రవిశాస్త్రికి సంకటం..!

Indian cricket board fires on coach Ravi Shastri

ముంబయి: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా ఘోర వైఫల్యం ప్రధాన కోచ్ రవిశాస్త్రి మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా వన్డే, టెస్టు సిరీస్‌లను కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై భారత క్రికెట్ బోర్డు పాలక మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. జట్టు పేలవ ప్రదర్శనపై ప్రధాన కోచ్ రవిశాస్త్రి నుంచి నివేదిక కోరాలని పాలక మండలి నిర్ణయించినట్టు తెలిసింది. రవిశాస్త్రి కోచ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా వరుస విజయాలు సాధించింది. అయితే ఇంగ్లండ్ గడ్డపై మాత్రం భారత్ పేలవమైన ఆటతో నిరాశ పరిచింది. గెలిచే మ్యాచుల్లో కూడా అవమానకర రీతిలో ఓటమి పాలైంది. దీనిపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జట్టు వైఫల్యాలపై కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రధాన రవిశాస్త్రి, సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌లను విచారించాలని పాలక మండలి నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. ఇదే జరిగితే వీరంత విచారణకు హాజరు కాక తప్పదు. ఈ నేపథ్యంలో ప్రధాన కోచ్ రవిశాస్త్రికి ఇబ్బందికర పరిస్థితులు తప్పక పోవచ్చు. ఇప్పటికే రవిశాస్త్రిపై మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. జట్టులో క్రమశిక్షణ లోపించిందని, దీనికి కోచ్ అనుసరించిన విధానాలే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో కోచ్ విఫలమయ్యాడని టీమిండియా మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, గంగూలీ ఇప్పటికే విమర్శలు చేశారు. కాగా, భారత బోర్డు కూడా ప్రధాన కోచ్‌పై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో రవిశాస్త్రికి సంకట పరిస్థితి నెలకొందనే చెప్పాలి.