విభజన హామీలపై నిలదీయండి

kvt

టిఆర్‌ఎస్ ఎంపిలకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం
అన్యాయాన్ని ఎండగడతాం : ఎంపి వినోద్‌కుమార్

మన తెలంగాణ / హైదరాబాద్/న్యూఢిల్లీ : అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో పార్టీ అనుసరించాల్సిన విధానంపై ముఖ్యమంత్రి కెసిఆర్  పలు సూచనలు చేశారని, దాని గురించి చర్చించుకున్నామని తెలిపారు. ప్రధాని మోడీ, ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు తెలంగాణకు పలు రకాలుగా అన్యాయం చేశారని వ్యాఖ్యానించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం పేరుతో తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారని, ఆ ప్రాజెక్టుకు కేంద్రమే నిధులు ఇస్తోందని, జాతీయ హోదాను కూడా ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదాను ఇవ్వకపోగా ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదన్నారు. కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోయినా ముఖ్యమంత్రి కెసిఆర్ గుండె నిబ్బరంతో కోట్లాది రూపాయలను వివిధ మార్గాల్లో సిద్ధం చేసుకున్నారని, వివిధ అభివృద్ధి పనులను చేపట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి స్థానంలో ఇంకెవరు ఉన్నా ‘దుప్పటి కప్పుడుని నిద్రపోయేవారు’ అని తనదైన శైలిలో వినోద్ వ్యా ఖ్యానించారు. తప్పకుండా తెలంగాణకు జరిగిన అన్యాయా న్ని ఆయా అంశాలను ఉదాహరణలతో సహా అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో వివరిస్తామని తెలిపారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేటకు రైల్ కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయానికి నిధుల కేటాయింపు, ఐటిఐఆర్, హైకోర్టు విభజన, తొమ్మిదవ, పదవ షెడ్యూలు సంస్థల విభజన, పదమూడవ షెడ్యూలులో పేర్కొ న్న అంశాల అమలు…ఇలా అనేకం ప్రస్తావిస్తామ ని వినోద్‌కుమార్ ‘మన తెలంగాణ’కు వివరించారు. తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో పాల్గొనాల్సిందిగా టిఆర్‌ఎస్ అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ పార్టీ ఎంపిలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కెసిఆర్ మార్గదర్శకాల మేరకు టిఆర్‌ఎస్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యు లు ఢిల్లీలో గురువారం ఉదయం పార్లమెంటులోని ఒక దఫా సమావేశాన్ని నిర్వహించుకుని శుక్రవారం చర్చ సందర్భంగా అనుసరించాల్సిన విధానాన్ని, లేవనెత్తాల్సిన అంశాలను, తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల అమలులో కేంద్రం నిర్లక్షయాన్ని, జాప్యాన్ని ప్రస్తావించాలని ఈసమావేశంలో నిర్ణయం జరిగింది. ఓటింగ్ సమయంలో అనురించాల్సిన విధానంపైన కూడా చర్చించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ పార్టీ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి నివాసంలో సమావేశం జరిగింది. పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు కూడా ఈ సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు.