వర్ష బీభత్సంతో కేరళ విలవిల

Condition of the state of Kerala with the unpleasant rains is a heartbeat

పది రోజులుగా ఎడతెగని వర్షాలు, వరదల బీభత్సంతో కేరళ రాష్ట్ర ప్రజల పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. వాగులు, వంకలు, నదులు, ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 1500లకు పైగా సహాయక కేంద్రాల్లో 3 లక్షల మందికి ఆశ్రయం పొందారు. ఇంకా లక్షలాది మంది కూడు, గూడు, తాగునీటి కొరకు అలమటిస్తున్నారు. సైన్యం, నావికాదళం, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నా కమ్యూనికేషన్‌లు తెగిపోయి సమాచారం అందటమే కష్టంగా ఉంది. రోడ్డు, రైలు, విమానయాన సంబంధాలు నిలిచిపోయాయి. కరెంటు లేదు. చుట్టూ నీరున్నా తాగటానికి గుక్కెడు నీటికి కరువు. చిన్నపిల్లలకు పాలు కరువు. కూలిన ఇళ్లు, విరిగిపడుతున్న కొండ చరియలు. వరదలో కొట్టుకపోతున్న మానవ, పశు కళేబరాలు. ఇదొక మాటలకందని మానవ విషాదం. జాతీయ విపత్తు. 1924 తర్వాత అతిపెద్ద ప్రకృతి విలయం. వాతావరణ మార్పు దుష్ప్రభావం, పర్యావరణను ధ్వంసం చేస్తున్న మానవ తప్పిదాల ప్రభావం నిరాకరించలేనిది. ఈ ఏడాది వర్ష రుతువు తొలిపర్వంలో కొన్ని ఉత్తరాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక, కేరళల్లో అతి భారీ వర్షాలు కురియటం ప్రకృతి మానవుల మధ్య సమతౌల్యం దెబ్బతినటాన్ని స్పష్టంగా సంకేతిస్తున్నది.

కేరళ ప్రభుత్వం భద్రతా దళాలు, రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీల సహాయంతో ప్రజలను రక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నది. దాదాపు రూ. 20 వేల కోట్ల విలువ మేర నష్టాలు సంభవించినట్లు ప్రాథమిక అంచనా వేసింది. కేంద్రం నుంచి రూ. 2500 కోట్ల తక్షణ సహాయానికి విజ్ఞప్తి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, రాష్ట్ర ప్రభుత్వాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. కేంద్రం నుంచి రూ. 500 కోట్లు తాత్కాలిక సహాయం ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన రూ. 100 కోట్ల సహాయానికి ఇది అదనం. వర్ష బీభత్సంలో చనిపోయినవారికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ప్రధాని ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు.

ఈ విపత్సమయంలో బాధిత రాష్ట్రానికి చేయూత ఇచ్చేందుకు ఇతర రాష్ట్రాలు వెంటనే ముందుకు రావటం అభినందనీయం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎంతో ఔదార్యంతో రూ. 25 కోట్ల నగదును, 100 టన్నుల ఆహార పదార్థాల సహాయం ప్రకటించి బాధల్లోని కేరళ ప్రజల పట్ల సంఘీభావం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రూ. 10 కోట్లు, ఇంకా పలు రాష్ట్రాలు వాటి శక్తి కొలది సహాయం ప్రకటిస్తున్నాయి. మందులు, ఆహారపదార్థాలు, గృహోపకరణాల సేకరణకు అనేక సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వస్తు న్నాయి. పెద్ద ఎత్తున అందే మానవతా సహాయాన్ని సక్రమంగా పంపిణీ చేయటం ప్రభుత్వ యంత్రాంగానికి సవాలు వంటిది. కేరళీయులు లక్షల సంఖ్యలో పని చేస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కేరళ రాష్ట్రానికి తగు సహాయం చేస్తామని ప్రకటించటం హర్షనీయం.

వరదలు తగ్గేంతవరకు సహాయక చర్యల ద్వారా బాధిత ప్రజలను ఆదుకోవటం ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన కర్తవ్యం. ఈ విషయంలో కేరళ ప్రభుత్వం టెక్నాలజీ ఉపయోగిస్తూ అందిన సమాచారానికి వెంటనే స్పందిస్తున్నది. అయితే కరెంటు లేనందున టివిలు పనిచేయకపోవటం, సెల్‌ఫోన్‌లు ఛార్జీ అయిపోవటం వంటి ఇబ్బందులతో ప్రజలు సహాయ కేంద్రాలకు సమాచారం అందించటంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయినా సాధ్యమైనంత మేరకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ బాధితుల్లో ప్రతి ఒక్కర్నీ చేరుకోవటం సహాయక బృందాలకు సాధ్యం కాకపోవచ్చు. సహాయక కేంద్రాల్లో కూడా సేవలు కష్టతరంగానే ఉంటాయి. అయితే బయట నుంచి అందే సహాయాన్ని సక్రమంగా పంపిణీ చేయటానికి ప్రభుత్వం ఎన్నో హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేసింది. వరద నీరు తీసిన తదుపరి పునరావాసం పెద్ద సమస్యగా ముందుకు వస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు జరిగిన నష్టాన్ని అంచనా చేయటం, ధ్వంసమైన రహదారులు, విద్యుచ్ఛక్తి మార్గాలు, తాగు నీటి వసతుల పునరుద్ధరణ, నష్టపోయిన ప్రైవేటు ఆస్తులు, పంట నష్టాల అంచనా, పరిహారం చెల్లింపుతోపాటు కూలిపోయిన గృహాల పునర్నిర్మాణం బృహత్ కార్యం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శక్తి సరిపోదు. కేంద్రం ఉదారంగా ఆదుకోవాలి.

Comments

comments