యువతను ఆకట్టుకుంటున్న ఎల్‌ఇడి టీ షర్ట్

అమ్మాయిలతో సమానంగా మేము కూడా వెరైటీ దుస్తులను ధరించాలని మగపిల్లలు చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎంతైనా ఆడపిల్లలకు ఉన్నన్ని మోడల్స్ మగపిల్లలకు ఉండవు. అటువంటివారి కోసం ఆలోచించి తయారుచేసినవే  ఎల్‌ఎడి టీ షర్టులు. మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన దంపతులకు వచ్చిన ఐడియా ఇది.  ఆర్థికంగా  ఎన్నో  ఇబ్బందులెదుర్కొని రూపొందించారు ఎల్‌ఇడి టీ షర్టులు. ఇప్పుడు ఇంకా వాటికి సృజనాత్మక జోడించి మరెన్నో టీషర్టులను రూపొందిస్తూ దేశవిదేశాల్లోని యువతకు చేరువవుతున్నారు. భర్త సహకారంతో బ్రాడ్‌కాస్ట్ వేరబుల్ […]

అమ్మాయిలతో సమానంగా మేము కూడా వెరైటీ దుస్తులను ధరించాలని మగపిల్లలు చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎంతైనా ఆడపిల్లలకు ఉన్నన్ని మోడల్స్ మగపిల్లలకు ఉండవు. అటువంటివారి కోసం ఆలోచించి తయారుచేసినవే  ఎల్‌ఎడి టీ షర్టులు. మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన దంపతులకు వచ్చిన ఐడియా ఇది.  ఆర్థికంగా  ఎన్నో  ఇబ్బందులెదుర్కొని రూపొందించారు ఎల్‌ఇడి టీ షర్టులు. ఇప్పుడు ఇంకా వాటికి సృజనాత్మక జోడించి మరెన్నో టీషర్టులను రూపొందిస్తూ దేశవిదేశాల్లోని యువతకు చేరువవుతున్నారు. భర్త సహకారంతో బ్రాడ్‌కాస్ట్ వేరబుల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సంస్థని ప్రారంభించింది మహాలక్ష్మీ నాగుబండి. మరి వారు తయారుచేస్తున్న టీ షర్టుల  గురించి తెలుసుకుందాం..

నగరానికి చెందిన మహాలక్ష్మి నేచురోపతి కోర్సు చదివింది. కొంత కాలం అపోలోలో పనిచేసింది. భర్త అయ్యప్పతో కలిసి ఒక కన్సెల్టెన్సీ సంస్థను నిర్వహించింది. దాంట్లో నష్టాన్ని చవిచూశారు. దానినుంచి కోలుకోవడానికి చాలా కష్టపడ్డారు. కొంతకాలానికి బాబు పుట్టి స్కూలుకు వెళ్లాక కాస్త ఇంట్లో తీరిక సమయం దొరికి భార్యాభర్తలు కలిసి పనిచేయడం ప్రారంభించారు. అప్పుడే ఈ టీ షర్టుల ఆలోచన వచ్చింది. భవిష్యత్తులో తినే గ్లాసులు తయారుచేద్దామని ప్లాను వేసుకుంటున్నారు.

ఒకరోజు దుస్తులు కొనేటప్పుడు మా అబ్బాయికి ఏవైనా కొత్తగా తీసుకోవాలనిపించింది. అమ్మాయిలకైతే రకరకాల దుస్తులు నచ్చిన డిజైన్స్‌తో చేయించుకునే వీలు ఉంటుంది. అబ్బాయిలకు అలా ఉండదు. అదే విషయాన్ని భర్తతో చెపితే ‘ ‘నిజమే… ఇంత వరకూ ఎవరూ చేయనిదీ, కొత్తగా అనిపించేది ఏదైనా ప్రయత్నిద్దాం’ అన్నారు. ఆ స్ఫూర్తితోనే ఇద్దరికీ ఎల్‌ఈడీ టీషర్టుల ఆలోచన వచ్చింది.

ఇంట్లోనే అనేక రకాల ప్రయోగాలు చేశారు. భర్త సాఫ్ట్‌వేర్ నేపథ్యం వల్ల ఈ షర్ట్‌లు చేయటం సులువయింది. టీషర్ట్‌కి ప్యానల్‌ని జతచేసి పడిపోకుండా మరో వస్త్రాన్ని అతికిస్తున్నారు. 500 ఎమ్‌ఏహెచ్ రీఛార్జబుల్ బ్యాటరీ సాయంతో ఎల్‌ఈడీ లైట్లు వెలుగుతాయి. దానికి అనుసంధానించే కండెక్టివ్ వైర్‌తో ఇబ్బంది కలగకుండా టీషర్టులో కలిసిపోయేలా ఉంటాయి. ఈ లైట్లను యాప్‌తో అనుసంధానం చేస్తున్నారు. ఇందుకోసం సాఫ్ట్‌వేర్, ఎంబెడెడ్, యానిమేషన్ వంటి రంగాలకు చెందిన నిపుణుల సాయంతో ఈ పని చేస్తున్నారు. ముందరే నిపుణులైన వారిని నియమించుకుని ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
ఆదాయం లేకపోయినా బ్రాడ్‌కాస్ట్ వేరబుల్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థకి ఇరవై లక్షల రూపాయల్ని పెట్టుబడిగా పెట్టారు. ఏదిఏమైతేనేం ఇప్పటికి ఐదు రకాల లెటెస్ట్ మోడళ్ల టీషర్టులను తయారు చేసి మార్కెట్‌లోకి తెచ్చారు. ఇంకా కొత్త రకాల కోసం సాఫ్ట్‌వేర్ ఫీచర్లు అందుబాటులో తీసుకువస్తున్నారు.

చిన్నారుల నుంచీ పాతికేళ్ల లోపు వారు వీటిని ఎక్కువగా కోరుకుంటున్నారు. అమ్మాయిలూ, అబ్బాయిలకు, ఇద్దరికీ ఉపయోగించేట్లుగా ఈ టీషర్టులు రూపొందిస్తున్నారు. కుర్తీలూ వెరైటీగా చేస్తున్నారు. పుట్టినరోజూ, ప్రేమికుల రోజు వంటి ప్రత్యేకమైన సందర్భాలలో వీటిని బహుమతులుగానూ, రిటర్న్ గిఫ్ట్‌గానూ ఆర్డర్స్‌లో ఇస్తున్నారు. కుటుంబంలోని సభ్యులు అందరూ కలిసి కూడా ఈ షర్ట్‌లు చేయించుకుంటున్నారు. హైదరాబాద్‌తోపాటు ముంబయి, నోయిడా, దిల్లీ, కోల్‌కతా, చెన్నై వంటి ప్రాంతాలనుంచే కాదు… అమెరికా, పోలండ్ లండన్, సౌదీ, సింగపూర్, మలేషియా వంటి దేశాల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయి. హిందూస్థాన్ లీవర్, సన్‌ఫార్మా, క్యాస్ట్రాల్, బీఅర్డో, పీడబ్ల్యూసీ.. వంటి పెద్ద సంస్థలు కూడా వీటిని తయారు చేయించుకుంటున్నారు. వీటి ధర పన్నెండు వందల నుంచీ మొదలవుతుంది. వాటిలోని ఫీచర్లను బట్టి వాటి ధర చెబుతున్నారు.

ఇవి తీసుకున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు మహాలక్ష్మీ. ఇవి ధరించిన తరువాత కేవలం చేత్తోనే ఉతకాలి. షాక్ కొట్టడం, వైర్లు శరీరానికి తగలడం వంటివేం ఉండవు. వాషింగ్ మెషీన్‌లో వేస్తే ఎల్‌ఈడీ ప్యానెల్ పాడవుతుంది. చేతి గడియారంలో మాదిరి సెల్ లేదంటే ఫోన్‌లో ఛార్జబుల్.. ఇలా ఏది కావాలంటే అదే అమరిక చేసి ఇస్తారు. ఆన్‌లైన్‌లో కావలసిన రంగు, కొలతలు చెబితే వాటిని తయారుచేసి ఇంటికే టీషర్టులను పంపిస్తున్నారు.

టీషర్ట్‌లో మూడు రకాలు ఉన్నాయి. ఇవి కావాలనుకునేవారు …
మొదటగా ఫోన్‌లో ఆ సంస్థ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తరువాత టీ షర్ట్ మీదున్న కోడ్ సాయంతో పెయిర్ చేసుకోవాలి. బ్లూటూత్ మాదిరి రెండింటినీ అనుసంధానించాక తెరమీద మనం ఏమి రాయాలనుకున్నామో అది రాసుకోవచ్చు. ఇంకా యానిమేషన్ తరహాలో బొమ్మలు గీసుకోవచ్చు, ఫోన్‌లో మాదిరి ఎమోజీలూ, గుర్తులూ, సంకేతాలు డిస్‌ప్లే చేయొచ్చు. పైగా రాసుకున్నవన్నీ యాప్‌లో ఫొటోగ్యాలరీలో దాచుకోవచ్చు. మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. దీనిలోనే మరో ఆప్షన్ ధ్వని తరంగాల రూపంలో కనిపిస్తుంది.

రెండవ రకం ఫిట్‌నెస్ టీషర్టులు. వీటిని వేసుకుంటే ఎన్ని మెట్లు ఎక్కాం, ఎన్ని అడుగులు వేశాం… ఖర్చయిన కెలరీల వివరాలు ఫోనులో కనిపిస్తాయి. నెల రోజుల సమాచారం ఫోనులో నిక్షిప్తమై ఉంటుంది.
మూడవ రకం సైకిల్ జెర్సీ టీషర్టు. వీటిని ఫోన్‌కి అనుసంధానం చేస్తే వారు ఎటువైపు వెళ్తున్నారో టీషర్ట్‌పై ఎరుపు రంగులో ఇండికేటర్స్ కనిపిస్తాయి. వాహనరద్దీలో సైకిల్‌పై ప్రయాణించేటప్పుడు, చీకట్లో నడిపేటప్పుడు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.