రోగులు ఇక్కడ…వైద్యులు ఎక్కడా..?

Pregnency Women Facing Problems In Jangoan Govt hospital
మన తెలంగాణ/ బచ్చన్నపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. అందుకోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పించడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. కాని ప్రభుత్వ డాక్టర్లు ఆస్పత్రులకు డుమ్మా కొట్టడంతో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందనేదానికి నిదర్శనంగా బచ్చన్నపేట ఆరోగ్య కేంద్రమే దర్శనమిస్తుంది. గత ఐదేళ్లపాటుగా డాక్టర్ అశోక్‌కుమార్ పనిచేసి బదిలీలో భాగంగా కోమళ్ల ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా ఇక్కడికి కొత్తవారు రాకపోవడంతో డెంటల్ డాక్టర్ ఒక్కడే ఓపీ చూస్తున్నారు. మండలంలోని 26 గ్రామాల నుంచి ప్రజలు అనేక మంది రోగులు వస్తుంటారు.
గర్బిణీ స్త్రీలను చూసేదెవరు…
మండల కేంద్రానికి వచ్చే గర్బిణీ మహిళలకు మహిళా వైద్యాధికారి విధులకు రాకపోవడంతో గర్బిణీస్త్రీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే ఆర్థిక స్థోమత లేకపోయినప్పటికీ డాక్టర్ రాకపోవడంతో బాధలు తట్టుకోలేక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సివస్తుందని పలువురు గర్బిణీ స్త్రీలు వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరగాలనే ప్రధాన లక్షంతో ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగపిల్లాడు పుడితే రూ.12వేలతోపాటు కేసీఆర్ కిట్ ఇస్తూ ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ సంబంధిత డాక్టర్ల నిర్లక్షంతో ప్రభుత్వ ఆశయానికి గండిపడుతుందన్నారు.
జూనియర్ అసిస్టెంట్ జాడెక్కడ..?
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి కనీసం నెలలో నాలుగు రోజులైనా విధులకు రాకుండా వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నప్పటికీ సంబంధిత జిల్లా అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు వాపోయారు. జిల్లా వైద్యశాఖ అధికారులు ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రత్యేక నిఘా ఉంచి డాక్టర్లను నియమించాలని పలువురు గ్రామస్తులు కోరారు.

Comments

comments