విషపు కోరల్లో తెల్ల బంగారం

Reduced landslide with BG 3 cotton seed use

బిజి3 పత్తి విత్తనాల వాడకంతో తగ్గుతున్న భూసారం
అధిక దిగుబడి కోసం వినియోగిస్తున్న రైతులు

మన తెలంగాణ/ఆదిలాబాద్ బ్యూరో : నల్ల రేగడి భూముల్లో కాసుల వర్షం కురిపించే తెల్ల బంగారం విషపు కోరల్లో చిక్కుకుంటోంది. అధిక దిగుబడుల కోసం భూమిని పిప్పి పిండి చేస్తున్న రైతన్న మరింత దురాశతో ఆ పంటపై విషాన్ని గుమ్మరిస్తున్నారంటున్నారు. ముఖ్యంగా పత్తి పంట అధిక దిగుబడుల కోసం భూసారాన్ని మింగేసే బిజి3 విత్తనాన్ని సాగు చేస్తున్నారు. ఇప్పటికే బిజి విత్తనంపై అనేక ఆరోపణలు, ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ఈ బిజి-3 పత్తి విత్తనం అధిక దిగుబడులను ఇవ్వడమే కాకుండా భూసారాన్ని పూర్తిగా హరించివేస్తుంది. దీనికి తోడుగా దిగుబడి అయ్యే పత్తి పంట సైతం క్రమంగా విషతుల్యం అవుతోంది. ఇప్పటికే దీని నాణ్యతపై అనేక పరిశోధనల్లో వ్యతిరేక నివేదికలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం బిజి-3 విత్తన వినియోగాన్ని తగ్గించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అలాగే బిజి-3 విత్తనం సాగుద్వారా ఏర్పడే నష్టంపై వివరించడం ఓ దశలో బిజి-3 విత్తనాన్ని పరోక్షంగా సాగు చేయవద్దన్న సంకేతాలను సైతం అందించింది. అయినప్పటికి రైతులు అధిక దిగుబడలే లక్షంగా బిజి-3 పత్తి విత్తనం సాగుకే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం ఈ విత్తనాన్ని నిషేధించినంత పని చేసినప్పటికి సాగును మాత్రం నివారించలేకపోయింది. అయితే బిజి విత్తనం అధిక దిగుబడులు ఇచ్చేందుకు దోహదపడుతున్న గ్లైపోసేట్ అనే రసాయనిక ద్రావనం ఆసలు ప్రమాదానికి మూల కారణంగా గుర్తించారు. బిజి-3 విత్తన సాగు భూముల్లో కలుపు నివారణ కోసం ఈ గ్లైపోసేట్ ద్రావణాన్ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. క్రమంగా గ్లైపోసేట్ ద్రావణ వినియోగం పెరుగుతువస్తుంది. దీని కారణంగా పత్తి పంట పూర్తిగా విషతుల్యం అవుతున్నట్లు సాక్షాత్తు వ్యవసాయ శాస్త్రవేత్తలే వెల్లడిస్తున్నారు. గ్లైపోసేట్‌ను వినియోగించవద్దంటూ శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరికలు బుట్టదాఖలవుతున్నాయి. ప్రభుత్వం సమస్య తీవ్రను తెలుసుకొని ఎట్టకేలకు రంగంలోకి దిగింది. గ్లైపోసేట్ రసాయనిక ద్రావణ విక్రయాలపై ఆంక్షలు విధించింది. పురుగు మందులు, ఎరువుల దుకాణాల్లో గ్లైపోసేట్‌ను విక్రయించవద్దంటూ పరోక్ష నిషేధిత ఆదేశాలను జారీ చేసింది. గ్లైపోసేట్ ప్రభావం కారణంగా పత్తి పంట మాత్రమే విషతుల్యం అవుతుండడమే కాకుండా చుట్టూపక్కల పంటలు కూడా విషపూరితమవుతున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. దీనికి తోడుగా ఈ రసాయనిక ద్రావణాన్ని పిచికారి చేసే రైతులు భయంకరమైన రోగాల బారిన పడుతున్నారంటున్నారు. ఉపిరితిత్తుల వ్యాధులతో పాటు జీర్ణకోశ వ్యాధులు అలాగే భయంకరమైన క్యాన్సర్‌రోగాలకు సైతం గురవుతున్నారని చెబుతున్నారు. అయితే అధికారికంగా గ్లైపోసేట్ ద్రావాణాన్ని నిషేదించడం అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల ప్రకారం కుదరదంటున్నారు. దీని కారణంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్లైపోసేట్ వినియోగంపై ప్రత్యేక్షంగా నిషేదిజ్ఞాలు జారి చేయకుండా పరోక్ష ఆంక్షాలు విధించి దీని కట్టడి కోసం ప్రయత్నిస్తుంది. భయంకర విషపూరితమైన ఈ ద్రావాణానికి ప్రత్యామ్నాయంగా ఇతర రసాయనిక ద్రావణాలను వినియోగించాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. అధిగ దిగుబడుల కోసం ఆశపడి రైతులు గ్లైపోసేట్ వినియోగంపై అలవాటుపడుతున్నారు. ఇప్పటికైన రైతులు సేంద్రియ ఎరువులు, సేంద్రియ ద్రావణాలపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.