొచ్చిన ఒక ఉద్యోగి కథ ఈ ‘నీళ్ళు’.
యేదో ప్రభుత్వ ఆఫీసులో క్లర్కుగా పనిచేస్తున్న ‘జోగినాథం’ అనే యువకుడు నెల్లూరు జిల్లా మారుమూల ప్రాంతంలో బొత్తిగా నీళ్ళకు కరువున్న ప్రాంతంలో ఉద్యోగం చేస్తుంటాడు. అతనికి విజయవాడకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. విజయవాడ పక్కనే ఉన్న కృష్ణానదిని, ఆ నదిలో సమృద్ధిగా ఉన్న నీళ్ళను చూసి ఇతడు పొంగిపోతాడు. ఆఫీసులో ఉన్నంతసేపు ఎప్పుడూ నీళ్ళ కూజా దగ్గరకు వెళ్ళి నీళ్ళు తాగుతుంటాడు. ప్రతిరోజూ కృష్ణానదిలో హాయిగా స్నానం చేస్తూ గొప్ప ఆనంద పారవశ్యానికి గురవుతాడు. కృష్ణానదిలో స్నానం చేస్తున్నంతసేపు తనను తాను మరచిపోతుంటాడు. అలా ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేస్తూ చాలా దూరం వెళ్ళిపోయి ఆ నదిలో మునిగి చనిపోతాడు.
సుబ్బరామయ్య కథల్లో మనల్ని ఆకట్టుకునే మరో మంచి కథ ‘ముసురు’. ఈ కథలోని సింహాచలం కూడా అతి మంచివాడే. మంచితనంతో కష్టాల్ని కొని తెచ్చుకునేవాడే.
సింహాచలం ఓ చిన్న చిల్లరకొట్టు యజమాని. పెరినాయకి, సింగారవేలు అన్న తమిళనాడు నుంచి పారిపోయి వచ్చిన ప్రేమికుల జంటకు ఆశ్రయమిస్తాడు. సింగారవేలుకు ఆ ఊరి ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరికినట్టే దొరికి ఊడిపోతుంది. ఆ తర్వాత అతనికెక్కడా పని దొరకదు. పెరినాయకి, సింగారవేలు పస్తులుంటూ కాలం గడుపుతుంటారు. ఆ దశలో పాతిక రూపాయల కోసం సీసాడు కిరసనాయిల్ తాగుతానని పందెం కట్టి, సీసాడు కిరసనాయిల్ తాగి, పాతిక రూపాయలు సంపాదించి ఇంటికొచ్చి సింగారవేలు చనిపోతాడు. దాంతో పెరినాయకి పూర్తిగా దిక్కులేనిదౌతుంది. ఆమెమీద జాలిపడి సింహాచలం తమిళదేశంలో ఉన్న ఆమె తండ్రి వచ్చేంతవరకు తనింట్లోనే వుండమని ఆశ్రయమిస్తాడు. దాంతో సింహాచలానికి పెరినాయకి మధ్య ఏదో ఉందని ఊళ్ళో ఎవరికి చేతనయినట్టుగా వాళ్ళు తిట్లవర్షం కురిపిస్తారు. ఈ కథలో ఒక గొప్ప అందమేమిటంటే బయట ఐదురోజులుగా ఎడతెరిపి లేకుండా పడ్తున్న ముసురుకు, కట్టుకున్న భార్యను వదిలేసి పెరినాయకిని సింహాచలం వుంచుకున్నాడన్న అపోహతో అతని దుకాణానికి సరుకులు కొనుక్కుపోవటానికొచ్చే జనం సింహాచలం మీద కురిపించే తిట్లకు ఒక అద్భుతమైన సారూప్యాన్ని రచయిత ఆవిష్కరించడం. పెరినాయకి తన తండ్రి రావడంతో అతనితో వెళ్ళిపోతుంది. దాంతో సింహాచలాన్ని ఐదురోజులుగా నానా మాటలతో హింసించిన ఆ ఊరి ప్రజల నోళ్ళు మూతపడ్తాయి. అలాగే ముసురు కూడా ఆగిపోతుంది.
ఇలా సుబ్బరామయ్య కథల్లోని పాత్రలందరూ కల్లాకపటం తెలీని అమాయకులు. ముక్కుసూటిగా వెళ్ళేవాళ్ళు. దయనీయమైన పేదరికం అనుభవించేవాళ్ళు. బ్రాహ్మ ణ కుటుంబాలకు చెందినవాళ్ళ ళ్ళో కూడా ఎంత పేదరికం ఉం టుందో సుబ్బరామయ్య కథలు చదివితే తెలుస్తుంది.
సుబ్బరామయ్య 300 లకు పైగా కథలు రాశారు. 10కి పైగా నవలికలు రాశారు. ఆయన కథల్లో “నీళ్ళు” తర్వాత గొప్పవని చెప్పుకోతగిన కథల్లో “ముసురు”, “దగ్ధగీతం”, “పూర్ణాహుతి”, “పీట”, “గాలి” మొదలైన ఎన్నో కథల్ని చెప్పవచ్చు.
ఆయన రాసిన నవలల్లో నాకు బాగా నచ్చిన నవల “అంగారతల్పం”.ఇది ఒక కాన్సర్ పేషెంట్ కథ. మూడు నాల్గు నెలల కంటే ఎక్కువకాలం బతకడని డాక్టర్ చెప్పేస్తాడు. డాక్టర్ చెప్పిన ఈ మాట పేషెంట్ వింటాడు. త్వరలోనే చనిపోబోతున్నానని తెలిసినప్పుడు ఆ వ్యక్తిలో కల్గే ఆలోచనా స్రవంతి ఎలా ఉంటుందో సుబ్బరామయ్య ఈ నవలికలో అత్యంత వాస్తవికంగా చిత్రించాడు. ఈ నవల చదువుతుంటే పాఠకుల కళ్ళు చెమ్మగిల్లుతాయి.
నేను రాసిన ‘అంపశయ్య’ నవల వెలువడ్డాక సుబ్బరామ య్య నాతో “మీరీ నవలకు ‘అంపశయ్య’ అన్న పేరును నా నవల ‘అంగారతల్పం’ ప్రభావంతోటే పెట్టారు కదా?” అ ని అడిగాడు. “కావచ్చు..నా అంతరంగంలో‘అంగారత ల్పం’ అన్న పేరు స్థిరపడిపోయింది. బహుషాః ఈ కారణంగానే నేను ‘అంపశయ్య’అనిపేరు పెట్టానేమో” అన్నాను.
పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథారచన చాలా సీదాసాదాగానే ఉంటుంది. ఎక్కడా పాండిత్య ప్రకర్ష గానీ, కవిత్వాంశ గానీ ఆయన కథల్లో కనిపించవు. పాఠకుడ్ని ఇబ్బందిపెట్టే ప్రయోగాలు కూడా ఆయన చెయ్యలేదు. ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం, అజో-విభో వారి ప్రతిభా పురస్కారం ఒకే సంవత్సరం వచ్చాయి. “నాకీ సంవత్సరం ‘సునామీ ఆఫ్ అవార్డ్స్‌” అని చాలా సంతోషంగా చెప్పుకున్నాడు.
“మీరెప్పుడూ విషాదాంత కథలే ఎందుకు రాస్తార”ని ఆయనను నేను చాలాసార్లు అడిగాను. మామూలుగా మేం కలుసుకున్నప్పుడేమో చాలా సరదాగా ఉండేవాడు. ఎన్నో వాస్తవ జీవితంలో జరిగిన కథలు- Anecdotes అంటారు- చెప్పి భలే నవ్వించేవాడు. “నిజ జీవితంలో ఇంతగా నవ్విస్తారు… కథలు రాసేమో ఏడిపిస్తారు. ఈ రెండింట్లో మీ నిజస్వరూపం దేంట్లో కనిపిస్తుంది” అని అడిగాను. “నా కథల్లో కనిపించేదే నా నిజస్వరూపం. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే నేనిలా నిజజీవితంలో మీలాంటి వాళ్ళను నవ్విస్తుంటాను” అన్నాడాయన.
పెద్దిభొట్ల సుబ్బరామయ్య రచించిన 9 గొప్ప కథల్ని తొమ్మిదిమంది అనుభవజ్ఞులైన అనువాదకులు ఇంగ్లీషులోకి అనువదించి “Rain day and other stories”అనే పేరు తో పుస్తకంగా ప్రచురించడం వల్ల తెలుగేతరులు కూడా ఆయన కథల్లోని విషాదాన్ని ఆస్వాదించగల్గారు.
చివరిసారి ఆయన్ను నేను మొన్న డిసెంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో కలిశాను. అప్పటికే ఆయన ఆరోగ్యం చాలా క్షీణించింది. “పూర్తిగా నడువలేని స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న తెలుగు మహాసభలకు తప్పకుండా రావాలని వచ్చాను” అన్నాడాయన. ప్రారంభ సమావేశంలో ఆయనా, నేను పక్కపక్కనే కూర్చున్నాము. ఆయనకెవరో ఈ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం పొందిన రచయితలను ఘనంగా లక్షరూపాయల నగదుతో సన్మానిస్తారని చెప్పారట. అలాంటిదేమీ లేదని తెలిసినప్పుడు ఆయన చాలా నిరుత్సాహానికి గురయ్యారు. చివరిరోజుల్లో ఆయన భార్య చనిపోయినప్పుడు తీవ్రమైన నిర్వేదానికి గురయ్యారు. ఒక తోడు ఉండాలని ఆయన మరొకామెను రెండో పెళ్ళి చేసుకున్నాడు. కానీ ఆయనకు ఆయన కోరుకున్న “తోడు” లభించనేలేదు.సుబ్బరామయ్యను నేను గత 50 యేళ్ళుగా అనేక సందర్భాల్లో కలిశాను. విజయవాడకు ఎప్పుడు వెళ్ళినా ఆయన ఇంటికి వెళ్ళి ఆయనను కలుసుకునేవాడిని. ఆయనలో ఎప్పుడూ ఒకలాంటి అశాంతి, ఒకలాంటి భయం, ఒకలాంటి అనిశ్చిత కనిపిస్తుండేవి. ఆయన కథల్లో కనిపించే విషాదమే- ఆయన చివరి రోజుల్లో ఆయనలో ప్రస్ఫుటంగా కనిపించేది.

ఆ మహా కథకునికి నా జోహార్లు

అంపశయ్య నవీన్
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
9989291299