రాముడు ప్రతిష్టించిన బుగ్గ రామలింగేశ్వరుడు

వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలపై వెలసిన శ్రీ అనంతపద్మనాభస్వామి ఆలయంతో పాటు శ్రీరాముడు ప్రతిష్టించిన బుగ్గ రామలింగేశ్వరాలయం ప్రసిద్ధి చెందింది. ఈఆలయానికి త్రేతాయుగం నాటి చరిత్ర, ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది. శ్రీ రాముడు రావణ సంహారం చేసిన తర్వాత భారతదేశంలోని పలుచోట్ల లింగప్రతిష్టాపన కార్యక్రమాలను చేపట్టాడని, అలాంటి క్షేత్రాలలో బుగ్గరామ లింగేశ్వరాలయం ఒకటిగా చరిత్ర చెబుతోంది. భక్తుల కొంగు బంగారంగా, మొక్కులు తీర్చుకునే క్షేత్రంగా విరాజిల్లుతున్న అపురూపక్షేత్రం ఈ ఆలయం. ఇక్కడి శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు నిత్యం […]

వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలపై వెలసిన శ్రీ అనంతపద్మనాభస్వామి ఆలయంతో పాటు శ్రీరాముడు ప్రతిష్టించిన బుగ్గ రామలింగేశ్వరాలయం ప్రసిద్ధి చెందింది. ఈఆలయానికి త్రేతాయుగం నాటి చరిత్ర, ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది. శ్రీ రాముడు రావణ సంహారం చేసిన తర్వాత భారతదేశంలోని పలుచోట్ల లింగప్రతిష్టాపన కార్యక్రమాలను చేపట్టాడని, అలాంటి క్షేత్రాలలో బుగ్గరామ లింగేశ్వరాలయం ఒకటిగా చరిత్ర చెబుతోంది. భక్తుల కొంగు బంగారంగా, మొక్కులు తీర్చుకునే క్షేత్రంగా విరాజిల్లుతున్న అపురూపక్షేత్రం ఈ ఆలయం. ఇక్కడి శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు.

హైదరాబాద్ నగరానికి శ్రీ బుగ్గరామలింగేశ్వర ఆలయం 78 కి.మీ దూరంలో అనంతగిరి కొండ లు ఉంటాయి. వికారాబాద్ జిల్లా కేంద్రం నుంచి 6 కి.మీ ప్రయాణిస్తే బుగ్గ రామలింగేశ్వరాలయం వస్తుంది. ఆహ్లాద వాతావరణంలో సుందరమైన అనంతగిరి కొండల అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించి శ్రీ బుగ్గ రామలింగేశ్వరాలయాన్ని చేరుకోవచ్చు.
పేరు ఎలా వచ్చిందంటే…
రావణ సంహారం తర్వాత శ్రీ రాముడు లింగ ప్రతిష్టాపనలు చేపట్టి శివుని అనుగ్రహం పొందే క్రమంలో భాగంగా త్రేతాయుగంలో శివలింగాన్ని శ్రీరాముడే స్వయంగా ప్రతిష్టించాడని పూర్వీకుల చెబుతున్నారు. రావణుడు బ్రాహ్మణుడు కావడంతో బ్రాహ్మణహత్య నుంచి విముక్తిని పొందుటకు దేశంలో శివలింగాల ప్రతిష్టాపన చేపట్టాడని, శివలింగాలను ప్రతిష్టించి శివుని అనుగ్రహం పొందాడని, శివుని అనుగ్రహంతో బ్రహ్మహత్యా దోష నివారణను పొందాడని చరిత్ర చెబుతోంది. శ్రీ రాముడు బుగ్గ రామలింగేశ్వర ఆలయం వద్ద స్వయంగా బాణాన్ని భూమిపై సంధించి గంగను పైకి రప్పించి శివలింగానికి ఆ నీటితో అభిషేకం చేసి పూజలు చేశాడని పూర్వీకులు చెబుతున్నారు. అందుకే ఈ పుణ్య తీర్థానికి బుగ్గ రామలింగేశ్వరాలయం అని పేరు వచ్చిందని స్థానికులు తెలిపారు.
విశిష్టత ఏమిటంటే..
శ్రీ రాముడు చేపట్టిన శివలింగం ప్రతిష్టాపన సమయంలో గంగాజలం భూమి నుంచి బుడగల రూపంలో పెల్లుబికి వచ్చిందని, ఇప్పటికీ ఆ నీరు నిరంతరంగా వస్తోందని, కోనేరులో నంది విగ్రహం నోటి గుండా నిరంతరంగా ప్రవాహం తగ్గకుండా నీరు వస్తోంది. ఇక్కడి నుంచే ముచుకుందా నది మూసి నదిగా ప్రవహిస్తూ నాడు జంట నగరాల దాహార్తిని తీర్చిందని చెబుతున్నారు.

స్థల పురాణం

శ్రీ రాముడు దట్టమైన అరణ్యానికి చేరుకుని లింగాన్ని ప్రతిష్టించినప్పుడు పవిత్ర గంగాజలంతో పాటు వివిధ రకాల ఔషద మొక్కలు కలిశాయని, ఇప్పటికి ఆ నీరు దివౌషధమని భావించి వికారాబాద్ నగర వాసులు తాగడానికి ఆ నీటిని తీసుకుని వెళ్తారు. అంతేగాకుండా బుగ్గ రామలింగేశ్వరిని దర్శనానికి వచ్చిన భక్తులు సైతం నందీశ్వరుని నోటిగుండా నిరంతరంగా వస్తున్న ఆ నీటిని తాగుటకు ఉపయోగించడమే గాకుండా ఆ నీటిని తమ తమ ఇండ్ల వద్దకు తీసుకెళ్లి ఇంటిని శుద్ధి పరుచుకుంటారు.
*ఉత్సవాలను ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారంటే..
శ్రీ బుగ్గ రామలింగేశ్వరాలయం వద్ద ఏటా శ్రావణ, కార్తీక మాసాలలో ఉత్సవాలు బ్రహ్మండంగా జరుగుతాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అయితే ఈ ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తెలిపారు. నిత్యం సుప్రభాతసేవ, అర్చన, అభిషేకం, అలంకరణ, హారతి వంటి వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రకృతి అందాలు, పచ్చదనం, ఆహ్లాదకరమైన అందాలు, ఎత్తైన అనంతగిరి కొండలు పర్యాటక కేంద్రంగా ఆకర్షిస్తున్నాయి. సెలవు దినాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. శ్రీ బుగ్గరామలింగేశ్వరాలయం అతి ప్రాచీన తెలంగాణ శైవ క్షేత్రాలలో ఒకటిగా పేరుగాంచింది.

చంద్రశేఖర్,
వికారాబాద్ మన తెలంగాణ ప్రతినిధి