రైతుల వేదిక భవనాలకు స్థలం కొరత

area

* జిల్లాలో 70భవనాల నిర్మాణం, 30భవనాలకే స్థల సేకరణ 

*మిగిలిన వాటికి దొరకని స్థలం 

మనతెలంగాణ / ఆసిఫాబాద్ : రైతు వేదిక భవనాలకు  జిల్లాలో స్థలం కరువైంది. రైతుల సమావేశాలు, సభలు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రైతు వేదిక భవనాలను నిర్మించేందుకు ఏర్పాటు చేస్తుంది. గ్రామాల్లో ఏఇఓ అధికారులకు ఒక కార్యాలయం, సమావేశం మందిరం, మట్టి నమూనా ల్యాబ్‌లు నిర్మించాలని నిర్వహించారు. మండల కేంద్రంలో వ్యవసాయాధికారి కార్యాలయం, ఏఇఓ కార్యాలయం, జిల్లా కేంద్రంలో వ్యవసాయా కార్యాలయంతో పాటు రైతు వేదిక భవనాలు నిర్మించాల్సివుండగా ప్రభుత్వ భూములు దొరకక పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 70వ్యవసాయ విస్తర్ణ అధికారుల క్లస్టర్‌లు ఉన్నారు. రైతు వేదిక భవనం నిర్మించేందుకు ఇరువై గుంటల స్థలం అవసరం. అది భూమి లేక దాతలు విరాళం ఇచ్చి ఉండాలని ప్రభుత్వ నిబంధన ఉంది.  ఇప్పటి వరకు జిల్లాలో  30భవనాలు నిర్మించేందుకు అధికారులు స్థలాన్ని సేకరించారు. కాని ఈ స్థలం ఇంకా వ్యవసాయశాఖ అధీనంలోకి రాలేదు. ఇంకా మిగితా 40భవనాల నిర్మాణాలకు భూమి సేకరించాల్సివుంది. స్థలం దొరికిన చోట భవన నిర్మాణాలకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు.  ఒక్కొక్క భవన నిర్మాణానికి ఐదు లక్షల నుంచి పదిహేను లక్షలు ఖర్చు చేయనున్నారు. క్లస్టర్, మండల కేంద్రం, జిల్లా కేంద్రంలో నిర్మించే వాటికి నిర్మాణ వ్యయంలో తేడాలు ఉన్నాయి. కాగా రైతువేదిక భవన నిర్మాణాలకు రైతులు, భూస్వాములు భూమిని విరాళంగా ఇస్తే వారిపేరు  భవనానికి పెడుతామని జిల్లా అధికారులు తెలుపుతున్నారు. క్లస్టర్ల వారిగా ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రైతు వేదిక భవనాలను రైతులకు ఎంతో ఉపయోగపడనున్నాయి. భవనంలో అన్ని వసతులు ఉండేలా భవన నిర్మాణం చేపడుతారు. ఇందులో సమావేశ గది,  ఎరువులు, విత్తనాల నిల్వ గది, విస్తర్ణ అధికారి కార్యాలయం కోసం ఒక గది, మట్టి నమూనాల పరీక్ష కోసం మరో గది నిర్మిస్తారు. ప్రతి రోజు క్లస్టర్‌లో ఏఇఓ అందుబాటులో ఉండి రైతులకు పంటల సమాచారాన్ని అందిస్తారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు అధిక దిగుబడి సాధించేందుకు అవసరమైన సలహాలు అందిస్తారు. పంటలకు తెగుళ్ళు సోకిన, రైతులు ఏ భూమిలో ఏ పంటలు వేసుకోవాలో… పంటలకు పిచికారి  చేసే మందులు, ఎరువుల ,తదితరాలపై రైతులకు సలహాలు సూచనలు అందిస్తారు. రైతులకు అవసరమైన మందులు, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతారు. మట్టి నమూన పరీక్ష స్థానికంగానే చేయించుకునే వీలుంటుంది. రైతు వేదిక భవనాల్లో ఎప్పుటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించడానికి ఎంతోగానో ఉపయోగపడుతాయి. గ్రామాల్లో రైతు వేదిక భవనలు పూర్తి అయితే  రైతుల సమస్యలను రైతు సమన్వయ సమితిలతో సమావేశమైనా వారితో చర్చించి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎలాం టి సమావేశమై, సభలు నిర్వహించుకునేందుకు రైతు వేదిక భవనలు అడ్డాలుగా మా రనున్నాయి. కాని స్థల సేకరణ జాప్యంతో వీటి నిర్మాణం అలస్యం అవుతుంది. అధికారులు గ్రామాల్లో ప్రభుత్వ, భూదాతల పేర్లను తీసుకొని రైతుల భవనాల నిర్మాణానికి స్థలం కేటాయించి భవన నిర్మాణ పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.