వరపటి కాలమే

The temperature rises from two days

వాడిపోతున్న మొక్కలు
అరకొరగా వర్షాలు
రెండు రోజుల నుంచి పెరిగిన ఉష్ణోగ్రతలు
దయనీయంగా మారిన పునాస పంటలు

ఆదిలోనే హంసపాదుగా అన్నట్లుగా తయారైంది ఖరీఫ్ పరిస్థితి. ఒక వర్షం, ఒక వారం ఎండలు అన్న రీతిలో సాగుతుంది. అసలే కష్టాల కార్ఖానాగా ఉన్న వ్యవసాయ రంగంపై ప్రస్తుత వాతావరణ పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. విత్తు విత్తక విత్తితే మొలవక సగం మొలిచి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పత్తి తప్ప మరో పంట వేసే పరిస్థితి కన్పించడం లేదు. పునాస పంటల పరిస్థితి దయనీయం.

మన తెలంగాణ/ఖమ్మం : వాతావరణ పరిస్థితులు ఈ ఏడాది వ్యవసాయానికి అనుకూలంగా ఉండే పరిస్థితి కన్పించడం లేదు. అత్తు, బిత్తు వర్షాలతో సాగు ముందుకు సాగే పరిస్థితులు కన్పించడం లేదు. జూన్ మొదటి, రెండవ వారంలో అరకొరగా కురిసిన వర్షాలకు దుక్కులు దున్ని భూములను సిద్దం చేశారు. ఆ తర్వాత వచ్చిన వర్షానికి పత్తి విత్తనాలు నాటారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 4 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటగా అదును కుదిరిన చోట మాత్రమే పూర్తి స్థాయిలో మొలిచాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదును సరిపోక సగం మొలకెత్తలేదు. మొలిచిన మొక్కలకు పాటు లేక మొలవని చోట తిరిగి విత్తు నాటేందుకు వర్షం లేక రైతులు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పత్తి పరిస్థి ఈవిధంగా ఉంటే పునాస పంటలైన కంది, మొక్కజొన్న, పెసర, మినుమును ఉమ్మడి జిల్లాలో ప్రతి ఏటా లక్షన్నర ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గింది. సాగు చేసిన చోట భూమిలో సరైన పదును లేక విలవిలలాడుతున్నారు. విపరీతంగా ఎండకాస్తుండడంతో మిడతలు ఆకులను తినేస్తున్నాయని దీనికి తోడు పురిటి మొక్కలనే చీడ తినేస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. చెరువులు, కుంటలు ఇతర నీటి వనరుల్లోకి కొత్త నీరు చేరకపోవడంతో వరి నారు పోసే పరిస్థితి కన్పించడం లేదు.
భూ గర్బ జల నీటిమట్టం పెరగకపోవడంతో వ్యవసాయ బోర్ల కింద సాగుకు ముందుకు వెళ్లే పరిస్థితి కన్పించడం లేదు. ప్రభుత్వం 24 గంటల పాటు ఉచిత విద్యుత్తును అందిస్తున్న నీరు లేకపోవడంతో వ్యవసాయ మోటార్లకు పనిలేకుండా పోయింది. మొత్తంగా చూసినప్పుడు ఖరీఫ్ కష్టాలతోనే మొదలైంది. అసలే వర్షాలు ఆలస్యంగా వచ్చాయి. మధ్యలో ముఖం చాటేయడం ఇది చాలదన్నట్లు విపరీతమైన ఎండలు రైతును మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.