వయస్సులో చిన్న..సేవలో మిన్న

 The note books were distributed to students

మన తెలంగాణ/మునిపల్లి : వయస్సులో చిన్నవారైనా సేవలు చేయడంలో మాత్రం మిన్న (పెద్ద) వారై ప్రజా సమస్యలు తెలుసుకుని తమదైన శైలిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సమాజ సేవే లక్షంగా ముందుకు సాగుతున్నారు. ఓ వైపు చదువు, మరో వైపు సేవా దృక్పథంతో ప్రజల మన్ననలు పొందుతున్నారు. సమాజ సేవలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి ఎదుగుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు షేర్‌ఖాన్ ఎన్నో సేవలు చేస్తూనే ఉన్నారు. ఆ యువకులు ఎక్కడో కాదు మారుమూల పల్లెల్లోనే ఉన్నారు. మట్టి మాణిక్యాలై ప్రజల సమస్యలపై వెలుగు దివిటీలై వెలుగొందుతున్నారు. వారే మండల పరిధిలోని మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన యువకులు. చదువు కుంటూ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తూ ముందడుగు వేస్తున్నారు. సమాజ సేవ లక్షంతో 2010 సంవత్సరంలో “మల్లికార్జున యూత్‌” ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి నిర్విరామంగా ప్రజా సేవే ధ్యేయంగా పని చేస్తున్నారు. జిల్లాపరిషత్ పాఠశాల పదో తరగతిలో ఉత్తీర్ణతతో పాటు అధిక మార్కులు సాధించి స్కూల్‌లో మొదటి స్థానం సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ప్రతి ఏడాది బహుకరిస్తున్నారు. జాతీయ పండుగల సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి తన స్థాయికి తగ్గ బహుమతులను అందజేసేవారు. యువజన వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, వ్యక్తిత్వం, చిత్రలేఖనం, క్విజ్ తదితర పోటీలు నిర్వహించిన అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మల్లికార్జున యూత్ ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు.

పదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు నోటుపుస్తకాలు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగను పురస్కరించుకొని కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహించి గెలుపొందిన క్రీడాకారులకు అందించేవారు. 2017 సంవత్సరంలో వారి స్వంత గ్రామమైన మల్లికార్జునపల్లిలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోనే మొట్ట మొదటి సారిగా నిర్వహించారు. దీంతో వివిధ గ్రామాల మన్ననలు పొందారు. ఈ పోటీలకు మునిపల్లి మండలమే కాకుండా సంగారెడ్డి, పుల్కల్, అంథోల్, కంది, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని వివిధ మండలాల్లోని క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఇందులో గెలుపొందిన జట్టుకు రూ.20వేలు మొదటి బహుమతిగా, రూ.10వేల రెండో బహుమతిగా అందించి అదరహో మల్లికార్జునపల్లి అనే బిరుదును సాధించారు. 2018లో కంటి సమస్యతో బాధపడుతున్న వారికి లయన్స్‌క్లబ్ సాదురాం ఆసుపత్రి హైదరాబాద్ సౌజన్యంతో దాదాపు 50 మందికి ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు చేయించి కంటి అద్దాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఇదే కాక మల్లికార్జునపల్లిలో కూడా వివిధ సేవ కార్యక్రమాలతోపాటు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ ముందడుగు వేస్తున్నారు. అలాగే ఆ కుర్రోడు ఇటీవల గ్రామంలో విద్యుత్ దీపాలు, తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని దృష్టిలో పెట్టుకుని గ్రామస్తులతో కలిసి స్థానిక ఎంపిడిఒ గోపాల్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యేలా చేశారు. గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న బోరు మోటర్ నుంచి గ్రామానికి నీటి సరఫరా అవుతుంది.. అయితే ఆ బోర్‌కు మరమ్మతులకు నోచుకోలేక సుమారు 15 రోజుల పాలు నీటి సమస్యతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో యువతరం కలుగజేసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కంచేందుకు యువత ముందడుగు వేశారు. దీంతో సమస్యను పరిష్కారం కావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకంలో భాగంగా రైతులకు అందించిన చెక్కులను డ్రా చేసుకునేందుకు వీలు కల్పించింది. ఇందులో భాగంగానే గతంలో ఎండాకాలం కావడంతో రైతుల దాహార్తి తీర్చేందుకు చల్లటి నీటి డబ్బాల నుంచి నీటిని ఉచితంగా అందించారు. కాగా మండల పరిధిలోని మల్లికార్జునపల్లి–, అల్లాపూర్ గ్రామాల రోడ్డుకిరువైపులా ఉన్న ముళ్ల పొదలు ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు పడ్డారు. దీంతో యూత్ ఆధ్వర్యంలో రోడ్డుకిరువైపులా ఉన్న ముళ్ల పొదలను నరికి వేశారు. ఇలాంటి యువకులు ఉంటే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే మా లక్షం ః
కార్తిక్ (మల్లికార్జునపల్లి) (మల్లికార్జున్ యూత్)
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందడుగు వేస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేలా ప్రయత్నం చేయడమే మా పనిగా భావిస్తాం. దీనికి గ్రామ పెద్దలు, కుల, మతాలకతీతంగా అందరి అభివృద్ధిని కాంక్షించి ప్రభుత్వ సహకారం మాకు అన్ని వేళలా అందించినట్లైతే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం చాలా సులువవుతుంది.
ఆదర్శ గ్రామ కల నెరవేరుతుంది ః
మల్లికార్జున్ (చిట్టి) :
మల్లికార్జునపల్లి (మల్లికార్జున్ యూత్)
గత కొన్ని రోజులుగా మల్లికార్జునపల్లి యువతరం చేపడుతున్నటువంటి ప్రతి పనికీ గ్రామంలోని యువత ఒక పట్టుపై ఆదర్శ గ్రామ నినాదంతో యువతరం అందరం ముందుకు వచ్చి పలుగు, పార చేత పట్టి పనికి ముందుకొస్తున్నారు. ఇలాగే మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం.. సమస్యల పరిష్కారం దిశగా ముందుడుగు వేస్తూనే ఉంటాం..
అందరి సహకారంతో ముందుకెళ్తున్నాం ః
కలాలి శ్రీకాంత్ గౌడ్ (మల్లికార్జున పల్లి)
మల్లికార్జున యూత్
గ్రామంలో వివిధ వర్గాలు, మా సాటి యూత్ అయినటువంటి అంబేద్కర్ యూత్, గ్రామ పెద్దలు, అధికారుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు మా వెన్ను తడుతున్నారు. ఇలాగే మేము చేసే ప్రతి మంచి పనికి ప్రతి ఒక్కరికీ సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం. గ్రామంలో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మల్లికార్జున యూత్ సిద్ధ్దంగా ఉంటుంది.