రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి దన్నుతో లాభాల్లోకి..

Reliance and HDFC Bank gain profit

ముంబై: కొద్ది రోజులు నష్టపోతున్న దేశీయ మార్కెట్లు మళ్లీ కోలుకున్నాయి. సానుకూల సంకేతాలతో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు పరుగులు తీశాయి. దీంతో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 11,500పైన ముగిసింది. అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో ఉద యం నుంచే సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే తొలుత ఒడుదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ సూచీలు పుంజుకుని ముందుకు సాగాయి. హెవీ వెయిట్ కల్గిన రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి లాంటి దిగ్గజ షేర్ల కొనుగోళ్ల జోరుతో సూచీ లు లాభాల బాటపట్టాయి. ఫార్మా, విద్యుత్, మౌలిక రంగాల షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి. ఆఖరికి సెన్సెక్స్ 224 పాయింట్లు లాభపడి 38,243 వద్ద ముగిసింది.ఇక నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 11,537 వద్ద స్థిరపడింది. ఫార్మా రంగం దాదాపు 3 శాతం పెరగ్గా, మీడియా 1.6 శాతం తిరోగమించింది. రియల్టీ 0.5 శాతం బలపడింది. ప్రధానంగా రిలయన్స్, సిప్లా, కోల్ ఇండియా, ఎన్‌టిపిసి, సన్‌ఫార్మా షేర్లు లాభపడ్డాయి. జి ఎంటర్‌టైన్‌మెంట్స్, హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకీ, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు నష్టపోయాయి. మరోవైపు బిఎస్‌ఇలో మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.3 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1567 లాభపడగా, 1136 డీలాపడ్డాయి. బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ. 384 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ. 177 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.