వందరోజుల్లో 23 దేశాలు

Two girls go to abroad turu

ఇప్పుడున్న రోజుల్లో ఆడపిల్ల ఇంట్లోనుంచి బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. దీని కారణం వారిపై వారికి ఆత్మవిశ్వాసం లేకపోవడం అని కొందరు నిపుణుల అభిప్రాయం. కాని ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఉండి సమజంలో ఒక గుర్తింపు తెచ్చుకునేలా ఉండాలి అని ఇద్దరు అమ్మాయిలు నిరూపించారు. వేదం తెలుగు సినిమాలోని ‘ఎగిరిపోతే ఎంత బావుంటుంది’.. అనే పాటవుంటుంది. ఈ పాట పాడుకోవడానికి బానే ఉంటుంది. కానీ మనం ఇక్కడ చూస్తున్న ఈ ఇద్దరమ్మాయిలు నిజంగానే ఎగిరిపోవడంలో సంతోషాన్ని వెతుకున్నారు. వారిలో ఒకరు 21ఏళ్ల ఆరోహి పండిట్. మరొకరు 23ఏళ్ల కీథియర్ మిస్కిటా.

వీళ్లిద్దరూ ’మాహి’ అనే ఓ చిన్న స్పోర్ట్ ప్లేన్‌లో ప్రపంచాన్ని చుట్టేయడానికి బయల్దేరారు. వీళ్లు కేవలం 100 రోజుల్లోనే ఈ సాహసాన్ని పూర్తి చేద్దామని అనుకున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని పటియాలా ఎయిర్ బేస్ నుంచి ఇద్దరి ప్రయాణం మొదలైంది. ఎక్కడ ఉండాలి? ఫ్లయిట్ ఎక్కడ పార్క్ చేయాలి? ఏ మార్గంలో ప్రయాణించాలి?.. అనే విషయాలను గ్రౌండ్ స్టాఫ్ పరిరక్షణలో ఉంటుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. వీళ్ల ప్రయాణాన్ని గైడ్ చేసే గ్రౌండ్ స్టాఫ్ అందరూ కూడా మహిళలే ఉంటారు. వీరు అనుకున్న విధంగా విజయాన్ని సాధిస్తే భారత్ నుంచి చిన్న విమానంలో ప్రపంచాన్ని చుట్టేసిన తొలి మహిళలుగా వీరి పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి.

అంతే కాకుండా ఈ అమ్మాయిలు ప్రయాణించే విమానానికి ’మాహి’ అనే పేరు పెట్టారు. దాంతో మాహి ఏంటి అని చాలామంది అది క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీని సూచించేందుకు పెట్టారని అనుకుంటున్నారు. కానీ మాహి అంటే భూమి అని, అందుకే ఆ పేరు పెట్టామని ఈ మిషన్ డైరెక్టర్ దేవకన్య ధార్ ఒక పత్రిక ప్రకటనలో చెబుతున్నారు.

మాహి ప్రత్యేకతలు : మాహి దేశంలో రిజిస్టర్ అయిన తొలి లైట్ వెయిట్ స్పోర్ట్ విమానం. ఈ విమానం ఇంజిన్ మారుతీ బలెనో కారు ఇంజన్ అంత శక్తిమంతమైంది. 215 కి.మీ.ల వేగంతో గాల్లో ప్రయాణిస్తుంది. ఇందులో కేవలం 60లీటర్ల ఇంధనం మాత్రమే పడుతుంది. కాబట్టి, ఆగకుండా ఒకసారి నాలుగున్నర గంటలు మాత్రమే ఇది ప్రయాణించగలదు. దీని కాక్‌పిట్‌లో కేవలం ఇద్దరు మాత్రమే పడతారు. అంటే.. దాని వైశాల్యం ఓ ఆటో సీటంతే ఉంటుంది. అందుకే ఎక్కువ సేపు కూర్చొని ప్రయాణించడం కూడా కష్టమే. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ప్యారాచూట్ల సాయంతో కిందకు దూకే సౌకర్యం కూడా ఉంది. ఆరోహి, కీథియర్‌లు వంద రోజుల్లో మూడు ఖండాల్లోని 23 దేశాలను చుట్టేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీళ్లు పటియాలా నుంచి ఆగ్నేయాసియా మీదుగా జపాన్, రష్యా, కెనడా, అమెరికా, గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, యూరప్‌లను చుట్టి వస్తారు. వీళ్లిద్దరూ దేశంలోనే లైట్ స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ లైసెన్స్ పొందిన మొదటి వ్యక్తులు. ఇద్దరూ ముంబై ఫ్లయింగ్ క్లబ్ నుంచి బ్యాచిలర్స్ ఆఫ్ ఏవియేషన్ డిగ్రీ పూర్తి చేశారు. ఆరోహి బాల్యంలో ఓసారి ఓ మహిళ పైలట్‌గా ఉన్న విమానంలో ప్రయాణించారు. భవిష్యత్తులో తాను కూడా పైలట్ కావాలని అప్పుడే నిర్ణయించుకుంది . ఇప్పుడు ఆమె కల నెరవేరింది. ఈ సాహసంలో భాగమైన మరో యువతి కీథియర్. నలుగురు అక్క చెల్లెళ్లలో ఆమే పెద్ద. తమ కుటుంబంలో మొట్టమొదటి పైలట్ కీథియరే. వీళ్లిద్దరూ కలిసి ఏప్రిల్ నుంచి తమ యాత్రకు సన్నద్ధమవడం మొదలుపెట్టారు.

ఈ యాత్రకు వాళ్లు మిషన్ ’డబ్ల్యుఈ’ (WE) అని పేరు పెట్టారు. అంటే విమెన్ ఎంపవర్‌మెంట్(మహిళా సాధికారత). బేటీ బచావో, బేటీ బడావో పథకం కింద ప్రభుత్వం కూడా ఈ మిషన్‌కు సహాయం చేస్తోంది. మహిళల స్వేచ్ఛను, సాధికారతను ప్రకటించడానికి ఇంతకంటే మంచి మార్గం ఉండదేమో అని ప్రోగ్రాం డైరెక్టర్ దేవకన్య అంటున్నారు. వాళ్లు వెళ్లిన ప్రతి దేశంలో అమ్మాయిలను రక్షించాలి, అమ్మాయిలను చదివించాలి’ అనే సందేశాన్ని వినిపిస్తారని ఆమె చెప్పారు. ఈ యాత్ర నేపథ్యంలో క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బుని సేకరించి దాన్ని పేద యువతుల వైమానిక శిక్షణకు ఉపయోగిస్తామని దేవకన్య చెబుతున్నారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. దాన్ని తల్లిదండ్రులు గుర్తించి వారికి తగిన విధంగా ప్రోత్సహించాలంటున్నారు.