రెండో దశ బ్యాంకుల విలీనం

బ్యాంకులను గుర్తించాలని ఆర్‌బిఐని ఆదేశించిన ప్రభుత్వం న్యూఢిల్లీ: మరోసారి బ్యాంకుల విలీనానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. 21 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మరోసారి విలీనానికి అనువైన బ్యాంకులను గుర్తించాలని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్)ను ప్రభుత్వం ఆదేశించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మొండి బకాయిలు పేరుకుపోవడంతో సతమతమవుతున్న బ్యాంకులను గాడిన పెట్టే ప్రయత్నంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేసేందుకు బ్యాంకుల విలీనం సరైందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి గాను అనుకూలమైన బ్యాంకుల జాబితా తయారు […]

బ్యాంకులను గుర్తించాలని ఆర్‌బిఐని ఆదేశించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ: మరోసారి బ్యాంకుల విలీనానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. 21 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మరోసారి విలీనానికి అనువైన బ్యాంకులను గుర్తించాలని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్)ను ప్రభుత్వం ఆదేశించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మొండి బకాయిలు పేరుకుపోవడంతో సతమతమవుతున్న బ్యాంకులను గాడిన పెట్టే ప్రయత్నంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేసేందుకు బ్యాంకుల విలీనం సరైందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి గాను అనుకూలమైన బ్యాంకుల జాబితా తయారు చేయమని ఆర్‌బిఐని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి త్వ శాఖ ఇటీవల ఆర్‌బిఐకి లేఖ రాసినట్లు చెప్పారు. విలీనం చేయాల్సిన బ్యాంకుల జాబితా తయారీతో పాటు అందుకు తగిన కాలపరిమితిని కూడా నిర్ధారించాలని కూడా కేంద్రం కోరినట్టు తెలుస్తోంది.

విలీనంతో సమర్ధవంతమైన కొన్ని బ్యాంకులు కొనసాగుతాయని, సరైన నిర్వహణ లేనివాటిని సరిచేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అనేక సంవత్సరాలుగా దేశీయ ప్రభుత్వరంగ బ్యాంక్‌లు ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు) లేదా మొండి బకాయిల సమస్యతో సతమతమవుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినా ఫలితం అంతంతమాత్రంగానే ఉంటోంది. ఇటలీ తర్వాత మొండి బకాయిలు అధికంగా ఉన్న తొలి పది దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉండడం గమనార్హం. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. 21 పిఎస్‌బిల్లో సగానికి పైగా దాదాపు 11 బ్యాంకులు ఎన్‌పిఎ సమస్యతో సతమతమవుతున్నాయి. ప్రైవేట్ బ్యాంకులతో పోటీ పడి రాణించాలంటే ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌లో కన్సాలిడేషన్ అవసరమని ఇటీవల బిఒబి చైర్మన్ రవి వెంకటేశన్ అభిప్రాయపడ్డారు. గతేడాది కొత్త డిపాజిట్లలో 70 శాతం ప్రైవేట్ బ్యాంకులు సొంతం చేసుకున్నాయి.ఇంక్రిమెంటల్ లోన్స్‌లో80 శాతం ప్రైవేట్‌బ్యాంకుల నియంత్రణలో ఉంది. ఒకపక్క మొండిపద్దుల సమస్య, మరోపక్క వృద్ధి క్షీణతతో పిఎ స్ యు బ్యాంకులు నష్టాల బారిన పడ్డాయి. అందువల్ల విలీనంతో సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

బ్యాంకులపై కఠినంగా ప్రభుత్వం
బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు రూ.8.9 లక్షల కోట్లకు చేరాయి. 2017 డిసెంబర్ ముగింపు నాటితో పోలిస్తే మొత్తం విలువ 10.11 శాతం పెరిగింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్థూల ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు) రూ.7.7 లక్షల కోట్లకు చేరాయి. అయితే రూ.50 కోట్లు దాటిన మొండి బకాయిలు లేదా ఎన్‌పిఎల్లో మోసాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వరంగ బ్యాంకుల సిఇఒ(చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)లను ఇటీవల ప్రభుత్వం హెచ్చరించింది. లేకపోతే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ బ్యాంకులకు తెలిపింది. నిధులను మళ్లించారనే ఆరోపణల మేరకు భూషణ్ స్టీల్‌కు చెందిన ప్రమోటర్ నీరజ్ సింగాల్‌ను ఎస్‌ఎఫ్‌ఐఒ(సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్) అరెస్టు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం.

ఎన్‌పిఎ ఖాతాల్లో మోసాల గురించి తెలియజేయకపోతే, లేదా విచారణ సంస్థలు తర్వాత మోసాలను గురిస్తే సెక్షన్ 120బి కింద బ్యాంకర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. దివాలా చట్టం కింద అనేక కంపెనీలు బ్యాంకుల పరిశీలనలో ఉన్నాయి. నిధుల మళ్లింపు సహా మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడిన సంస్థలపై పరిశోధన సంస్థ విచారణ జరుపుతున్నాయి. బ్యాంకుల్లో మోసాల సంఖ్య పెరగడం కూడా తీవ్రం ఆందోళన కలిగిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, ఆయన సన్నిహితులు రూ.14 వేల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిన తర్వాత అనేక స్కామ్‌లు వెలుగులోకి వచ్చాయి. కొన్ని స్టీలు తయారీ, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో లొసుగులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. గత ఐదేళ్ల లావాదేవీల వివరాలను తెలియజేయాలని బ్యాంకు లు కోరాయి, అవసరమైతే బ్యాంకులు కూడా ఫోరెన్సిక్ ఆడిట్ కిందకు వస్తాయని అధికార వర్గాలు తెలిపాయి.

ఎగవేతదారులపై ఏం చర్యలు చేపట్టారు?

ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆర్‌బిఐ, ఎంఎస్‌పిని కోరిన సిఐసి

న్యూఢిల్లీ : రూ.50 కోట్లు దాటిన బ్యాంకు రుణాల ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై తీసుకున్న చర్యలేమిటో బహిర్గతం చేయాలని ఆర్థిక మంత్రిత్వశాఖ, గణాంకాల మంత్రిత్వ శాఖ, ఆర్‌బిఐలను కేంద్ర సమాచారం కమిషన్(సిఐసి) కోరింది. చిన్న రుణాలు తీసుకున్న రైతులను ఎగవేతదారులుగా పేర్కొని బహిరంగంగా విమర్శిస్తున్నారని, ఇదే విధంగా రూ.50 కోట్లకు పైగా రుణాలు తీసుకున్న ఎగవేతదారుల సమాచారం, వారిపై చర్యల వివరాలను వెల్లడించాలని సమాచార కమిషనర్ శ్రీదర్ ఆచార్యులు అన్నా రు. వన్ టైమ్ సెటిల్‌మెంట్‌లో అత్యధిక రాయితీ, వడ్డీ రద్దు, వంటి వెసులుబాటును రూ.50 కోట్లు దాటిన రుణగ్రస్తులకు ఇస్తున్నారని, ప్రతిష్ట పేరిట వారి పేర్లను రహస్యంగా ఉంచుతున్నారని ఆయన అన్నారు. 1998 నుంచి 2018 మధ్య 30 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారు తమ రుణాలను చెల్లించలేక జీవిత చాలించారని అన్నారు.

Related Stories: