వసతి గృహాలు సమస్యల నిలయాలు…

 Students Facing  Problems in  BC Velfare  Hostel

మేడ్చల్ : ప్రభుత్వ వెనుక బడిన తరగతుల వసతి గృహాల్లో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి గోద అరుణ్‌యాదవ్ డిమాండ్ చేశారు. మేడ్చల్ పట్టణంలోని వెనుకబడిన తరగతుల వసతి గృహాన్ని ఆదివారం బిసి సంఘం విద్యార్థి నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థుల వసతి గృహాల్లోని సమస్యలు అలాగే ఉన్నాయని  అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పడం మాత్రమేనని కాని వసతి గృహాల్లో సమస్యలు అనేకం ఉన్నాయని తెలిపారు. మేడ్చల్ పట్టణంలోని బిసి వసతి గృహంలో వాటర్‌ ఫిల్టర్ పని చేయడంలేదు, 70 మంది విద్యార్థులు ఉంటే కేవలం ఒక మరుగుదొడ్డి మాత్రమే అందుబాటులో ఉంది. వసతి గృహాంలోని గదుల పైకప్పు పెచ్చులూడుతున్నాయి. మెనూను అనుసరించకుండా విద్యార్థులకు అత్తెసరుగా భోజనాలు పెడుతున్నారు. నాణ్యమైన భోజనాన్ని అందించడంలేదు. ఉన్నతాధికారులు వెంటనే వసతి గృహాలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సి, ఎస్టి, బిసి విద్యార్థి సంఘం మేడ్చల్ జిల్లా ప్రధానకార్యదర్శి బాలకిరణ్, నరేందర్, మహేశ్, రాజ్‌కుమార్, రాజేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments