వారం రోజుల్లో పేపర్ మిల్లు గేట్లను తెరుస్తాం

Good days for the people of Kagaznagar and the workers

కాగజ్‌నగర్ వాసులకు, కార్మికులకు మంచిరోజులు
సిర్పూర్ ఎంఎల్‌ఎ కోనేరు కోనప్ప

మన తెలంగాణ/కాగజ్‌నగర్ : కాగజ్‌నగర్ పట్టణానికి గుండెకాయ లాంటి సిర్పూర్ పేపర్ మిల్లు గేట్లను మరో వారం రోజుల్లోపు తెరుస్తున్నట్లు సిర్పూర్ ఎంఎల్‌ఎ కోనేరు కోనప్ప వెల్లడించారు. శనివారం పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం చొరవ వల్లే మిల్లుకు మంచి రోజులు వచ్చాయని, ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్‌ల సహకారంతో వచ్చే శనివారం లోపు పేపర్ మిల్లు గేట్లను తెరుస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డల పెళ్ళిలు భారం కావద్దనే సదుద్ధేశ్యంతో రాష్ట్రంలో షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలను అమలు చేస్తున్నారని, ఈ పథకాల ఆర్థిక సహాయాన్ని క్రమంగా పెంచుతూ లక్ష 116 రూపాయలకు పెంచారని గుర్తు చేశారు. ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు చేయించుకుంటే ఆర్థిక సహాయం అందించే ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతోందని, కెసిఆర్ కిట్లు, ఒంటరి మహిళలకు పెన్షన్లు, వితంతువు, వికలాంగులు, వృద్ధులకు ఆసరా పెన్షన్లు, జ్యోతిబా ఫూలే గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ వర్గాల ప్రజలకు అత్యుత్తమ విద్య అందించాలనే ఉద్ధ్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కెసిఆర్ అందరి మన్ననలు పొందుతున్నారని ఎంఎల్‌ఎ కోనేరు కోనప్ప అన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, పట్టణ ప్రాంతంలో నూతన రోడ్ల నిర్మాణాలకు 10 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, చింతగూడ కోయవాగు బ్రిడ్జి నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు మంజూరై పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. మిషన్ భగీరథ పథకం ద్వారా కాగజ్‌నగర్ పట్టణానికి రెండు పూటలు నీరందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత చరిత్రలో చేయని సంక్షేమ పనులను ముఖ్యమంత్రి కెసిఆర్ చేసి చూపుతున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగపర్చుకొని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

comments