వందశాతం మరుగుదొడ్ల నిర్మాణమే లక్ష్యంగా అధికారులు పని చేయాలి

mike2

*గ్రామాలను పరిశుభ్రతవైపు నడిపించాలి
*విధి నిర్వహణలో నిర్లక్షం వహిస్తే కఠిన చర్యలు
*కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

మన తెలంగాణ/పెంచికల్‌పేట్ : మండలంలోని ప్రతీ గ్రామంలో పరిశుభ్ర వాతావరణాన్ని నెలకొల్పి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు ఏకతాటిపై వచ్చి కృషి చేయాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోఉదయం ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రిజిస్టర్‌లు పరిశీలించి, కార్యాలయ సిబ్బందిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రీవెన్స్‌లో వచ్చినటువంటి దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని తహసీల్దార్ రియాజ్‌అలీకి తెలిపారు. విధి నిర్వహణలో రెవెన్యూ సిబ్బంది నిర్లక్షంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మండలంలోని బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా ఏర్పాటు చేసినటువంటి లోడ్‌పల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామంలోని రోడ్లు, మంచినీటి, డ్రైనేజీ వ్యవస్థ సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో  కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ లోడ్‌పల్లి గ్రామానికి ప్రత్యేక నిధులు కేటాయించి బహిరంగ మలమూత్ర రహిత గ్రామంగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ గ్రామంలో మొత్తం 146 మరుగుదొడ్లకు గాను 108 మరుగుదొడ్లు పూర్తికావడం జరిగిందని, పెండింగ్‌లో ఉన్నటువంటి మరుగుదొడ్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా నిర్మించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సమస్యల పరిష్కరానికి అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తోటాజి, ఎంపీపీ మంజుల సదాశివ్, ఏపీఎం పార్చునెథ్, ఏపీఓ సాకీర్ ఉస్మాన్, డీఆర్‌డివో పీడీ వెంకట్, సర్పంచ్ జాజిమొగ్గ శ్రీనివాస్, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.