రోడ్డు ప్రమాదంలో భర్త మృతి…భార్య పరిస్థతి విషమం

Wounded in husbend wife's accident are serious injuries

కరీంనగర్ క్రైం: కరీంనగర్ రూరల్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు తీవ్రంగా గాయపడగా వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా తీవ్రంగా గాయపడిన భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్యను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలియజేశారు. కరీంనగర్ రూరల్ సిఐ శశిధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… హన్మకొండకు చెందిన నక్క మల్లయ్య (50) ఆయన భార్య నక్క కొమురమ్మలు కలిసి బంధువుల పెళ్ళికి హాజరయ్యేందుకు కరీంనగర్ మండలంలోని బొమ్మకల్ గ్రామానికి విచ్చేశారు. పెళ్ళి తరువాత తిరుగు ప్రయాణంలో కరీంనగర్ బస్టాండ్‌కు వచ్చేందుకు బొమ్మకల్ బైపాస్‌రోడ్ వద్ద ఆటో కోసం నిరీక్షిస్తున్నారు. ఇదే సమయంలో గోదావరిఖని వైపు నుండి కరీంనగర్ వైపు ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తున్న మెడికల్ విద్యార్థులు అదే వేగంతో భార్య భర్తలను ఢీకొన్నారు. దీంతో వారు తీవ్రంంగా గాయపడగా స్థానికులు ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అప్పటికే మల్లయ్య మృతి చెందారు. గాయాలపాలైన కొమురమ్మను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటుంది. శనివారం మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మల్లయ్య మృతదేహాన్ని బంధువులకు అప్పగించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు కరీంనగర్ రూరల్ సిఐ శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు.