రాఫెల్ ఒప్పందంపై సుప్రీంకోర్టులో పిటిషన్

Petition in the Supreme Court on Raphael Agreement

ఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కొంతకాలంగా ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోన్న విషయం విదితమే. ఈ ఒప్పందాన్ని మహా దోపిడీగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అభివర్ణిస్తూ కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఒప్పందంపై బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై కోర్టు వచ్చే వారం విచారణ చేపట్టనుంది. భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయని, ఈ ఒప్పందంపై స్టే విధించాలని కోరుతూ లాయర్ ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టులో ఈరోజు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణకు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అంగీకరించింది. వచ్చే వారం దీనిపై విచారణ చేస్తామని ధర్మాసనం పేర్కొంది. రాఫెల్ ఒప్పందం ఓ వ్యక్తికి లబ్ధి చేకూర్చేవిధంగా జరిగిందని రాహుల్‌గాంధీ ఆరోపిస్తున్నారు. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేస్తున్న విషయమూ విదితమే. ఈ ఒప్పందంలో ఎటువంటి అక్రమాలు జరగలేదని, కావాలనే కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని బిజెపి వాదిస్తోంది.

Petition in the Supreme Court on Raphael Agreement