విపత్తులకు శాశ్వత చర్యలు చేపట్టలేరా?

చెప్పకుండా సంభవించేవి విపత్తులు. ఇవి జీవకోటిని సర్వనాశనం చేస్తాయి. ప్రకృతి వైపరీత్యాలవల్ల మానవులు, వారి జీవితాలను, బంధువులను, స్థిర ఆస్తులను కోల్పోతున్నారు. ఇలా అపార నష్టాన్ని కలిగిస్తున్న వాటిలో ముఖ్యంగా కరువు, వరదలు, భూకంపాలు ముందు వరసలో ఉన్నాయి. అతివృష్టి వలన వరదలు, అనావృష్టి వల్ల కరువులు సంభవిస్తున్నాయి. సముద్రాలలో ఏర్పడే భీకరమైన వాయు గుండాల వల్ల విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. తద్వారా నదులు ఉప్పొంగి వరదలు వస్తున్నాయి. ఇవి గ్రామాలు, పట్టణాలు, మహానగరాల అనే తేడా […]

చెప్పకుండా సంభవించేవి విపత్తులు. ఇవి జీవకోటిని సర్వనాశనం చేస్తాయి. ప్రకృతి వైపరీత్యాలవల్ల మానవులు, వారి జీవితాలను, బంధువులను, స్థిర ఆస్తులను కోల్పోతున్నారు. ఇలా అపార నష్టాన్ని కలిగిస్తున్న వాటిలో ముఖ్యంగా కరువు, వరదలు, భూకంపాలు ముందు వరసలో ఉన్నాయి. అతివృష్టి వలన వరదలు, అనావృష్టి వల్ల కరువులు సంభవిస్తున్నాయి. సముద్రాలలో ఏర్పడే భీకరమైన వాయు గుండాల వల్ల విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. తద్వారా నదులు ఉప్పొంగి వరదలు వస్తున్నాయి. ఇవి గ్రామాలు, పట్టణాలు, మహానగరాల అనే తేడా లేకుండా ముంచేస్తున్నాయి. జీవరాశికి జీవనాధారమైన నదులు అతివృష్టికిలోనై ప్రమాదకరమైన స్థాయిలో అవి ప్రవహించి, ప్రజలకు ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఇళ్లు కూలిపోతున్నాయి. పంటలు నాశనమవుతున్నాయి. రోడ్లు దెబ్బతింటున్నాయి. వార్తా ప్రసార, పత్రిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. ఎంతో మంది దిక్కులేని వారుగా మిగులుతున్నారు. “లక్షాధికారులే భిక్షాధికారుల అవతారం’ ఎత్తవలసి వస్తున్నది.

1977లో వచ్చిన దివిసీమ తుఫాను, చరిత్రలో మరిచిపోలేని విషాదాన్ని మిగిల్చింది. 1983లో సంభవించిన గోదావరి నది వరదలు, ఇంకా ఆ గాయాలను గుర్తు చేస్తూనే ఉన్నాయి. 27 సెప్టెంబర్ 2009న శ్రీశైలం ప్రాజెక్టు నుండి వచ్చిన భారీ వరద నీరు కర్నూలు రూపు రేఖలను ఏవిధంగా మార్చేసిందో మన కళ్లముందు కదలాడుతూనే ఉంది. దాదాపు 40,000 వేల మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పవిత్ర పుణ్యస్థలం మంత్రాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి గుడితో సహా అనేక ప్రదేశాలు 10 అడుగుల దాక వరద నీటి తో మునిగిపోయాయి. అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, భారత వైమానిక దళం, నావికాదళం, ఆర్మీ, విపత్తుల నిర్వహణ సిబ్బంది, సామాజిక సంస్థలు, సేవా కార్యకర్తలు అందరూ వారివారి పాత్రను సమర్థవంతంగా నిర్వహించారు. నేడు కుండపోత వర్షాలతో దాదాపు 100 సంవత్సరాల నుండి నిండని డ్యాంలు అన్ని కేరళ రాష్ట్రంలో నిండి ఆ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాయి. కేరళా రాష్ట్రానికి సహాయం అందించడంలో అన్ని వర్గాల నుండి సమర్థవంతమైన సహాయం అందుతూనే ఉన్నది. వర్షాలు తగ్గుముఖం పట్టిననూ సమస్య ఇప్పుడే మొదలవుతుంది. ప్రజల ఆరోగ్యం అంశం, మంచినీరు, ఆహారం మొదలైన వసతులు కల్పించడం ప్రభుత్వానికి కత్తి మీద సామే.

ప్రకృతి కోపాన్ని తట్టుకోలేక మనిషి నిస్సహాయుడై సహాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నాడు. ప్రకృతిని జయించాలని తపన పడుతున్నాడు. కానీ తాను చేస్తున్న ప్రకృతి విధ్వంసాన్ని ఆపలేకపోతున్నాడు. జీవావరణంకు సంబంధించిన అంశాలలో మానవుడు ఎట్టి పరిస్థితులలో వ్యాపార దృష్టి, లాభాపేక్షను వీడాలి. వృక్ష సంపదను విరివిగా పెంపొందించాలి. భూసారాన్ని పరిరక్షించుకోవాలి. నదీ పరివాహక ప్రాంతాలను ఆక్రమించిన వారికి రాజ్యాంగ బద్ధంగా కఠిన శిక్షలు విధించాలి. దేశంలో విపత్తు నిర్వహణకు సంబంధించిన కోర్సులను ఎక్కువగా ప్రవేశపెట్టి, వాటిని చదవాలనుకున్న విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు, తగు ప్రోత్సాహకాలను అందించాలి. ఇలాంటి విపత్కర పరిస్థితులలో, పక్కవారి సహాయాలకై వేచి, చూసే పరిస్థితి రాకముందే మన దేశంలోని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేయాలి. అదే విధంగా రాష్ట్రాలలోని ప్రభుత్వాలు కూడా రాష్ట్ర విపత్తు సహాయ నిధిని ఏర్పాట్లు తక్షణమే చేయాలి. మరి ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వం విపత్తు సహాయ నిధికి ఒక ప్రత్యేక హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేసి, ఈ నెంబర్‌కు ప్రజలు మిస్సుడ్ కాల్ ఇచ్చిన ప్రతిసారి ఒక్క రూపాయి చొప్పున ఈ నిధికి జమ అయ్యేట్లు ఏర్పాట్లు చేయాలి. ఇలాంటి హెల్ప్‌లైన్ నెంబర్‌ను, దేశ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యతను తక్షణమే మొదలు పెట్టడం అందరికీ శ్రేయస్కరం.

Related Stories: