రాహుల్ రావొద్దు

One voice of single student unions

వస్తే తరిమికొడతాం
ఒయు విద్యార్థి సంఘాల ఒక్క కంఠం
రాహుల్‌ను అడ్డుకోవాలని తీర్మానించిన 20 సంఘాల ప్రతినిధుల సమావేశం 

మన తెలంగాణ/ హైదరాబాద్ : మలిదశ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటుపై సకాలంలో నిర్ణయం తీసుకోకుండా నాన్చివేత ధోరణి అవలంబించినందుకు వేలాది మంది విద్యార్థులు ప్రాణత్యా గం చేశారని, అందుకు బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పలు విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఉస్మాని యా విశ్వవిద్యాలయానికి విచ్చేసే రాహుల్‌గాంధీని అడ్డుకుంటామ ని హెచ్చరించాయి. అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పకుండా ఉస్మానియా యూనివర్శిటీ (ఒయు)లో అడుగుపెడితే అడ్డుకుంటామని విద్యార్థి జెఎసి చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, గిరిజన సంఘం నేత శంకర్ నాయక్, టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఒయులోఆర్ట్ కళాశాల వద్ద 20 విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆదివారం సమావేశమై యూనివర్శిటీకి రాహుల్‌గాంధీ రాకపై లోతుగా చర్చించారు.

ఒయుకు రాహుల్ రాకుండా అడ్డుకోవాలని సమావేశం తీర్మానించింది. తెలంగాణకు రాహుల్‌గాంధీ నాయనమ్మ (ఇందిరాగాంధీ) మోసం చేస్తే, అమ్మ (సోనియాగాంధీ) ఆలస్యం చేసిందని మండిపడింది. రాహుల్‌గాంధీ హఠావో.. తెలంగాణ బచావో, కాం గ్రెస్ హఠావో.. తెలంగాణ బచావో నినాదంతో రాహుల్‌గాంధీని అడ్డుకోవాలని నిర్ణయించింది. ఒయుకు రావాలనుకుంటే ముందుగా అమరుల స్థూపం దగ్గర రాహుల్ గాంధీ ముక్కు నేలకు రాయాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. సమావేశనంతరం మీడియా సమావేశంలో దూదిమెట్ల బాలరాజ్  యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డంపడేలా న్యాయస్థానాల్లో కేసులు వేయించేందుకు, బంగారు తెలంగాణ నిర్మాణాన్ని అడ్డుపడుతూ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేలా ఒయు విద్యార్థులను పావుగా వాడుకుంటోందని, వారిని పిటిషన్లు వేసేలా సమాయత్తం చేసేందుకే రాహుల్‌గాంధీ ఇక్కడకు వస్తున్నారని వీరు ఆరోపించారు. అలాంటి రాహుల్‌గాంధీని తరుముతామని హెచ్చరించారు.

అమరవీరుల కుటుంబాలను నాలుగు సంవత్సరాల్లో ఏ రోజూ పరామర్శించ ని రాహుల్‌గాంధీ విద్యార్థులను రెచ్చగొట్టేందుకే వస్తున్నారని ఆరోపించారు. శంకర్‌నాయక్ మాట్లాడుతూ గిరిజనుల రిజర్వేషన్లపై రాహుల్‌గాంధీ తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ చేపడుతున్న అభివృద్ధిని, వివిధ కార్యక్రమాలను అడ్డుకునేందుకే రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనకు వస్తు న్నారని విమర్శించారు. ఆయన పర్యటనను అన్ని విద్యార్థి సంఘాలు అడ్డుకుంటారన్నారు. ఈ సమావేశంలో ఒయు జెఎసి నాయకులు ఎ. జితేందర్, టిఆర్‌ఎస్‌వి ఒయు అధ్యక్షులు పెర్కశ్యామ్, జాల రామకృష్ణయాదవ్, మైనార్టీ నాయకులు సలీంపాషా, కరుణాకర్‌రెడ్డి, హరిబాబు, రాజ్‌కుమార్, సైదాషేక్, యాదగిరిరావు, విజయ్‌రెడ్డి, సుధీర్, శ్రీకాంత్‌గౌడ్, జంగయ్య, మాదిగ జెఎసి నాయకులు వడ్డె ఎల్లన్న,         తదితరులు పాల్గొన్నారు.