రూపాయి @72.73

The minimum level of rupee exchange value with dollar

చారిత్రక కనిష్టానికి దేశీయ కరెన్సీ విలువ

న్యూఢిల్లీ : డాలర్‌ తో రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోయింది. మంగళవారం రూపాయి విలువ 29 పైసలు నష్టపోయి 72.74 వద్ద కొత్త కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో సోమవారం ముగింపుతో పోలిస్తే 28 పైసలు(0.3 శాతం) బలహీనపడింది. ఇది సరికొత్త కనిష్టం స్థాయి.. అయితే రూపాయి పతనాన్ని నియంత్రించేందుకు ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) జోక్యం చేసుకోవచ్చని నిపుణులు అంచనా వేసినప్పటికీ అదేమీ జరగలేదు. అంతకుముందు రోజు సోమవారం కూడా రూపాయి 72 పైసలు పడిపోయి 72.45 వద్ద ముగియడం ద్వారా చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. గత వారాంతాన రూపాయి 16 పైసలు బలపడి 71.73 వద్ద ముగిసింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ రూపాయి మారకపు విలువ 14 శాతం నష్టపోయింది. గత నెల రోజుల్లో 6 శాతం కోల్పోగా, గత 9 రోజుల్లోనే 4 శాతం క్షీణించడం గమనార్హం. రూపాయి మారకపు విలువ 70 నుంచి 72కు 21 సెషన్లలోనే బలహీనపడింది. ఆగస్ట్ 13న తొలిసారిగా 70 మార్క్‌ను తాకిన రూపాయి ప్రస్తుతం 73 సమీపానికి చేరువైంది. కాగా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు మరింతగా బలపడింది. మరోవైపు వర్థమాన దేశాల కరెన్సీలు పతనబాటలో సాగుతున్నాయి. మార్చి నుంచి వివిధ దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలరు 8 శాతం పెరిగింది. ఓవైపు అర్జెంటీనా, టర్కీల ఆర్థిక సంక్షోభాలు, మరోవైపు కరెన్సీ రుపయ్యా పతనాన్ని అడ్డుకునేందుకు ఇండొనేసియా కేంద్ర బ్యాంకు పలుమార్లు చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో డాలరుతో మారకంలో పలు వర్థమాన దేశాల కరెన్సీలు పతనమవుతూ వస్తున్నాయి. ముడిచమురు ధరలు పెరగడం కూడా రూపాయి మారకపు విలువపై ఒత్తిడిని పెంచుతోంది. దేశీ అవసరాలకు 75 శాతం చమురును దిగుమతి చేసుకోవలసి ఉండటంతో దిగుమతుల బిల్లు పెరగనుంది. జులైలో వాణిజ్య లోటు నాలుగేళ్ల గరిష్టానికి చేరిందని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ క్రమంగా వడ్డీ రేట్ల పెంపును చేపట్టనున్నట్లు సంకేతాలిచ్చింది. డాలర్ బలపడడానికి ఇది ఒక కారణమైంది.

Comments

comments