రేపు తేలనున్న ‘డెక్కన్ క్రానికల్’ భవితవ్యం

cronicle

మన తెలంగాణ/ హైదరాబాద్ : డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్(డిసిహెచ్‌ఎల్) కార్యకలాపాల స్తంభనపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సిఎల్‌టి) తన తీర్పును జులై 17న వెలువరించనున్నది. డిసిహెచ్‌ఎల్ ఆధ్వర్యంలో ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్, ఆసియన్ ఏజ్, ఫైనాన్షియల్ క్రానికల్, తెలుగు దినపత్రిక ఆంధ్రభూమి నడుస్తున్నాయి. దీంతో ఈ పత్రిక మూతపడనుందో లేక పునరుద్ధరణ కోసం కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్తుందో 17న భవితవ్యం తేలనున్నది. ఈ సంస్థ గత రెండేళ్లుగా ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్ప్ట్రసీ కోడ్(ఐబిసి) కింద దివాళా దిశలో ఉంది. అంతకుముందు డిసి గ్రూప్ హైదరాబాద్‌లోని డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్ బెంచ్ ముందు సుదీర్ఘకాలం విచారణను ఎదుర్కొంది. డజన్ పబ్లిక్, ప్రైవేటు బ్యాంకులు, ఇతర ప్రైవేటు రుణదాతలు డిసిపై కేసులు దాఖలు చేశాయి. ఆర్ మురళి ఆధ్వర్యంలో ట్రిబ్యునల్ బెంచ్ వెలువరించే తీర్పు జాతీయ స్థాయిలో చెప్పుకోదగినదిగా ఉంటుంది. రెండేళ్ల క్రితమే కొత్త ఐబిసి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ తీర్పుకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. కంపెనీ ప్రమోటర్లు, క్రిమినల్ కేసులను ఎదుర్కోవలసి రావడమే కాకుండా సిబిఐ దర్యాప్తు కూడా జరుగుతుంది. ఎన్‌సిఎల్‌టి నియమించిన ఇన్‌సాల్వెన్సీ రిసొల్యూషన్ ప్రొఫెషనల్(ఐఆర్‌పి) మమతా బినాని డిసి గ్రూప్ పునరుద్ధరణకు సమగ్ర ప్రణాళికను రూపొందించారు. అయితే రుణదాతల నుంచి నిబంధనల ప్రకారం 66 శాతం మద్దతును పొందలేకపోయారు. రుణదాతలతో 35 మంది సభ్యులు కలిగిన కమిటీని బినానీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ముందు జులై 11, 12 తేదీల్లో పునరుద్ధరణ ప్రణాళికను ఉంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ నిర్వహించారు. కేవలం 55.08 శాతం మంది మాత్రమే మద్దతు ఇచ్చారు. పునరుద్ధరణ ప్రణాళిక విఫలం అయితే ఐబిసి ప్రకారం, తదుపరి చర్య దివాళా అయినట్టు ప్రకటించి కంపెనీ నుంచి బకాయిలు వసూలు చేయవలసి ఉంటుంది. కమిటీ ఆఫ్ క్రెడిటర్స్(సిఒసి) సమాచారం ప్రకారం, కోల్‌కతాకు చెందిన శ్రేయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కమిటీ రూ.850 కోట్లు పెట్టుబడి పెట్టడానికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. తర్వాత దాదాపు రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఆ సంస్థ సిద్ధమైంది. అయితే దాదాపు రూ.6500 కోట్లు అప్పుల ఊబిలో మునిగిన డిసిహెచ్‌ఎల్ పునరుద్ధరణకు ‘శ్రేయి’ సంస్థ పెట్టాలనుకున్న పెట్టుబడి దీనికి చాలదు. అయితే శ్రేయి యాజమాన్యం సంసిద్ధతలో ఐఆర్‌పి సంతృప్తి వెలిబుచ్చింది. ఈ సంస్థ పరిధిలో 77 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ‘శ్రేయి’ డిసిలో పెట్టుబడి వాటా పెడితే పాత యాజమాన్యం ప్రతినిధులు టి.వెంకట్రామ్ రెడ్డి, టి.వినాయక రవిలకు ప్రాతినిధ్యం వహించాల్సి వస్తుందని కొంతమంది బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు.
బకాయిల చెల్లింపులో విఫలం
పబ్లిక్ సెక్టార్ కెనరాబ్యాంక్ డిసికి భారీగా రూ. 330 కోట్ల వరకు రుణం ఇచ్చింది. అలాగే సిబిఐకి ఫిర్యాదు చేసిన మొదటి బ్యాంక్ కూడా ఇదే. డిసి అప్పులన్నీ తీర్చడానికి కావాల్సిన కనీస మొత్తం కూడా శ్రేయి ప్రణాళికలో లోటు కావడం శోచనీయం. ఐఆర్‌పి ప్లాన్ ప్రకారం, ప్రతిపాదించిన మొత్తం చాలా స్వల్పం కావడంతో తాము తిరస్కరించాయని కెనరా బ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్(డిసిహెచ్‌ఎల్) మిలియన్ సర్కులేషన్‌తో ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్‌ను నడుపుతోంది. గత మార్చి 19న ఫైనాన్షియల్ క్రానికల్ నిర్వహణ యాజమాన్యం టి.వెంకట్రామి రెడ్డి నుంచి మారడానికి రంగం సిద్ధం అయింది. అయితే 15 బ్యాంక్‌లతో పాటు రుణదాతలకు బకాయిలను చెల్లించడంతో రెడ్డి విఫలం అయ్యారు. చెల్లించవలసిన రుణ మొత్తం రూ.5200 కోట్ల వరకు పేరుకుపోయింది. అయితే తన తండ్రి టి.చంద్రశేఖర రెడ్డి నుంచి వారసత్వంగా పొందిన టి.వెంకట్రామిరెడ్డి కార్పొరేట్ హోదా జీవితానికి ముగింపు పలికినట్టయింది. ఐపిఎల్ ఫ్రాంచైజ్, డెక్కన్ చార్జర్స్ అండ్ ఏవియేషన్ వెంచర్ డెక్కన్ ఏవియేషన్ తదితర వ్యాపార సంస్థలను మూసివేసిన తర్వాత వెంకట్రామి రెడ్డి ఇప్పుడు మీడియా పరిశ్రమ నుంచి దూరం కాబోతున్నారు. కోల్‌కతాకు చెందిన శ్రేయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్(ఎస్‌ఐఎఫ్‌ఎల్) డిసిహెచ్‌ఎల్‌లో 24 శాతం వాటాలను పొందగలిగింది. కోల్‌కతాకు చెందిన ఆర్థిక నిపుణుడు, నెట్‌వర్క్ 18 మీడియా మాజీ చైర్మన్ మనోజ్ మొహంకా డిసి గ్రూప్ కొత్త చైర్మన్‌గా రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐఎఫ్‌ఎల్ కూడా ‘డిసి’ని పొందడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. తాజాగా నిధుల పెట్టుబడితో కొత్త యాజమాన్యంలో శ్రేయి తప్పనిసరిగా డిసి గ్రూప్‌లను పునరుద్ధరిస్తుందని ఆ సంస్థ వైస్ చైర్మన్ సునీల్ కనోరియా స్పష్టం చేశారు. అయితే ‘ఎస్‌ఐఎఫ్‌ఎల్’ ప్రస్తుత యాజమాన్యాన్నే వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో కొనసాగించాలని అనుకున్నా, గతంలో సిబిఐ కేసులో వెంకట్రామిరెడ్డి అరెస్టు కావడంతో ఆ ఆలోచనను విరమించుకుంది. వెంకట్రామిరెడ్డి, ఆయన సోదరుడు, గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వినాయక రవిరెడ్డి 2015 ఫిబ్రవరి 8న బ్యాంకు మోసం కేసులో అరెస్టు అయ్యారు. 200 కోట్ల రూపాయల మేరకు అప్పుల బకాయిలు చెల్లిస్తామని వారు చెప్పినా ఆ మేరకు జరగలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న వెలువడనున్న తీర్పుతో ఆ సంస్థ భవితవ్యం తేలనుంది.