వాహ్..జ్‌పేయీ

అటల్ బిహారీ వాజ్‌పేయీ భారతీయ జనతా పార్టీ రాజకీయ దిగ్గజం. దేశ రాజకీయాల్లో భీష్మ పితామహుడిలాంటి వారు. సాంస్కృతిక నియంత్రికుడు, ఉదారవాదిగానే కాకుండా సమమున్నత రాజనీతిజ్ఞుడిగా భారతదేశంలో పేరు ప్రఖ్యాతులు గడించిన మహానేత. మూడు సార్లు భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పాలనా కాలంలో భారతదేశం పోఖ్రాన్‌లో అణు పరీక్షలు నిర్వహించి యావత్ ప్రపంచానికి భారత ఘనతను చాటి చెప్పారు. దీని ద్వారా పొరుగు దేశ పాకిస్తాన్‌కు గట్టి పరోక్ష హెచ్చరిక సందేశమూ పంపారు. అదే […]

అటల్ బిహారీ వాజ్‌పేయీ భారతీయ జనతా పార్టీ రాజకీయ దిగ్గజం. దేశ రాజకీయాల్లో భీష్మ పితామహుడిలాంటి వారు. సాంస్కృతిక నియంత్రికుడు, ఉదారవాదిగానే కాకుండా సమమున్నత రాజనీతిజ్ఞుడిగా భారతదేశంలో పేరు ప్రఖ్యాతులు గడించిన మహానేత. మూడు సార్లు భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పాలనా కాలంలో భారతదేశం పోఖ్రాన్‌లో అణు పరీక్షలు నిర్వహించి యావత్ ప్రపంచానికి భారత ఘనతను చాటి చెప్పారు. దీని ద్వారా పొరుగు దేశ పాకిస్తాన్‌కు గట్టి పరోక్ష హెచ్చరిక సందేశమూ పంపారు. అదే సమయంలో ఢిల్లీలాహోర్ బస్సును ప్రారంభించి పాక్‌తో శాంతి గీతిక పాడారు. కేంద్రంలో ఐదేళ్లు నిరాటంకంగా ఒక కాంగ్రేసేతర ప్రభుత్వం నిలబడగలిగిందంటే అది ఒక్క వాజ్‌పేయీకి మాత్రమే సాధ్యమైంది. అత్యున్నత పార్లమెంటేరియన్, పేరెన్నెకగన్న కవి, యావత్ రాజకీయ ప్రపంచంలో ప్రజారంజక నాయకుల్లో వాజ్‌పేయీ ముందు వరుసలో ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి నాయకుడికి ప్రస్తుతం నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేసి గౌరవించడంతో పాటు ఆయన జన్మదినమైన డిసెంబర్ 25ను ‘సుపరిపాలన దినోత్సవం’గా ప్రకటించి ఆయనను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చింది.

రేపూ రేపూ అంటూ
నేటిని చేజార్చుకుంటున్నాం
గత, భవిష్యత్ ఆలోచనలతో
వర్తమాన సమరాన్ని చేస్తున్నాం
తుచ్ఛమైన లాభాపేక్షతో
జీవితాన్ని వ్యాపారం చేసుకుంటున్నాం
విలువలమ్ముకొనేవారి ముందు
నీతిమంతులు అవుతున్నారు!
నన్ను ఒంటరి చేసి
మిత్రులంతా వెళ్లిపోతున్నారు
జీవితమూ గడిచిపోతున్నది..!
వాజ్‌పేయీ హిందీలో రచించిన ‘జీవన్ బీత్ చలా’ కవిత స్వతంత్రానువాదం

ప్రధానిగా ప్రత్యేకతలు

1998, మే నెలలో వాజ్‌పేయీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అదే అణు పరీక్షల నిర్వహణ. రాజస్థాన్‌లోని ఏడారి ప్రాంతం పోఖ్రాన్‌లో ‘బుద్ధుడు మళ్లీ నవ్వాడు’ పేరిట విజయవంతంగా నిర్వహించిన అణు పరీక్షలు యావత్ ప్రపంచానికి భారత్ సత్తాను మరోసారి చాటి చెప్పాయి. (1998లో భారతదేశం తొలిసారి నిర్వహించిన అణు పరీక్షలకు ‘బుద్ధుడు నవ్వాడు’ అని పేరు పెట్టారు) రష్యా, ఫ్రాన్స్ తదితర దేశాలు వాజ్‌పేయీ చర్యను స్వాగతించగా.. అమెరికా, కెనడా, జపాన్, బ్రిటన్, ఐరోపా యూనియన్ తీవ్రంగా గర్హించాయి. దాంతో ఆగకుండా భారత్‌పై పలు రకాల ఆంక్షలు కూడా విధించాయి. ఇంటా బయటా విమర్శలు వచిచనప్పటికీ వాజ్‌పేయీ ఏ మాత్రం వెరవలేదు.

లాహోర్ సమ్మిట్…
1998 చివరలో వాజ్‌పేయీ పాకిస్తాన్‌కు స్నేహ హస్తం చాటారు. దౌత్యపరంగా సంపూర్ణ స్థాయిలో శాంతి ప్రక్రియకు నడుం బిగించారు. 1999 ఫిబ్రవరిలో ఢిల్లీలాహోర్ బస్సును ప్రారంభించారు. పాక్‌తో శాశ్వత శాంతి, కశ్మీర్‌కు పరిష్కారం లాంటి ఇతర వివాదాలను పరిష్కరించేందుకు లాహోర్ డిక్లరేషన్ ప్రకటించారు. పాక్‌తో వాణిజ్య సంబంధాల విస్తృతి, పరస్పర స్నేహం, దక్షిణాసియాలో అణు నిరాయుధీకరణ లాంటివి డిక్లరేషన్‌లో ప్రతిపాదించారు.

కార్గిల్ యుద్ధం…

వాజ్‌పేయి పఠించిన శాంతి మంత్రం, స్నేహ హస్తాన్ని పాక్ పక్కకు నెట్టేసింది. కార్గిల్‌లో చొరబడి కశ్మీర్ లోయ, సరిహద్దుల్లోని పర్వత ప్రాంతాలను, కార్గిల్ చుట్టుపక్కల పట్టణాలను ఆధీనంలోకి తీసుకుంది. పాక్ చర్యలను అంతే స్థాయిలో తిప్పికొట్టాలని నిర్ణయించిన వాజ్‌పేయీ సైన్యానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆపరేషన్ విజయ్ పేరిట భారత సైన్యాలు పాక్ చొరబాటును గట్టిగా తిప్పికొట్టాయి. గడ్డకట్టే చలిలో సైత్యం మన సైన్యాలు ధైర్య సాహసాలు ప్రదర్శించి పాక్ సైన్యాన్ని అక్కడి నుంచి తరిమికొట్టాయి. 1999లో ఖాట్మండూ నుంచి భారత విమానాన్ని ఉగ్రవాదులు కాందహార్‌కు హైజాక్ చేయడం వాజ్‌పేయీ హయాంలోనే చోటుచేసుకున్న ఓ చేదు జ్ఞాపకం. 2000 సంవత్సరంలో వాజ్‌పేయీ అమెరికాతో చరిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మార్చి మాసంలో అమెరికాలో పర్యటించి ఇరు దేశాల నడుమ వాణిజ్య, ఆర్ధిక సంబంధాల విస్తృతికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో కలిసి సంతకం చేశారు. పాక్‌తో తిరిగి శాంతి కోసం ఆగ్రా సమ్మిట్‌కు యత్నించినా పాక్ అధ్యక్షుడిగా ఉన్న ముషారప్ వైఖరితో అది సాధ్యపడలేదు. 2001లో పాక్ ఉగ్రవాదులు పార్లమెంట్‌పై దాడికి తెగపడడం, ఆ తదనంతరం కాలంలో గోద్రాలో చెలరేగిన మత కల్లోలాలు వాజ్‌పేయీని తీవ్రంగా కలిచి వేశాయి. ఇప్పటి ప్రధాని, అప్పటి గుజరాత్ సిఎం మోడీ ‘రాజధర్మాన్ని’ పాటించి ఉండాల్సింది అని చురకలంటించారు.

ఆర్థిక సంస్కరణల్లోనూ తనదైన ముద్ర

వాజ్‌పేయీ తన పాలనా కాలంలో భారతదేశంలో పలు ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడయ్యారు. ఆర్ధిక, మౌలిక రంగాల్లో సంస్కరణలు తీసుకురావడంతో పాటు ప్రైవేటురంగంలో విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించారు. దాంతో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులు దేశంలో పరుగులు పెట్టాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనతో రోడ్ల అభివృద్ధికి బాటలు పడ్డాయి. వాజ్‌పేయీ అనుసరించిన వ్యాపార అనుకూల, స్వేచ్ఛాయుత మార్కెట్ విధానాలు భారత్ ఆర్ధికరంగ అభివృద్ధిలో తనవంతు పాత్ర పోషించాయి.

దేశ రాజకీయాల్లో అజాతశత్రువు తొలి ప్రధానిగా ఐదేళ్ల రికార్డు

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ పట్టణంలో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో వాజ్‌పేయీ జన్మించారు. తండ్రి కృష్ణ బిహారీ వాజ్‌పేయీ మంచి కవి పండితుడు, పాఠశాలలో ఉపాధ్యయుడిగా పనిచేసే వారు. గ్వాలియర్‌లోని సరస్వతీ శిశు మందిర్‌లో అటల్ ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. ఇప్పుడు లక్ష్మీభాయి కాలేజీగా పిలుచుకోబడుతున్న విక్టోరియా కాలేజీలో గ్య్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కాన్పూర్‌లో రాజనీతి శాస్త్రంలో పిజి పూర్తి చేశారు. 1939లో బిజెపి మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)లో అడుగుపెట్టారు. 1947లో అదే సంస్థకు పూర్తి స్థాయి ప్రచారక్‌గా మారారు. హిందీ మాస పత్రిక ‘రాష్ట్రధర్మ’కు కొంతకాలం పనిచేశారు. హిందీ వారపత్రిక ‘పాంచజన్య’, దినపత్రిక స్వదేశ్, వీర్ అర్జున్‌లకు మరింత కాలం పని చేసి పాత్రికేయుడిగా కూడా తనవంతు పాత్రను వాజ్‌పేయీ పోషించారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉండగానే జీవితాంతం బ్రహ్మచారిగా మిగిలిపోవాలని నిశ్చయించుకుని దాన్నే ఆచరించారు. వాజ్‌పేయి దత్తపుత్రిక నమిత. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ అంటే వాజ్‌పేయికి ఎనలేని ఇష్టమైన ప్రాంతం.
పోరాట యోధుడు..
స్వాతంత్య్ర పోరాటం నుంచి వాజ్‌పేయీ తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. తదనంతరం డాక్టర్ శామ ప్రసాద్ ముఖర్జీ నాయకత్వంలోని హిందూ మితవాద భారతీయ జనసంఘ్(బిజెఎస్)లో చేరారు. వాజ్‌పేయీ నాయకత్వ పటిమను గమనించిన శ్యామ ప్రసాద్ వాజ్‌పేయీకి పార్టీ ఉత్తర భారత బాధ్యతలను అప్పగించారు. ఆ తర్వాత 1957లో బలరాంపూర్ నుంచి వాజ్‌పేయీ బిజెఎస్ తరపున లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1968లో బిజెఎస్ జాతీయ అధ్యక్షుడిగా వాజ్‌పేయి పార్టీ పగ్గాలు అందుకున్నారు. ఆయన సహచరులైన నానాజీ దేశ్‌ముఖ్, బాల్‌రాజ్ మధోక్, ప్రస్తుతం బిజెపి కురువృద్ధ నేతగా ఉన్న ఎల్‌కె అద్వానీ మద్దతుతో భారతీయ జనసంఘ్‌ను వాజ్‌పేయి సమున్నత శిఖరాలకు చేర్చారు. 1975లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని వ్యతిరేకిస్తూ జయప్రకాష్ నారాయణ్ ప్రారంభించిన సంపూర్ణ విప్లవంలో అటల్ పాలుపంచుకున్నారు. 1977లో ఇందిరకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన జనతా పారీ నాయకత్వంలోని మహాకూటమిలో జనసంఘ్ భాగమైంది. 1977లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా పార్టీ కూటమి మొదటి సారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్‌పేయీ విదేశాంగ మంత్రి అయ్యారు. విదేశాంగ మంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి సాధారణ సభను ఉద్దేశించి హిందీ బాషలో ప్రసంగించిన తొలి వ్యక్తి వాజ్‌పేయి. 1979లో మొరార్జీ దేశాయ్ ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి రావడంతో వాజ్‌పేయి రెండేళ్లు మాత్రమే విదేశాంగ మంత్రిగా పదవిలో ఉండాల్సి వచ్చింది. ఏది ఏమైనా విదేశాంగ బాధ్యతలు అటల్‌జీని ఒక పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దింది. బిజెఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లోని ప్రముఖులు అద్వానీ, భైరాన్ సింగ్ షెకావత్ తదితర నేతలతో కలిసి 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కేంద్రంలో ఏర్పాటైన కాంగ్రెస్(ఐ) ప్రభుత్వం విధానాలను పదునైన విమర్శలతో వాజ్‌పేయి ఇరుకున పెట్టడమే కాకుండా బిజెపిలో కీలక నేతగా అవతరించారు.
అందరి దృష్టి తనవైపు తిప్పుకోగలిగారు. 1984లో ఇందిర హత్య తదనంతర పరిస్థితుల్లో చేపట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్, సిక్కుల ఊచకోతలను తీవ్రంగా ఖండించారు. 1984లో బిజెపి దేశవ్యాప్తంగా రెండు లోక్‌సభ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అప్పుడు బిజెపి అధ్యక్షుడిగా, మరోవైపు సభలో విపక్ష నేతగా వాజ్‌పేయి తనవంతు పాత్ర పోషించారు. బాబ్రీ మసీదు కూల్చివేతను బిజెపి ‘ఘోర తప్పిదం’గా అభివర్ణించి తన రాజనీతిజ్ఞతను చాటుకున్నారు. భారత రాజకీయాల్లో అటల్ బిహారీ వాజ్‌పేయీని ‘భీష్మ పితామహుడి’గా తన రాజ్యసభ ప్రసంగంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభివర్ణించారంటే ఆయన ఎంతటి రాజనీతిజ్ఞుడో అర్థమవుతుంది.

క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమణ

వాజ్‌పేయీ క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి అడపాదడపా ఆరోగ్య సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. 2001లో ముంబయిని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. 2005లో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తదుపరి ఎన్నికలో పోటీ చేయబోనని ముంబయిలోని శివాజీ పార్క్‌లో నిర్వహించిన చరిత్రాత్మక సభలో ప్రకటన చేశారు. 2009లో మెదడు పనితీరు మందగించడంతో మాట పడిపోయింది. ఇక అప్పటి నుంచి వీల్‌చెయిర్‌కే పరిమితం అ య్యారు. మనుషులను కూడా గుర్తు పట్టలేని స్థితికి చేరుకున్నారు. డిమెన్షియా(మతిమరుపు), దీర్ఘకాలిక డయాబెటిస్ బాధపడుతూ వస్తున్నారు. కొంత కాలం తా బహిరంగంగా ప్రజలకు ఆయన కనిపించిందీ లేదు. ప్రస్తుతం ఆయన నివా సం ఉంటున్న ఇంటి ప్రాంగణంలో తిప్పుతూ బయటి ప్రపంచాన్ని చూపించేవారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయనకు స్వయంగా ఇంటికి వెళ్లి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఇక నిత్యం ఆరోగ్య పరీక్షల కొరకు కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు ప్రత్యేక వాహనాల్లో తీసుకుని వచ్చి మళ్లీ తీసుకెళ్లేవారు. ఇటీవల $రోగ్యం  11న ఎయిమ్స్‌లో చేర్చారు. 16, ఆగస్టున కన్నుమూశారు.

అటల్‌జీ 13..13

వాజ్‌పేయీ 19962004 మధ్య కాలంలో మూడు సార్లు ప్రధానమంత్రి పదవిని అధిష్టించార. 1996 సాధారణ ఎన్నికల్లో బిజెపి లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాల్ శర్మ, వాజ్‌పేయీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. దాంతో భారత 10వ ప్రధానమంత్రిగా వాజ్‌పేయీ ప్రమాణం చేశారు. అయితే ప్రభుత్వం నిలబడేందుకు కావాల్సిన మద్దతును ఇతర పార్టీల నుంచి కూడగట్టడంలో ఆయన విఫలమయ్యారు. దీంతో 13 రోజుల్లోనే ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. భారతదేశ చరిత్రలోనే అత్యంత తక్కువ కాలం(13 రోజులు) పనిచేసిన ప్రధానిగా అటల్ నిలిచిపోయారు.
1996 98మధ్య కాలంలో రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు కూలిపోయాయి. లోక్‌సభ రద్దు కావడంతో 1998లో మరోసారి దేశంలో సాధారణ ఎన్నికలు నిర్వహించారు. ఈ సారి బిజెపి నాయకత్వంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్‌డిఎ)గా ఏర్పడి ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజారిటీ సాధించంలో వాజ్‌పేయీ ప్రధానమంత్రి అయ్యారు. పార్లమెంట్‌లో కూడా మెజారిటీ నిరూపించుకున్నారు. అంతా సవ్యంగా సాగిపోతుందనుకుంటున్న తరుణంలో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నాయకత్వంలోని అన్నాడిఎంకె రూపంలో వాజ్‌పేయీ ప్రభుత్వానికి ముప్పు ముంచుకొచ్చింది. అప్పటి వరకు వాజ్‌పేయీ ప్రభుత్వానికి గట్టి మద్దతుదారుగా ఉన్న జయలలిత దానిని ఉపసంహరించుకోవడంతో 13మాసాల్లోనే మళ్లీ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అప్పుడు సభలో మెజారిటీకి ఒకే ఒక్క ఓటు దూరంలో నిలిచిపోవడంతో వాజ్‌పేయీ ప్రభుత్వం పడిపోయింది. మొదటి సారి 13రోజుల్లోనే వాజ్‌పేయీ ప్రభుత్వం కూలిపోతే ఈ సారి 13మాసాల్లోనే కాలం చెల్లింది. తిరిగి ప్రభుత్వ ఏర్పాటుకు విపక్షం ముందుకు రాకపోవడంతో లోక్‌సభ రద్దయింది. ఎన్నికల నిర్వహించేంత వరకు వాజ్‌పేయీ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగారు.
1999లో తిరిగి ఎన్నికల నిర్వహించడంతో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ 303(లోక్‌సభ మొత్తం స్థానాలు 543) సీట్లు గెలుచుకుంది. దీం తో ముచ్చటగా మూడోసారి వాజ్‌పేయీ ప్రధాని అయ్యా రు. 13అక్టోబర్ 1999లో ప్రధానిగా ప్రమాణం చేశారు. కాంగ్రెసేతేర ప్రధానిగా 2004 వరకు కొనసాగి ఐదేళ్లు పదవిలో ఉన్న తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

Comments

comments