రాగితో ఎన్నో లాభాలు

Many benefits with copper
ఒక్కసారి తాతముత్తాతల కాలంలోకి రీవైండ్ అయితే.. రాగి బిందెలు, ఇత్తడి గిన్నెలు, కంచు సామగ్రి చూడొచ్చు. వీటన్నింటిలోనూ రాగి ఉంటుంది. రాగికి ఇంత ప్రాధాన్యం ఎందుకు? మన జీవితంలో ఒక భాగమై పోవడంలో ఈ లోహానికున్న లక్షణాలేంటి? అని ఆధునిక పరిశోధకులు తరచి చూస్తే, బోలెడన్ని మంచి విషయాలు బయటపడ్డాయి.

ఇంట్లో పూజా పునస్కారాలకు మనం రాగి లేదా వెండి పాత్రలు వాడుతూంటాం. ఈ లోహాలకున్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలే ఆ లోహాలను పూజార్హం చేశాయి. అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అయితే రాగిని శరీరానికి అవసరమైన ‘ట్రేస్ ఎలిమెంట్’గా గుర్తించడమే కాక, అది లోపిస్తే ఏమవుతుందో పరిశోధనలకు గుర్తింపునిచ్చింది. రాగి వాడకంతో ఆధునిక కాలంలో వచ్చే చాలా జబ్బులను అరికట్టేవారు. ఆధునిక కాలంలోనూ ఈ లోహాన్ని పలు యాంటీ బ్యాక్టీరియల్ ఆయింట్‌మెంట్లలో వాడుతున్నారు.

రాగి పాత్రల్లోని నీళ్లు తాగితే అది పొట్టలో కదలికలను (పెరిస్టాల్సిస్) నియంత్రించి జీర్ణవ్యవస్థను కుదుటపరుస్తుంది. అలాగే పేగుల్లో అల్సర్లు రాకుండా ఆపుతుంది. శరీరంపై మచ్చలను తొలగించడమేకాక, గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. లోహం అనేది క్షారగుణం కలిగి ఉంటుంది కాబట్టి అసిడిటీని తగ్గిస్తుంది. కొవ్వును కరిగించడంలో రాగి కీలక పాత్ర పోషించి మనం అధిక బరువును పెంచుకోకుండా కాపాడుతుంది. దీంతో ఊబకాయం సమస్యకు నివారణ ఉంటుంది. కొవ్వును నియంత్రించి, రక్తాన్ని శుద్ధిచేస్తుంది కాబట్టి గుండెపోటు వచ్చే అవకాశాన్ని రాగి పాత్రల్లో నీరు తాగడం ద్వారా తగ్గిం చుకోవచ్చు. నొప్పి, మంట తగ్గించే గుణాలు రాగిలో ఉన్నాయి. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.

శరీరంలో మెలనిన్ కారణంగా మన చర్మం రంగు నిర్ధారణ అవడమే కాక, అది అసలు మరీ తక్కువగా ఉంటే.. కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. రాగి కారణంగా అవసరమైనంత మెలనిన్ ఉత్పత్తి అవుతుంది. రాగి పాత్రల్లోని నీరు తాగడం వలన రక్తహీనత అదుపులో ఉంటుంది.