విలక్షణ సృష్టి ‘పాటవెలదులు’

Poet Dr. Vadapalli worry about the Telugu language

దేశభాషలందు తెలుగు లెస్స/ కృష్ణరాయలనెను తృష్ణదీర!/ దేశభాషలందు తెలుగు లెస్సు/చేయబోకు మనకు చేటు కలుగు !’
ఇది డా. వడ్డేపల్లి తెలుగు గురించి చెందిన ఆవేదన. కవి, రచయిత, విమర్శకులు, లలితగీత కర్త, సినీ దర్శకులుగా బహుముఖ ప్రజ్ఞను సాధించిన వడ్డేపల్లి పుట్టింది నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం, చేనేతల ఖిల్లాగా ప్రసిద్ధి చెందిన సిరిసిల్లలో. నిరంతర కార్మికోద్యమాలు, వామపక్ష రాజకీయాలకు కేంద్రంగా నిలిచిన సిరిసిల్లలోంచి స్వయంకృషినే ఆయుధంగా చేసుకొని నిలిచిన ఆయన తన చదువు, ఉద్యోగ ప్రస్థానంలో భాగంగా హైదరాబాదుకు చేరుకోవడం ఒక మైలురాయిగా నిలిచి వారిని సాహితీ క్షేత్రంలో ముందుకు నడిపించింది. ఆధునిక తెలుగు సాహిత్యరంగంలో అత్యంత వైవిధ్య ప్రక్రియలైన పద్యం, గేయం, వచన కవిత, కథ, నాటిక, గేయనాటిక, గేయ కథాకావ్యం, సంగీత నృత్యరూపకాలే గాక తెలుగు వాళ్ళకు గర్వకారణంగా అనేక లలిత గీతాల్ని రాసారు. లలిత గీత రచనలో సాధికారికత కలిగిన వడ్డేపల్లి ‘తెలుగులో లలిత గీతాలు’ అనే అంశం మీద పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రచించారు.

1968 జూన్‌లో స్రవంతిలో వడ్డేపల్లి తొలి కవిత ద్వారా ‘ఎవడెరుగును?’ వీరి తొలి కవిత ప్రచురితం. అలా ప్రారంభమయిన వీరి ప్రస్థానం 1969 నుంచి ఆకాశవాణి ద్వారా, 1980 నుండి దూరదర్శన్ చిత్రగీతాల ద్వారా ఎన్నో గీతాలను అందించారు. 1995 సెప్టెంబర్‌లో ఆకాశవాణి ద్వారా అన్ని రాష్ట్రాలలో వీరు రచించిన తెలుగు గీతం ప్రసారమై జాతీయ స్థాయిలో లలితగీత కర్తగా గుర్తింపు పొందారు. ఒకవైపు కవిగా రాణిస్తూనే మరోవైపు టి.వి. సినీ రంగాల్లో ప్రవేశించి సినిమా పాటలు రాసారు. టివి సీరియల్లు రచించి నిర్మించారు. వడ్డేపల్లి సినీరంగ ప్రవేశం పెద్ద సినిమాతోనే ప్రారంభమయ్యింది. ‘పిల్ల జమిందారు’ చిత్రంలో అక్కినేని, భానుమతి రామకృష్ణలకు రాసిన ‘నీ చూపులోన విరజాజి వాన,ఆ వానలోన నే తడిసి పోనా’అనే జావలి వీరికి పేరు తెచ్చిపెట్టిన తొలి సినీగీతం. ఆట, తానా వంటి అమెరికా తెలుగు సంస్థలకు స్వాగత గీతాల్ని రచించి విదేశాల్లో ‘లలిత శ్రీ’, ‘కవన ప్రజ్ఞ’ బిరుదులందుకున్న వడ్డేపల్లిని వేములవాడ దేవస్థానం ‘గేయ కిరీటి’గా సత్కరించింది.

నిరంతర కవి వడ్డేపల్లి తనకంటూ ఒక ప్రత్యేకను సాధించాలన్న మార్గాన్వేషకుడు. అలా సాగిన అన్వేషణ ఆలోచనల నవ్యరూపం ‘పాటవెలదులు’ అనే నూతన పద్య ప్రక్రియ. దానికి వడ్డేపల్లి శ్రీకారం చుట్టారు. తేటతెలుగు నుడికారాన్ని ఆటవెలదులగా వేమన మలిచి ప్రజల నాలుకలపై నిలిచిపోయాడు. విభిన్న సామాజిక అంశాలను తీసుకుని బలంగా చెప్పిన కవి వడ్డేపల్లి కృష్ణ. సామాజిక దురాచారాలను దుయ్యబట్టడానికి అనేకులు ఆటవెలదులను తమ కవిత్వ వాహికగా చేసుకున్నట్లే సమకాలీన సామాజిక వైరుధ్యాల నిరసన పాటవెలది పద్యాల్లో ఖండించారు వడ్డేపల్లి.

ఆటవెలదిలో అయిదు సూర్యగణాలు రెండవ – నాలుగవ పాదంలో ఉంటె, మొదటి-మూడవ పాదంలో మూడు సూర్యగణాలు ఆపైన రెండు ఇంద్ర గణాలు ఉండాలి. ఇది నియమం. ఆటవెలదిని బాగా లోతుగా అధ్యయనం చేయడమే కాక మాత్రా ఛందస్సులో సాధికారికత కలిగిన వీరు తేటగీతిలో లాగానే, ఆటవెలదిలో కూడా నాలుగు పాదాల్ని ఒకే రీతిలో గణాలతో ఎందు కు రాయకూడదనే విలక్షణమైన ఆలోచనతో పాటవెలది అనే ప్రక్రియను ప్రారంభించారు. తను ‘పాటవెలదులు’గా నామకరణం చేసిన ప్రక్రియ గురించి ఇలా చెబుతారు.

‘అయిదు సూర్యగణములందగించి / తేటగీతి వోలె తేలిపోవ/ఏకరీతి పంక్తు లేర్చి కూర్చి / పాటవెలది జేసి పాడుకొందు’ నిత్యజీవితంలో మనందరికి తెల్సిన విషయాలను, సమాజంలోని సంఘటనలను, ప్రపంచీకరణ వల్ల జరుగుతున్న మార్పులను ఎన్నింటినో చెప్పేందుకు వీరు పాటవెలదులను భూమికగా మలచుకున్నారు. రోజురోజుకు విస్తరిస్తున్న వ్యాపార సంసృ్కతి, ప్రపంచీకరణలు అన్ని రంగాల్లోలాగానే వాతవరణాన్ని, ప్రకృతి సమతుల్యతను దెబ్బతీసాయి. రోజు రోజుకు అంతరించిపోతున్న అడవులను, పచ్చటి ప్రకృతి పరిమళాలను కాపాడుకోవలసిన బాధ్యత ఏ ఒక్కరిదో కాదు మనందరిదో అంటూ గుర్తుచేసిన వడ్డేపల్లి,

‘ఇంటి చుట్టు చెట్లు ఇంగితముగ / పెంచి పెద్ద చేయు మంచి ‘ప్లాను’ / ఎన్నదగును మనకు అన్నిచోట్ల / కనుక వానలెన్నో కానవచ్చు!’ అంటూ చెబుతారు. ‘పచ్చని చెట్లు ప్రగతి మెట్లు’ కదా అందులోనూ ఇంటికి అందంతో పాటు ఆహ్లాదాన్ని కల్గించే మొక్కలను నాటాలి, ఆ చెట్లు ఏపుగా ఉన్నప్పుడే సకాలంలో వర్షాలు కురుస్తాయి. ప్రతి ఒకరూ ఇంటిని నిర్మించే సందర్భంలోనే చెట్ల నిర్మాణానికి పూనుకోవాలని, ప్రకృతిని తల్లిగా భావించాలనే కవి ఆంతర్యం ఎంత గొప్పదో కదా….
లోకం రీతిని బలంగా చెప్పిన వడ్డేపల్లి కన్నబడ్డలేమో కానరాని హాస్టళ్ళల్లో ఉంచి, కుక్కపిల్లల్నేమో కష్టపడి, ఇష్టపడి కట్టుకున్న భవంతులల్లో ఉంచుకుంటున్న వైనాన్ని గురించి తన పాటవెలదుల్లో చెబుతారు. ఎటుపోతుంది సమాజం, ఏమవుతుంది మానవ ప్రపంచం… ఇట్లాంటి ఎన్నో ప్రశ్నల ద్వారా పాఠకులను కదిలించిన పద్యం ఇది.

‘కుక్కపిల్ల నేమొ కూర్మితోడ / ‘కాలనీ’లో తిప్పు కాంక్షలాయె !’ అంటారు కవి. చదువుతున్న మనకే గుండెను పిండేస్తున్నది కదా… అనుభవిస్తున్న పిల్లల పరిస్థితేంది అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూనే…. లాలించి పాలించాల్సిన తల్లితండ్రుల మనసు ఎందుకింత అమానుషంగా మారిపోతుంది. అందుకేనేమో పిల్లలు వారి దారిలో ప్రయాణిస్తున్నారు. నేడు పిల్లలు హాస్టళ్ళలో… రేపు తల్లితండ్రులు వృద్ధాశ్రమాలలో అంటూ ఈ హాస్టల్ బతుకులకు రేపు మరో ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న వృద్ధాశ్రమాలను గురించి కూడా చెబుతారు.

‘బువ్వ పెట్టి తల్లి బుజ్జగించి / ప్రేమ తోడ పెంచి పెద్ద చేయ / కొడుకు అమెరికాకు కడకు చేరి / మరచి పోవుటాయె మరలి రాక ’! అంటూ కన్నతల్లి, కడుపున పెట్టుకొని చూసుకున్న ఊరు రెండూ ప్రతీ మనిషికి రెండు కళ్ళ లాంటివని, ‘డబ్బు’ మాయాజాలంలో పడి మనిషి తన అస్తిత్వాన్ని కోల్పోతూ తన రెండు కండ్లను తానే పొడుచు కుంటున్నాడనే హెచ్చరికను చేస్తారు. పొట్టకూటి కోసం ప్రారంభమైన ప్రయాణం చివరికి ఆర్థిక సంబంధాలమయంగా మారి చివరకు తల్లితండ్రుల కడసారి చూపుకు రావడానికే సమయం లేనంతగా వచ్చిన ఈ మార్పు ఎటువైపు పోతుందో, ఎంతకు దారి తీస్తుందో అంటూ ముగిస్తాడు.

వడ్డేపల్లి సినీ గేయాలు రాసినా, దర్శకత్వం వహించినా, దూరదర్శన్‌లో ఎన్నో సీరియల్‌లూ, లఘు చిత్రాలు నిర్మించినా తొలుత కవి. అందులోనూ లలిత గేయ కవి. ఆయన పాటవెలదుల్లో ఆ ప్రభావం ప్రతిచోట కనిపిస్తుంది. అందుకే అందులోని ప్రతిపద్యం లలితగేయ సదృశ్యంగా సాగింది.

తన కంటికి కనిపించిన ప్రతి అంశాన్ని పాటవెలది పద్యంగా మలిచారు వడ్డేపల్లి. ఇలా ఎన్నో పాటవెలదులను ఒక్కో పద్యానికి, ఒక్కో వ్యూహాన్ని ఏర్పరచుకొని, ఒక్కో భావాన్ని రూపొందించాడు కవి. వేమన ఆటవెలది పద్యాల మాదిరిగానే ‘భావం – స్వరూప స్వభావాలు’ రెండూ ఉండటం వల్ల ఈ పాటవెలదులకు కూడా ఎంతో పదునేర్పడింది. చదువుతుంటే ఎంతో హాయిని కల్గించిన పద్యాలను పాటవెలదులుగా అందించిన డా. వడ్డేపల్లి కృష్ణ అభినందనీయులు.

                                                                                                                                వడ్డేపల్లి సంధ్య 7036000123