వస్తే కోట్లు దొరికితే 420

అక్రమాలకు అండగా చట్టాలు కోట్లలో వసూళ్లు బలహీన చట్టాలతో తేలిగ్గా బయట పడుతున్న అక్రమార్కులు  ఏదో ఒక అక్రమానికి తెరతీయి వస్తే భారీగా డబ్బు వస్తుంది. మహా అయితే 420 కేసవుతుంది. అంతకు మించి ఏమీ జరగదులే అన్న ధీమా  అక్రమార్కుల్లో పెరిగిపోతుంది. ఈ క్రమంలో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కోట్ల రూపాయలు దండుకున్న వ్యక్తిపై ఐపిసి సెక్షన్ 420 మినహా ఇతర సెక్షన్లు పెట్టి కఠినంగా శిక్షించే అవకాశం లేకపో వడంతో కోట్లు దండుకున్నవారు  […]

అక్రమాలకు అండగా చట్టాలు
కోట్లలో వసూళ్లు
బలహీన చట్టాలతో తేలిగ్గా బయట పడుతున్న అక్రమార్కులు 

ఏదో ఒక అక్రమానికి తెరతీయి వస్తే భారీగా డబ్బు వస్తుంది. మహా అయితే 420 కేసవుతుంది. అంతకు మించి ఏమీ జరగదులే అన్న ధీమా  అక్రమార్కుల్లో పెరిగిపోతుంది. ఈ క్రమంలో భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కోట్ల రూపాయలు దండుకున్న వ్యక్తిపై ఐపిసి సెక్షన్ 420 మినహా ఇతర సెక్షన్లు పెట్టి కఠినంగా శిక్షించే అవకాశం లేకపో వడంతో కోట్లు దండుకున్నవారు  కొద్ది రోజుల్లోనే కాలరేగరేస్తూ వీధుల్లో తిరుగుతున్నారు. వీళ్లను నమ్మి చెమటొడ్చి సంపాదించిన సొమ్ము ఇచ్చిన వారు మాత్రం లబోదిబోమంటున్నారు. ఖమ్మంలో వరుస ఘటనలు దిన్నే రుజువు చేస్తున్నాయి. ఏమీ కాదులే అన్న ధీమా పెరగడంతో మోసాలు పెరుగుతున్నాయి. చట్టాలపై కనీస అవగాహన లేని సామాన్యుడు సైతం అవ్వ  ఇదేమీ తీరు అంటూ ముక్కున వేలేసుకు నే పరిస్థితి కన్పిస్తుంది. ఉద్యోగా లంటూ ఆరు కోట్లు దండుకున్న వ్యక్తిపై కేసు నమోదైతే  ఇప్పుడు సరదాగా తిరుగుతూ చట్టాలను ఎగతాళి చేస్తుంటే  ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. 

మన తెలంగాణ/ఖమ్మం : వివిధ ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాలు ఉన్నాయి. అటెండరు పోస్టుల నుంచి ఎల్‌డిసి, ఈడిసిల వరకు ఖాళీలు ఉన్నాయి. వీటి భర్తీ పేపర్లో ప్రకటన ఇస్తే పెద్ద సంఖ్యలో పోటీ ఉంటుందని హైద్రాబాద్ స్థాయిలో కొందరు అధికారులు గుట్టు చప్పుడు కాకుండా నింపేస్తున్నారు. మీరు రూ.10 లక్షలు ఇస్తే డిఆర్‌డిఏ, ఐటిడిఏ, మున్సిపాల్టీ మొదలైన శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఓ వ్యక్తి ఆరు కోట్లు వసూలు చేశాడు. కొందరికీ ఉద్యోగాలు వచ్చినట్లు కాల్ లెటర్స్ తయారు చేసి ప్రభుత్వ కార్యాలయాలకు పంపి ఓ పెద్ద డ్రామా నడిపాడు. మోసం తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఎన్ని కోట్లు వసూలు చేసినా మాకేం సంబంధం లేదు. మోసాలకు పాల్పడితే మేము 420నే నమోదు చేస్తామంటూ పోలీస్ అధికారులు చేతులు దులిపేసుకున్నారు. 60 మంది వద్ద నుంచి రూ.6కోట్లు వసూలు చేసి అత్యంత విలాసవంతమైన జీవితం గడిపిన వ్యక్తి ఇప్పు డు హాయిగా తిరుగుతుండగా బాధితులు మాత్రం లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం ఈ కేసు పోలీసుల పరిధిలోనే ఉంది. వ్యాపారం చేస్తూన్నానంటూ రైతుల వద్ద నుంచి కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను కొని నాకు నష్టం వచ్చిందంటూ ఓ వ్యక్తి చేతులేత్తేశాడు. బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే బయట మాట్టాడుకోండి లేదంటే ఐపిసి 420 కింద కేసు నమోదు చేస్తామంటూ పోలీసులు తేల్చి చెప్పారు. అక్రమార్కులకు సెక్షన్ 420 అండగా నిలబడుతూ కొందరికీ మాత్రం కాసులు కురిపిస్తుంది. దీన్ని ఆసరా చేసుకుని అందిన కాడికి పిండుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఎస్‌సి కార్పొరేషన్ పరిధిలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి భారీ ఎత్తున వసూలు చేశాడు. ఆ వ్యక్తి ఇప్పుడు యదేచ్చగా తిరుగుతున్నాడు. ఇసుక రాంపులు ఇప్పిస్తామంటూ, బదిలీలు చేపిస్తామంటూ, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఈ భూమి మాదే విక్రయిస్తామంటూ, లేదా ఇతరుల భూములను విక్రయించి కోట్లు దండుకుంటున్నారు. మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసం చేసే వాడు ఉంటాడు. ఈక్రమంలోనే ఇప్పుడు హ్యాపీ ప్యూచర్ మల్టీ పర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లి॥ సంస్థ బాగోతం వెలుగు చూసింది. ఈ సంస్థ నిర్వహకుల్లో ఒకరు కోట్ల రూపాయలు దండుకున్నాడు. నాలుగు సంవత్సరాల క్రితం దయనీయ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు అత్యంత ఖరీదైన కార్లలో తిరుగుతున్నాడు. కేజీల కొద్ది బంగారం కొన్నాడని, రూ.60 లక్షల ఇంటిని కొనుగోలు చేశాడన్న ఆరోపణలు సర్వత్రా విన్పిస్తున్నాయి. గుంటూరు కేంద్రంగా రియల్ ఎస్టేట్‌కు తెరలేపినట్లు తెలుస్తుంది. దాదాపు 500 మందిని మోసం చేసినట్లు సమాచారం. ఇంత చేసిన ఈ వ్యక్తి పై కూడా 420 నమోదు చేస్తే ఇప్పుడున్న చట్టాల ప్రకారం స్టేషన్‌లోనే బెయిల్ పొందే అవకాశం ఉంది. ఎంతకు ముంచినా ఒక్కరోజులో బయటకు వచ్చే అవకాశం ఉండడంతో మోసాల సంఖ్య మరింతగా పెరుగుతుంది. వస్తే కోట్లు, అయితే 420 అన్న చందంగా తయారైంది. ఇప్పటికైనా నేరాల తీరు మారుతున్నందున సెక్షన్లపై పునరాలోచన చేయాలని బాధితులు కోరుతున్నారు. అక్రమార్కులు మోసం చేసి సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు పంపిణీ చేయడం, కఠినంగా శిక్షించడం లాంటి చర్యలకు పాల్పడకపోతే మోసం రాయుళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది.

Related Stories: