రాహుల్ గాంధి తీర్థయాత్ర

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి శుక్రవారం నాడు హిందువులకు అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఒకటైన మాన్‌సరోవర్ యాత్రకు బయలుదేరారు. ఇంతకూ ఇది ఆధ్యాత్మిక యాత్రనా లేక రాజకీయ యాత్రనా అంటే రెండూ కలసిన తీర్థయాత్ర అని చెప్పుకోవచ్చు. బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ హిందూత్వకు వ్యతిరేకంగా ఆయన సాఫ్ట్ హిందూత్వ మార్గం అనుసరిస్తున్నాడన్న విమర్శలు ఇంతకు ముందే ఉన్నాయి. గుజరాత్, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార కాలంలో రాహుల్ గాంధి అనేక హిందూ ఆలయాలు దర్శించారు. అప్పుడు వాటిని బిజెపి […]

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి శుక్రవారం నాడు హిందువులకు అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఒకటైన మాన్‌సరోవర్ యాత్రకు బయలుదేరారు. ఇంతకూ ఇది ఆధ్యాత్మిక యాత్రనా లేక రాజకీయ యాత్రనా అంటే రెండూ కలసిన తీర్థయాత్ర అని చెప్పుకోవచ్చు. బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ హిందూత్వకు వ్యతిరేకంగా ఆయన సాఫ్ట్ హిందూత్వ మార్గం అనుసరిస్తున్నాడన్న విమర్శలు ఇంతకు ముందే ఉన్నాయి. గుజరాత్, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార కాలంలో రాహుల్ గాంధి అనేక హిందూ ఆలయాలు దర్శించారు. అప్పుడు వాటిని బిజెపి విమర్శించింది. తాను శివభక్తుడినని, ఇందిరా గాంధి సైతం మహాశివుణ్ణి ఆరాధించేవారని ఆయన అప్పుడు చెప్పారు.

కాంగ్రెస్ ముస్లింలను బుజ్జగిస్తున్న పార్టీ అని దీర్ఘకాలంగా నిందా ప్రచారం చేస్తున్న బిజెపి, ఇటీవల ముస్లిం మేధావులతో రాహుల్ గాంధి సమావేశం తదుపరి ఒక పత్రిక కథనాన్ని చేతబుచ్చుకుని ‘కాంగ్రెస్ ముస్లింల పార్టీ’ అని ఆయన చెప్పినట్లు కొన్ని రోజులపాటు నానాయాగీ చేసింది. నాలుగున్నరేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి తమ ప్రభుత్వ సత్కార్యాల ద్వారా ప్రజలను మెప్పించే తిరిగి అధికారం కోరే బదులు మత విభజన మీద ఆధారపడుతుందనటానికి ఇదొక మచ్చుతునక. రాహుల్ గాంధి ఆలయాలు దర్శించటం, ఇప్పుడు మాన్ సరోవర్ యాత్ర చేబట్టటం ఆయన వ్యక్తిగత విషయం. తాను ఎంచుకున్న మతాన్ని ఆచరించేందుకు రాజ్యాంగం పౌరులకు స్వేచ్ఛ ఇచ్చింది. బిజెపికి దుగ్ధ ఎందుకు? వ్యక్తిగతమైన మతాన్ని బిజెపి రాజకీయాలతో కలగాపులగం చేయటం వల్లనే ఈ పరిస్థితి ఉత్పన్నమైందనవచ్చు.

కర్నాటకలో ఎన్నికల ప్రచారానికి వెళుతున్నపుడు తాను ప్రయాణిస్తున్న విమానం కూలిపోయే ప్రమాదం తప్పిన తదుపరి ఏప్రిల్ 29న ఢిల్లీలో కాంగ్రెస్ ‘ఆక్రోశ్ ర్యాలీ’లో రాహుల్ గాంధి మాన్‌సరోవర్ దర్శనానికి వెళ్లాలన్న అభీష్టం వెల్లడించారు. “కొద్ది రోజుల క్రితం మేము విమానంలో కర్నాటక వెళుతుండగా అది ఆకస్మికంగా 8 వేల అడుగులు కిందకు వచ్చింది. అంతా అయిపోయిందనుకున్నాను. కైలాస్ మాన్‌సరోవర్‌కు వెళ్లాలని ఆ క్షణంలో నా మనస్సు చెప్పింది” అని ఆ సభలో ఆయన ప్రకటించారు. మహాశివుని ఆవాసంగా హిందువులు విశ్వసించే కైలాస శిఖరం చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్‌లో ఉంది. ఏటా ఎందరో భక్తులు దర్శించుకుంటూ ఉంటారు.

తీర్థయాత్ర నిమిత్తం తమ దేశం వెళుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడికి ఢిల్లీలోని చైనా రాయబారి మర్యాదపూర్వకంగా వీడ్కోలు పలికారు. బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా దీన్ని కూడా తప్పుపడుతూ, రాహుల్ గాంధి చైనా తరఫున మాట్లాడుతున్నాడని ఆక్రోశించారు. ఉపాధి కల్పనలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తూ, పొరుగు దేశమైన చైనా రోజుకు 50 వేల ఉద్యోగాలు కల్పిస్తున్నదని లోగడ రాహుల్ గాంధి చేసిన విమర్శను ప్రస్తావిస్తూ, ఆయనను “చైనీస్ గాంధి” అని ఎద్దేవా చేశారు. చైనా అద్దెకు తీసుకున్నట్లు మాట్లాడుతున్నాడని పాత్రా నిందించారు. చైనాలో ఉండగా ఏఏ చైనా నాయకులను రాహుల్ కలుసుకోబోతున్నారో చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు. దేవదేవుని క్షేత్రానికి తీర్థయాత్రకు అవరోధాలు కల్పించేవారిని శివుడు క్షమించడని, ఈ పాపానికి పాల్పడేవారు ఆయన ఆగ్రహారనికి గురవుతారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జీవాలా శాపనార్థాలు పెట్టారు.

చైనా అధ్యక్షుడు క్సీ జిన్‌పింగ్‌తో సన్నిహిత సంబంధం, జనాంతిక చర్చల ద్వారా ఆ దేశంతో స్నేహ సంబంధాలు, వాణిజ్యం అభివృద్ధికి ప్రధాన నరేంద్ర మోడీ కృషి చేస్తుండగా, సంబిత్ పాత్రో లాంటి బిజెపి నాయకులు చైనా వ్యతిరేక కళ్లద్దాలతో చూడటం మానుకోలేదని చెప్పాల్సి ఉంటుంది. మతతత్వం, పాకిస్థాన్, చైనా వ్యతిరేకత ప్రాతిపదికగా జాతీయతావాదం ఎల్లవేళలా ఓట్లకు పాచికలుగా ఉపయోగపడవు. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను గ్రహించటం అధికార పార్టీకి ఎంతైనా అవసరం.
హిందూ సమాజాన్ని గుత్తకు తీసుకున్నట్లు బిజెపి వ్యవహరిస్తోంది. గత ఎన్నికల్లో లభించింది 31 శాతం ఓట్లేనని మరిచిపోతోంది. రాహుల్ గాంధి సాఫ్ట్ హిందూత్వ దానికి గండికొడుతుందన్న భయంతోనే ఆయన తీర్థయాత్రపై దాడి చేస్తోంది. రాహుల్ గాంధి సైతం తన హిందూ మూలలను, ఆరాధనభావాన్ని బహిరంగంగా వ్యక్తీకరించటం ద్వారా హిందువుల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాయకులు తమ వ్యక్తిగత ఆధ్యాత్మికతను తమకే పరిమితం చేసుకోవటం లౌకిక వ్యవస్థను పరిరక్షిస్తుంది.