రూ.20 వేల అప్పుకు భార్య పిల్లల నిర్బంధం..!

Payment of debt is a merchant who takes the wife, children
మంచిర్యాల : అనారోగ్య కారణంగా రూ.20 వేలు అప్పు తీసుకొని సకాలంలో చెల్లించకపోవడంతో అప్పు కింద భార్య, పిల్లలను నిర్భంధించడమే కాకుండా సదరు వ్యాపారి అప్పు చెల్లించి భార్య పిల్లలను విడిపించుకెళ్లమని బెదిరింపులకు గురి చేస్తున్న సంఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఆవడంలో జరిగింది. కాగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఈ విషయం వెలుగు చూసింది. అప్పు చేసిన పాపానికి అన్యాయానికి గురైన బాధితుడు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోలేదు. ఫలితంగా ప్రజావాణి కార్యక్రమంలో న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించిన హృదయవిదారకరమైన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన బాసవేన హన్మంతు ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా అతనికి తీవ్రమైన అనారోగ్యం కారణంగా దవాఖాన ఖర్చుల కోసం చిత్తాపూర్ గ్రామానికి చెందిన రైస్ మిల్ వ్యాపారి ఎంఎ సందాని వద్ద రూ. 20 వేలు అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించకపోవడంతో అప్పు కింద నీ భార్య పిల్లలను కుదువ పెట్టుమని పలు సార్లు బెదిరింపులకు గురి చేశారు. దీంతో తాను రెండు నెలల క్రితం ఆవడం గ్రామం నుంచి మందమర్రి మకాం మార్చి భార్య పిల్లలను ఒక ఇల్లు అద్దెకు తీసుకొని బతుకుదెరువు కోసం తాను ఆవడం గ్రామంలో ట్రాక్టర్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నానని పేర్కొన్నారు. సదరు వ్యాపారి సందాని పలు సార్లు మందమర్రిలోని తన ఇంటికి వచ్చి అప్పు చెల్లించాలని బెదిరించగా రెండు నెలల్లో చెల్లిస్తానని చెప్పడంతో తాను లేని సమయంలో తన భార్య, ఇద్దరు పిల్లలను బలవంతంగా తీసుకెళ్లి అప్పు కింద నిర్భంధించినట్లు పేర్కొన్నారు. విషయం తెలుసుకొని వ్యాపారి సందాని వద్దకు వెళ్లగా అప్పు చెల్లించి నీ భార్య పిల్లలను తీసుకెళ్లమని చెప్పడంతో గత్యంతరం లేక కలెక్టర్‌ను ఆశ్రయించినట్టు బాధితుడు హన్మంతు బోరున విలపిస్తూ విలేకరులకు గోడు వెలిబుచ్చారు. ఈ విషయమై నెన్నెల పోలీసులను ఆశ్రయించగా భార్య పిల్లలను అప్పు కింద నిర్భంధించడం సివిల్ కేసు పరిధిలోకి వస్తుందని, దీనికి కోర్టు అనుమతి కావాలని సూచించినట్టు పేర్కొన్నారు. వ్యాపారిని ఎలా ఎదిరించాలో తెలియని పరిస్థితుల్లో అతని నిర్భంధంలో ఉన్న భార్య పిల్లలను విడిపించాలని, తమ కుటుంబాన్ని బజారు పాలు చేసిన వ్యాపారి సందాని పై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు.

Comments

comments