వాయు కాలుష్యం పడగనీడలో

Help from foreign governments

సంపాదకీయం: పెరుగుతున్న జనాభా, రవాణా వాహనాల కారణంగా నగరాల్లో వాయు కాలుష్యం ప్రధాన ఆరోగ్యమైన సమస్యగా మారుతున్నది. సరైన ప్రణాళికలు కొరవడటం, రూపొందించుకున్న ప్రణాళికలను సక్రమంగా అమలు జరపకపోవటం వల్ల ఈ సమస్య తీవ్రమవుతున్నది. మహా కాలుష్య నగరంగా రాజధాని ఢిల్లీ మనకు తెలుసు. అది ప్రత్యేకించి శీతాకాలంలో వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నది. అయితే ఇది ఒక్క ఢిల్లీ సమస్య కాదు. మన హైదరాబాద్‌సహా మహానగరాలు వాయు కాలుష్యంతో జనాభాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సిఎస్‌ఇ) అనే సంస్థ ‘పట్టణ రవాణా, కాలుష్యం, ఇంధన వినియోగంలో దాని పాత్ర’ అన్న అంశంపై 14 భారత నగరాల అధ్యయన నివేదికను శుక్రవారం కోల్‌కతాలో విడుదల చేసింది. “వాయు కాలుష్యం ఒక జాతీయ సంక్షోభం. వాతావరణానికి హానికరమైన విష వాయువుల విడుదల అతి ఎక్కువగా రోడ్డు రవాణా రంగంలో జరుగుతోంది” అని సిఎస్‌ఇ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిమిత రాయ్‌చౌదరి వెల్లడించారు. “భారత దేశంలో మోటారు వాహనాల సంఖ్య 10.5 కోట్ల సంఖ్యను దాటటానికి 60 సంవత్సరాలు (19512008) పట్టింది.

ఆ తదుపరి ఆరేళ్లలోనే (200915) అంతే సంఖ్య వాహనాలు పెరిగాయి” అని ఆమె వెల్లడించారు. వాతావరణ కాలుష్య నివారణ చర్యలను ముమ్మరం చేయాల్సిన ఆవశ్యకతను ఇది వక్కాణిస్తున్నది. రెండు అంశాల ప్రాతిపదికగా సిఎస్‌ఐ అధ్యయనం జరిగింది. అవి మొత్తం మీద ఉద్గారం, ఇంధన వినియోగం; ట్రిప్పులో తలసరి ఉద్గారాలు, ఇంధన వినియోగం. ఆరు మహా నగరాలను (ఢిల్లీ, ముంబయి, కోల్‌కత, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్), ఎనిమిది మెట్రోపాలిటన్ నగరాలను (భోపాల్, లక్నో, జైపూర్, చండీఘర్, అహ్మదాబాద్, పూనె, కొచ్చి, విజయవాడ) అది విశ్లేషించింది. నగర రవాణా ఆచరణలను అధ్యయనం చేసి విడుదలవుతున్న బొగ్గు పులుసు వాయువు ప్రాతిపదికగా ర్యాంకింగ్ ఇచ్చింది. స్థూల ఉద్గారాలు, ఇంధన వినియోగంలో భోపాల్ అగ్రస్థానంలో ఉండగా ఢిల్లీ అట్టడుగు స్థాయిలో ఉంది. భోపాల్ విజయవాడ, చండీఘర్, లక్నో, కొచ్చి, జైపూర్, కోల్‌కతా ఉండగా ఆ తర్వాత ముంబై,అహ్మదాబాద్, పూనె ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలు ఢిల్లీకి పైన మూడు స్థానాల్లో ఉన్నాయి. మెట్రోపాలిటన్ నగరాల పరిస్థితి మహానగరాల కన్నా మెరుగ్గా ఉన్నప్పటికీ వ్యక్తిగత వాహన ట్రిప్పులు ఎక్కువగా ఉన్నందున అవి ఇబ్బందిలో ఉన్నాయని పేర్కొన్నది. జనాభా, ట్రావెల్ డిమాండ్ పెరుగుతున్నప్పటికీ వాహనాల సంఖ్యను అదుపు చేయవచ్చుననటానికి కోల్‌కతాను చక్కని ఉదాహరణగా పేర్కొన్నది. అత్యధిక జిడిపి ఉన్న ముంబయి నగరంలో ఇతర మహా నగరాలతో పోల్చితే వాహనాల వృద్ధి రేటు తక్కువ అని వెల్లడించింది. ప్రజా రవాణా వెన్నెముకగా కోల్‌కత, ముంబయి వృద్ధి చెందాయి.

హైదరాబాద్ మహానగరానికి సంబంధించి సిఎస్‌ఇ నివేదిక అధ్యయనం చేయదగింది, దిద్దుబాటు చర్యలు తీసుకోదగింది. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయటానికి అనేక ప్రణాళికలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టటం అవసరం. సిఎస్‌ఇ అధ్యయనాంశాలైన స్థూల ఉద్గారాలు, ఇంధన వినియోగం విషయంలో హైదరాబాద్ 11వ స్థానంలో, ఒక ట్రిప్పు రవాణా ఉద్గారాలు, ఇంధన వినియోగంలో 14వ స్థానంలో ఉంది. బెంగళూరు, చెన్నై నగరాల్లో వలె హైదరాబాద్‌లో జనాభా, మోటారు వాహనాలు పెరుగుతున్నాయి. అయితే ప్రభుత్వ రవాణాలో ప్రయాణించేవారి సంఖ్య తక్కువగా ఉంది. వాహనాలు అనేక ట్రిప్పులు తిరుగుతున్నాయి. కాని సగటు ప్రయాణీకుల సంఖ్య తక్కువ. ఇతర మహానగరాలతో పోల్చినపుడు హైదరాబాద్‌లో కార్లు, ద్వి చక్ర వాహనాల సగటు ప్రయాణ దూరం ఎక్కువ, ప్రభుత్వ రవాణా వాహనాల్లో ప్రయాణం తక్కువ. హైదరాబాద్‌లో బొగ్గు పులుసు వాయువు ఉద్గారం ఢిల్లీ కన్నా రెండు రెట్లు ఎక్కువ, ట్రిప్పు ఒకటికి ఇంధన వినియోగం దాదాపు రెండు రెట్లు ఎక్కువ అని నివేదిక వెల్లడించింది. ఇది పబ్లిక్ రవాణా నిపుణులకు నిజమైన సవాలు. బస్సుల ప్రయాణాలు, రహదారులు, రద్దీ, ప్రత్యామ్నాయ రహదారులు, సైకిల్ మార్గాలు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధి, యూరో II ప్రమాణాలతో కూడిన బస్సులు ప్రవేశపెట్టటం ఇలా అన్ని కోణాలను అధ్యయనం చేయాలి. అంచెలంచెలుగా అమలులోకి తేవాలి. మన మహానగర జీవనం ఆహ్లాదకరం, ఆనందమయంగా వృద్ధి చెందటంలో పబ్లిక్ రవాణా పాత్ర ఎంతైనా ఉంది.

Comments

comments