విభవాలజాణ –నా తెలంగాణ

telangana

మానవోద్యమ కారుడు గౌతమ బుద్ధుడి కాలంలోనే చారిత్రక నిర్మాణ స్థలంగా భాసిల్లిన తెలంగాణ ప్రాంతం ప్రాచీనతను సంతరించుకున్న ప్రదేశం. ఇది దక్షిణాపథంలో సువిశాలమైనది. చారిత్రకంగా అద్భుత చైతన్యశక్తిగా ప్రవర్థిల్లుతూ వస్తుంది. చైనా యాత్రికుడు హ్యూయన్‌త్సాంగ్ ముచ్చటపడిన ప్రదేశమిది. పాశ్చాత్య చరిత్రకారుడైన మెగస్తనీస్ పరిశోధనల్లో అక్షర ప్రవాహమై భావితరాలకు మార్గనిర్దేశాన్ని చేసింది. కళాత్మక రంగాల్లో ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ఊగించి, ఉత్తేజపరిచిం ది. ఉద్వేగంతో ఉసిగొల్పి తన అపురూప అపారమైన కళాస్వరాలతో అలరించింది. ఎందరెందరో విదేశీ యాత్రికులే కాక, మరెందరో విదేశీ రాజుల చూపుల్ని తనమీద ప్రసరింపచేసుకుంది.
మగధరాజుల ఏలుబడిలో చరిత్రలోకి అడుగుపెట్టి, శాతవాహనుల ఆలనాపాలనలతో అడుగు ముందుకువేసింది. చాళుక్యులు, కాకతీయుల అనురాగంతో సరికొత్త చారిత్రక విలువలతోపాటు ప్రపంచాన్ని పరవశత్వం ఉడుకెత్తిస్తున్న శిల్ప సౌందర్యాన్నందిస్తూ, సదా తనవైపు ఆకర్షింపచేసుకుంటున్న భూమి ఇది. ఆ వైభవం అలాగే కొనసాగింది కాదు. కొందరి దుష్కర విదేశీ పాలకుల చేతుల్లో నలిగి కర్కశత్వాన్ని అనుభవించింది కూడ. భాషా, సాహితీ సాంస్కృతిక జీవన విధానాల్లో కూడా నలిపివేయబడింది.
బౌద్ధమతం బుద్ధుడికాలంలోనే ప్రవర్థిల్లినట్లు స్పష్టమైంది. బౌద్ధ శ్రేణులు ఈ ప్రాంతంలో ఆరామాలు నిర్మించారు. కోటిలింగాల, ధూళికట్ట, కొండాపురం, నాగార్జునకొండ, ఫణిగిరి వంటి ప్రాంతాల్లో బౌద్ధం వికసించింది. జైన మతాన్ని కూడా ఈ ప్రాంతం అక్కున చేర్చుకుంది. కొలనుపాక, కురిక్యాల, కళ్ళెం, హనుమకొండ, జైనపల్లి వంటి స్థలాల్లో జైన బసదులు, విద్యాలయాలు, ఆశ్రమాలు ఏర్పడి జైనమత ప్రాశస్తాన్ని చాటి చెబుతూనే ఉన్నా యి. బౌద్ధాన్ని ప్రోత్సహించినట్లే, జైన మతాన్ని కూడా ఆదరించిన రాజరిక ప్రభుత్వాలూ ఉన్నాయి. ఇక శైవ మత ప్రాధాన్యం తెలిపే ప్రదేశాలు తెలంగాణము నిండా ఉన్నాయి. మఠాలు ఉన్నాయి. వేములవాడ, కాళేశ్వరం, పాలంపేట,హనుమకొండ లాంటి చోట్లలో శైవమత వికసనం విప్పారిన ఆధారాలున్నాయి. ఈ ప్రాంతాన్నేలిన చాళుక్యులు, కాకతీయులు శైవమత విస్తరణ కోసం నిరంతరం దోహదపడ్డారు.
బౌద్ధుల కాలంనుండే తెలంగాణలో శిల్పం పూచిన ఆరామాలు, కళకళలాడుతూనే ఉన్నాయి. కోటిలింగాల, నాగార్జునకొండ, ఫణిగిరి వంటి ప్రదేశాల్లో ఆనాటి శిల్పకళ నేటికీ నవనవలాడుతూ శోభిస్తూ ఉంది. జైనశిల్పం కొలనుపాక, హనుమకొండ, వరంగల్‌కోట, నలుగుల గుట్ట వంటి స్థలాల్లో జిగేలు మంటుంది. చాళుక్యులు, కాకతీయుల శిల్పాలు ఖండాంతర వాసులను కూడా ప్రభావితం చేస్తున్నాయి. రామప్పగుడి, వేయిస్థంభాల దేవాలయం నిత్యనూతనంగా ప్రకాశిస్తూ, ప్రభావితం చేస్తున్నాయి.
సాహిత్య సంబంధంగా విచారిస్తే, నాటి కురిక్యాల శాసనంలో మూడువందల పద్యాలున్నాయి. బెక్కల్లు, గూడూరు శాసనాలు కూడా పద్యమయాలే. వరంగల్‌లోని ఉర్సుగుట్ట శాసనంలో సిద్దోద్వాహం అపురూప సంస్కృత కావ్యమే.అంతేగాక సంస్కృత సాహిత్యంలో మనన యోగ్యమైన గ్రంథాలనేకంగాతెలంగాణలో వెలువడినాయి. మొదటి కన్నడ కావ్యం కూడా తెలంగాణలో వెలువడిందే. రెండో అరికేసరి కాలంలో అతని ఆస్థానకవి పంపన, నన్నయకు వంద సంవత్సరాల పూర్వీకుడు. ఆయన ‘విక్రమార్క విజయం’ అనే కావ్యం రాశాడు. అదికన్నడ సాహిత్యంలో ఆదికావ్య గౌరవం పొందింది.
తెలంగాణలో మార్గకవిత్వం మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూన్నప్పుడే దేశికవిత్వం కవితాక్షర రూపాన్ని తొడుక్కుంది. అప్పటిదాకా వెలువడిన సాహిత్య ప్రక్రియల్ని వెనక్కితోసేసి ప్రజ్వలన ప్రవాహమై సాహితీ జగత్తును కుదిపేస్తుంది. తెలుగు సాహిత్యంలో అదొక విప్లవం.ఆ ఉద్యమ నాయకుడు పాల్కురికి సోమనాథుడు. కొత్త ప్రక్రియలుగా రగడ, ద్విపద, అష్టకం, ఉదాహరణం, పురాణం వంటి వెన్నో తెలుగు సాహిత్యానికి అందించిన ప్రథమ దేశికా చార్యుడు సోమన.
‘తెలుగుల పుణ్యపేటి’ పోతన మార్గపద్ధతిలో మందార మకరందాలద్దిన కవితాన్ని పరుగులు తీయిస్తూనే రచనలో నాద సౌందర్యాన్ని పటిష్టించాడు. వీధి నాటకంగా క్రీడాభిరామం నేటికీ చరిత్ర కారులకు పని కల్పిస్తూనే ఉంది. తెలంగాణ నేలలో మహాకావ్యాలు, ప్రబంధాలు, క్షేత్ర మహాత్మాలు, కీర్తనలు, శతకాలు,యక్షగానాలు, నాటకాలు, నాటికలు, నవలలు, ప్రపంచ పదులు, నానీలు వంటివి వెలువడి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నాయి. ఇక్కడ ఇరవయ్యో శతాబ్దం రెండో దశకంనుండే పత్రికా ప్రచురణ జరుగుతోంది. హితబోధిని, తెనుగు, నీలగిరి, గోలకొండ, కాకతీయవంటి ప్రాశస్తం గల పత్రికలు వెలువడి తెలుగు భాషా సాహిత్యాల ప్రగతికి దోహదపడ్డాయి. గోలకొండ పత్రిక ప్రాధాన్యత అందరికీ తెలిసిందే.
నిజాం ప్రభువుల పాశవిక పాలనలో అస్తిత్వాన్ని కోల్పోయిన తెలుగు భాషా సంస్కృతులను పునరుద్ధరించుటకు గ్రంథాలయోద్యమం ఆరంభమైంది. 1901లో కొమర్రాజు వారి నేతృత్వంలో శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం హైదరాబాద్‌లో స్థాపించారు. అనంతరం హనుమకొండలో 1904లో శ్రీ రాజ రాజనరేంద్రాంధ్ర భాషానిలయం, అలాగే వరంగల్లులో శబ్దశాసనాంధ్ర భాషా నిలయం లాంటివి యేర్పడ్డాయి. 1943లో ఆంధ్రసారస్వత పరిషత్తు, 1949 లో తెలంగాణ రచయితల సంఘం వంటివి ఏర్పడి భాషా సంస్కృతీ వికాసనానికి తోడ్పడ్డాయి. కుల మతానుసారంగా భిన్న సంస్కృతులు వెల్లివిరిసాయి.
తెలంగాణములో వరిఎక్కువగా పండిస్తారు. జొన్న, పప్పుదినుసులు, నువ్వులు, చెరకు, కూరగాయలు, ఇటీవల పత్తి, మిర్చి వంటివి పండిస్తారు. మామిడి, జామ, నిమ్మవంటి తోటలు పెంచుతారు.ఈ ప్రాంతంలో భోజన ప్రియత్వాన్ని ‘కప్పుర భోగి వంటకము’ అని క్రీడాభిరామంతో శ్రీనాథుడు వర్ణించాడు. కమ్మని రాజొన్నం, వడియాలు, పడిదాలు, పులుసు కూరలు, తియ్యని చారులు, జున్ను,పులుగం, పాయసం, తేనె, పానకం, ఫలరసాలు వంటి పదార్థాలు ఆరగించేవారని పిల్లలమర్రి పినవీరభద్రుడు వర్ణించాడు. ముస్లిముల కుటుంబాలలో బిర్యానీ వంటి మసాలా దినుసుల వంటలు ఘుమఘుమలాడిస్తుంటాయి. భోజనానంతరం తమ్మలం(తాంబూలం) వేసుకోవడం కొన్ని ఇళ్లల్లో ఉంది.
తెలంగాణ ప్రాంతంలో ఖద్దరు దుస్తులు వాడేవారు, అద్దకపు చీరెలు, దోవతులు, రవికెలు వంటివి ధరించేవారు. గొంగళ్ళు, బొంతలు వాడేవారు. ఓరుగల్లులో నేసిన తివాచీలకు విదేశాలలో కూడా ఆదరణ ఉండేది. బసవ పురాణంలో సోమన 52 రకాల వస్త్రాలున్నట్లు వర్ణించాడు. అవన్నీ తెలంగాణవే. బంగారం, వెండి, రాగి, ఇత్తడి ఆభరణాలు వాడేవారు. కాకతీయుల కాలంనాటి ఆభరణాలు రామప్ప, వేయిస్తంభాల ఆలయాల్లో శిల్పాల ద్వా రా గుర్తింపవచ్చు.
బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి నిలువటద్దం. బొడ్డెమ్మ పండుగ బాలికలనుద్దేశించి జరిపేది. పీరీల పండుగను ఊరూరా జరుపుకొని మత సామరస్యాన్ని చాటుతారు. ప్రపంచంలోనే గొప్పనైన ఆదివాసీల పండుగ మేడారం జాతర. వేములవాడ, భద్రాచలం,యాదగిరి, ధర్మపురి, కాళేశ్వరం, కొమురవెల్లి, అయినవోలు వంటి పుణ్యస్థలాలు తెలంగాణ జనజీవితాలను ప్రభావితం చేస్తున్న సంస్కృతీ స్వరాలు. పేరిణి, గొండ్లి, కేళిక, కోలాటం వంటి నృత్యాలు, చెడుగుడు,బొంగరాలు, చిర్రగోనె, కుప్పిగంతు లు, దాగుడు మూతలు, గుజ్జినగూళ్ళు వంటి క్రీడలు ఇక్కడ జరుగుతాయి.
పాశ్చాత్య సంస్కృతి విస్తరించకముందు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తెలంగాణలో ఉండేది. పెళ్ళిల్లు కులగోత్రాల ఆధారంగా జరిగేవి. అవి వధువు ఇంట్లోనే జరగాలి. ఆ సందర్భంగా పాడే పాటలు, ఆధ్యాత్మిక, ధార్మిక, సంప్రదాయక రీతుల్లో సాగేవి. ఉన్నత వర్గాలవారికి పల్లకీల సంప్రదాయముండేది. వివాహక్రమ సమయంలో తెరపట్టడం, జిల్కరబెల్లం, మధుపర్కం, ప్రోలు, ముంతలు, తలంబ్రాలు, కంకణాలు, మట్టెలు, మంగళసూత్రాలు, బాసింగాలు, ఐరేని కుండలు, నల్లపూసలు, తాళి వంటివి వేదమంత్రోచ్ఛారణలతో జరిగేవి.
ప్రాచీన కాలంనుండే తెలంగాణ ప్రాంత చరిత్ర సాంస్కృతిక జీవితం అత్యంత శక్తివంతంగా, ఆకర్షణీయంగా సాగుతూ వస్తున్నది. ఈ రెండంశాలతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంటున్నది. అందుకే తెలంగాణ సంస్కృతి నిత్యనూతనమైంది. పఠనీయమైన జ్ఞానమార్గాన్ని నిర్దేశించేదిగా ఉంది.

డా. పల్లేరు వీరస్వామి
9441602605

The post విభవాలజాణ – నా తెలంగాణ appeared first on .