రచ్చకెక్కిన మున్సిపల్ రాజకీయం

8 councilors who have been awarded to the JC

బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం
జెసికి తీర్మాణాన్ని అందజేసిన 8 మంది కౌన్సిలర్‌లు
అధికార పార్టీలోనే గూడుకట్టిన అసమ్మతి
అంతుపట్టని టిఆర్‌ఎస్ అధిష్టాన అంతరంగం
అవిశ్వాసానికి ముందే రహస్య శిబిరాలు
సఫలీకృతమైన క్యాంపు రాజకీయాలు
వైరల్‌గా మారిన కౌన్సిలర్ కుమార్తెకు ఎంఎల్‌ఏ వార్నింగ్

మన తెలంగాణ/మంచిర్యాల: బెల్లంపల్లి మున్సిపల్ రాజకీయాలు రచ్చకెక్కాయి. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ పసుల సునీతారాణిపై అవిశ్వాస తీర్మాణం పెట్టారు. అధికార పార్టీ కౌన్సిలర్‌లతో పాటు కాంగ్రెస్, బిజెపి, సిపిఐ స్వతంత్ర కౌన్సిలర్‌లు గురువారం జాయింట్ కలెక్టర్ సురేందర్‌రావుకు తీర్మాణం ప్రతిని అందజేశారు. గత కొన్ని రోజులుగా మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు రహస్య శిబిరాలు, క్యాంపు రాజకీయాలు నడుపుతున్నప్పటికీ టిఆర్‌ఎస్ అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది. అధికార పార్టీలోనే అసమ్మతి గూడు కట్టుకోగా విపక్ష పార్టీలకు చెందిన కౌన్సిలర్‌లు వీరి మద్దతు పొందేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మెజార్టీ కలిగి ఉన్న అధికార పార్టీ కౌన్సిలర్‌లు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా విపక్షాలతో చేతులు కలుపడం వారికి మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 34 మంది కౌన్సిలర్‌లలో టిఆర్‌ఎస్ కౌన్సిలర్‌లతో కలిపి మొత్తం 29 మంది బలగం కూడకట్టుకొని రహస్య శిబిరాలు నిర్వహించడం ఆపై అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టడం విస్మయానికి గురి చేస్తుంది. అసమ్మతి కౌన్సిలర్ స్వరూపకు, మున్సిపల్ చైర్‌పర్సన్ సునీతారాణికి మధ్య గత కొంత కాలంగా వివాదాలు జరుగుతున్నాయి. ప్రతీ మున్సిపల్ సమావేశంలో గందరగోళాన్ని సృష్టించడం కుర్చీలను విరగ్గొట్టడం ఆనవాయితీగా మారింది. మున్సిపల్ సమావేశాల్లో పెద్ద ఎత్తున గొడవలు జరిగినప్పటికీ కూడా టిఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చైర్‌పర్సన్‌గా సునీతారాణి పదవీ బాధ్యతలు చేపట్టిన ఈనెల 3 నాటికి 4 సంవత్సరాలు పూర్తి కాగా గత 6 నెలల కాలంగా అసమ్మతి కౌన్సిలర్‌లు అదను కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు 12 రోజుల పాటు రహస్య ప్రాంతాల్లో క్యాంపులను నిర్వహించి గురువారం నేరుగా జాయింట్ కలెక్టర్‌ను కలసి ఈ అవిశ్వాస తీర్మాణ ప్రతిని అందజేశారు. 29 మంది కౌన్సిలర్‌లు చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు య త్నిస్తున్నప్పటికి ఎంపి, ఎంఎల్‌ఏలు, టిఆర్‌ఎస్ జిల్లా నాయకత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నా యి. ఇదిలా ఉండగా 34వ వార్డు కౌన్సిలర్ సత్యవతి కుమార్తెతో ఎంఎల్‌ఏ దుర్గం చిన్నయ్య ఫోన్‌లో మాట్లాడిన విషయం ఆడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెదిరింపులకు గురిచేసే విధంగా సాగిన ప్రసంగాలు వివాద స్పదంగా మారాయి.

అసమ్మతి నేతపై కేసు నమోదు
బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ పసుల సునీతారాణిపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టడంలో కీలకపాత్ర పోషించిన మునిమంద రమేష్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఎస్‌హెచ్‌ఓ రాజు తెలిపారు. పట్టణంలోని 18వ వార్డు కౌన్సిలర్ లింగంపల్లి రాములును కిడ్నాప్ చేసినట్లు రాములు కుమారుడు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై మునిమంద రమేష్ మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేక బెల్లంపల్లి ఎంఎల్‌ఏ దుర్గం చిన్నయ్య తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు.

త్వరలోనే ప్రత్యేక సమావేశం
బెల్లంపల్లి మున్సిపల్‌కు చెందిన 8 మంది కౌన్సిలర్‌లు చైర్‌పర్సన్ సునీతారాణిపై అందజేసిన అవిశ్వాస తీర్మాణానికి స్పందించి జాయింట్ కలెక్టర్ సురేందర్‌రావు త్వరలోనే ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. లేఖను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ త్వరలోనే తేదీని ఖరారు చేస్తామని, ఇందు కోసం సమర్థుడైన అధికారిని నియమిస్తామన్నారు. ఈ ప్రత్యేక సమావేశానికి అసమ్మతి, సమ్మతి కౌన్సిలర్‌లకు ఆహ్వానం పంపిస్తామన్నారు. ఈ ప్రక్రియను సజావుగా కొనసాగించుటకు ప్రభుత్వ అధికారులు ముందుగానే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారని పేర్కొన్నారు.

Comments

comments