రైతే రాజు

Government is of the highest priority for agriculture

ముఖ్యమంత్రి కెసిఆర్ పథకాలతో రైతుల కళ్లలో ఆనందం
ఆత్మగౌరవాన్ని పెంచిన రైతు బంధు
కుటుంబానికి రక్షణ కల్పించిన రైతు బీమా
వ్యవసాయ రంగానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
గత ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలు
టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో గుండెనిండా ధైర్యం
కరుణిస్తున్న వరుణ దేవుడు

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ : ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో అత్యధికంగా నష్టపోయింది ఉమ్మడి పాలమూరు జిల్లానే. చెంతనే తుంగభద్ర,కృష్ణమ్మ పారుతున్నా ఇక్కడి రైతులకు కన్నీటి వ్యవసాయమే మిగిలింది. రాష్ట్రంలో బోర్లమీద ఆధారపడ్డ జిల్లాలో పాలమూరు జిల్లాదే ప్రధమ స్థానం. గ్రావిటి ద్వార కోస్తా మూడు పంటలతో శస్యశ్యామలం కాగా, ఒక్క పంటకు కూడ నీరు లేని దుస్ధితి పాలమూరు జిల్లాది. పేరుకే ఇక్కడ వంద ఎకరాల రైతు ఉన్నా వలస వెళ్లాల్సిందే. వర్షాధారంపై ఆధారం. ఒక సంవత్సరం అతివృష్టి వస్తే మరో ఏడాది అనావృష్టితో పాలమూరు జిల్లా రైతులు బక్కచిక్కిపోయారు. తెలంగాణా రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి ఫలితంగా పాలమూరు జిల్లాలో సాగునీటి రంగం విస్తరణ కావడంతో వ్యవసాయ రంగం పూర్తిగా మారిపోయింది.
గత నాలుగు రోజులుగా మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాలో వానలు కురుస్తున్నాయి. మరో వైపు కర్నాటక, మహారాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు అటు తుంగభద్ర నదికి, ఇటు జూరాల డ్యాంకు వరదనీరు స్వల్పంగా వచ్చి చేరుతోంది. రోజు రోజుకు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. గత కొంత కాలంగా వరుణుడు ముఖం చాటేయడంతో రైతుల్లో ఆందోళనలు మెదలయ్యాయి.ముంగారు సమయంలో పడిన వర్షాలకు అక్కడక్కడ రైతులు విత్తులు వేసుకున్నారు.అయితే మొదట్లో వర్షాలు కురిసినప్పటికీ ఆ తర్వాత మొఖం చాటేశాయి.దీంతో రైతుల్లో నిరాశలు మొదలయ్యాయి. వర్షాలు రాక పంటలు ఎండిపోయే దశకు వచ్చాయి. మరి కొన్ని భూమిలోనే విత్తనాలు పుచ్చిపోయే పరిస్ధితులు కనిపించాయి. ఎట్టకేలకు వరుణుడు కరుణించడంతో రైతులో ఖరీఫ్ సాగు పట్ల తిరిగి ఆశలు పెరిగాయి. గత ఏడాది అన్ని పంటలు కలిసి జిల్లాలో 2.70 లక్షల హెక్టార్లలో పంటలు సాగు జరగగా, ఈ ఏడాది ఆయికట్టు పెరగడం, రైతు బంధు ద్వారా వ్యవసాయ సాగుకు డబ్బలు ఉండడంతో అదనంగా మరో 30 వేల ఎకరాల్లో ఆయికట్టు పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. మొత్తం 3 లక్షల ఎకరాల్లో పంటలు సాగు జరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో విద్యుత్ కొరతలు, ఎరువుల కోసం ధర్నాలు ఉండేవి. నేడు ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు ప్రభుత్వం సిద్దంగా ఉంది. 17 వేల 85 వేల క్వింటాళ్లు విత్తనాలు,లక్షా 26 వేల 99 టన్నుల ఎరువులు ప్రభుత్వం జిల్లాకు కేటాయించింది. ప్రస్తుతం వర్షాలు సంవృద్ధిగా కురవడం పంటలకు మేలు జరుగడంతో పంటలు ఆశాజనకంగా ఉంటున్నాయి.ముసురు వర్షాలు పంటలకు మేలు చేశాయి.జిల్లాలో కొన్ని చోట్ల చెరువులకు నీరు వచ్చి చేరింది.ఈ వర్షాలు మరో రెండు రోజుల పాటు ఉండే అవకాశాలు ఉండడంతో రైతుల్లో ఆశలు సజీవం అవుతున్నాయి.ఇప్పటి వరకు విత్తువేయని పొలాల్లో కూడా విత్తులు వేసుకుంటున్నారు.
రైతులకు ధీమా ఇస్తున్న బీమా:
రైతులు ఆత్మగౌరవంగా బతికేందుకు అన్ని వసతులను కల్పిస్తుండగా మరోవైపు వరుణుడు కూడా కరిణిస్తున్నాడు. ఈ నేఫథ్యంలో రైతులు ధీమాగా ఉంటున్నారు.ఇప్పటికే రైతు బంధు పథకం కింద ఖరీఫ్‌లో పెట్టుబడులు కింద 3.40 లక్షల చెక్కులు రైతులకు ప్రభుత్వం మంజూరు చేయగా అందులో 2.61 చెక్కులు పంపిణీ చేశారు. ప్రస్తుతం 70 వేల చెక్కులు పంపిణీ చేయాల్సి ఉంది. రైతు ఏ కారణంతోనైనా చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు బీమా అందేలా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం రైతు కుటుంబాలు ధీమాను కల్పిస్తున్నాయి. ఈ పథకం కింద రైతు ప్రమాదం శాత్తు చనిపోయినా, సాధారణ మరణం చెందినా ఈ బీమా మొత్తం రైతు నామినికి చెందేలా ప్రభుత్వం రూపకల్పన చేసింది.ఈ పథకం కింద జిల్లాలో 2.61 లక్షల మంది రైతులను ప్రభుత్వం గుర్తించించింది. రైతు చనిపోతే ఆ కుటుంబం వీధిన పడకుండా తిరిగి ఆ కుటుంబం మనుగడ సాగించేందుకు బీమా కల్పించి నిజంగా రైతును రాజును చేసే ప్రయత్నానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం హర్షనీయమని రైతులు చెబుతున్నారు. గతంలో అప్పులతో రైతులతో ఆత్మహత్యలకు పాల్పడితే ఇప్పడు అన్ని సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుండంతో రైతు కళ్లలో ఆనందం వ్యక్తం అవుతోంది.