వరకట్న దాహానికి అబల అహుతి

Married extra dowry was harassed

మానకొండూర్‌: మండలంలోని ముంజంపల్లి గ్రామంలో గురువారం ఓ వివాహిత అదనపు వరకట్న వేధింపులకు బలైంది. గత కొంత కాలంగా భర్త, అత్త, ఆడపడుచు అదనపు వరకట్నం తీసుకురావాలని తరుచూ మొలుగూరి రేణుక(32) అనే వివాహితను వేధిస్తుండటంతో మనస్థాపానికి గురైన రేణుక గురువారం తన ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని మంటల్లో కాలి తనువు చాలించింది. మానకొండూర్ సిఐ బిల్ల కోటేశ్వర్ తెలిపిన వివరాలు మేరకు… తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన మాచర్ల ఎల్లయ్య కూతురు రేణుకను ముంజంపల్లి గ్రామానికి చెందిన మొలుగూరి ఎల్లవ్వ-రామయ్య దంపతుల కుమారుడు మొలుగూరి గోపాల్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. సుమారు గత 13 ఏళ్ల క్రితం వివాహం కాగా రేణుకకు జయంత్(11) అనే కుమారుడు ఉన్నాడు. గత కొంతకాలంగా రేణుకను ఆమె భర్త గోపాల్, అత్త ఎల్లవ్వ, ఆడపడుచు చెక్కల్ల సరోజన అదనపు వరకట్నం తీసుకురావాలని వేధింపులకు గురి చేస్తున్నారు. రేణుక జీవితంపై విరక్తి చెంది గురువారం ఉదయం ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గమనించి కాపాడే ప్రయత్నం చేసే లోపే అప్పటికే రేణుక మంటల్లో కాలి మరణించింది. పోలీసులకు సమాచారం అందించడంతో స్థానిక సిఐ బిల్ల కోటేశ్వర్ సిబ్బందితో హుటాహుటిన ముంజంపల్లికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. రేణుక ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సిఐ జిల్లా కేంద్రం నుంచి పోలీసు బలగాలను రప్పించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి మాచర్ల ఎల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేణుక భర్త మొలుగూరి గోపాల్, అత్త మొలుగూరి ఎల్లవ్వ, ఆడపడుచు చెక్కల్ల సరోజనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ కోటేశ్వర్ తెలిపారు.