మోహన్…వొక విలువైన వంతెన

Cartoon

బోలెడు రంగులు. వేలవేల గీతలు. ఆలోచింప చేసేవి. ప్రశ్నించేవి. నిలదీసేవి. నవ్వించేవి. పేజీలు పేజీలు నింపినా చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పామా లేదా అదే సంశయంతోనే వుంటామా.. వొకటో రెండో మూడో ఆరో స్ట్రోక్స్… అంతే మొత్తం విషయం పాఠకుల మస్తిష్కంలోకి చేరిపోతుంది. తప్పించుకునే వీలే వుండదు. ప్రజల పక్షాన లేనివాళ్లకి బలమైన ప్రశ్నలవి. పేరు మోహన్. రూపం మోహనం. ఆ గీతలేమో పదునైనవి. ధగధగ నిగ్గదీసి అడిగేవి. సందర్భాన్ని పట్టి యిచ్చేవి. సంశయాలని పటాపంచలు చేసేవి. వొక బల్ల. బల్లపై రంగులు. బ్రష్‌లు. బల్లకి అటుపక్క మోహన్‌గారు. యిటుపక్క కొందరు. వొక్కోసారి చుట్టూ, పసికళ్ల కూనపిల్లల్లాంటి అబ్బాయిలు, విశాల ప్రపంచాన్ని చూసిన గంభీర్యమైన చూపులున్న అబ్బాయిలు. విభ్రమతో చేసే ఆ చూపుల రంగుల రాట్నం చుట్టూ మన కళ్లు యెంతసేపు తిరిగినా అలిసిపోవు. వొక పుస్తకానికి ముఖ చిత్రమో, లోపలి బొమ్మలో, కార్టూన్ పోస్టర్స్ యేమైనా కావొచ్చు అవి ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజల కొరకు. మోహన్ గారిని నేను మొదట చూసినప్పుడు అటువంటి వ్యక్తి నా చిన్న ప్రపంచంలో వొక పెద్ద ఆశ్చర్యం. చిన్న నవ్వు నవ్విన వెలిగే చూపులు. మీసం చేతి వేలితో మెలివేయడం… సగం విరిగిన మాటలు. ఫుల్‌స్టాప్‌కి కామాకి ముందే ఆగే సంభాషణలు.

అతను చుట్టూ వున్న అనేక మంది అతనిలాగే మీసం చేతివేళ్లతో తిప్పాలనో, కనురెప్పలతో పాటు కనుబొమ్మలను ఎత్తి పైకి అతనిలాగే మాట్లాడాలని ప్రయత్నించడం, అతని పట్ల చాలా ఆకర్షితులైన అబ్బాయిలు యెందరో యెందరెందరో… అతని దగ్గర కొచ్చి విషయాలని అడిగేవాళ్లకి పంచడానికి అతనెప్పుడూ నిరాకరించడు. అతని చేతికి మనసుకి యెముకే లేనట్టు, నేర్చుకునేవాళ్లకి అతనెప్పుడూ గీతల విషయాన్ని చెబుతుండేవారు. వొక లైఫ్‌స్టెల్‌కి, వొక వర్క్ కల్చర్‌కి, సామాజిక స్పృహకి మోహన్‌గారొక ప్రతీక. అతని పని చూసినప్పుడు చుట్టూ వున్న పరిస్థితిని చూస్తే 1995-96 లలో డి.టి.పి లేవు. కంప్యూటర్‌లు లేవు. అంతకుముందు నుంచీ కూడా ఈ రంగంలో ఉన్న మోహన్‌గారు ఆఫీసులో బల్లమీద కూర్చుని బొమ్మ వేస్తే, ఆ బొమ్మ ప్రింట్‌కి వెళ్లేది. ఆ పద్ధతి నుంచి డిజిటల్ మీడియా వరకు చూసినవారు మోహన్‌గారు. 96-97 వచ్చేసరికి యానిమేషన్, డిజిటల్ టెక్నాలజీ వొకవైపు , వూళ్ల నుంచి నగరానికి యువతీ యువకుల వలస బాగా పెరిగింది. సాటిలైట్ చానల్స్ పెరిగాయి. ప్రింటింగ్‌లో చాలా మార్పులు వచ్చాయి.

కథనైనా, కవిత్వాన్నైనా, ఏ సాహిత్యాన్నైనా ప్రచురించుకోవాలంటే రచయితల ఇన్‌వాల్వ్‌మెంటు తక్కువుండేది. మొత్తం ప్రచురణకర్తలే చూసుకునేవారు. తర్వాతర్వాత మొత్తం ప్రింటుకు వెళ్లే వరకూ రచయితే పుస్తకాలని రూపుదిద్దుకోవడం మొదలైంది. ఆ సమయంలో మోహన్‌గారు అనేక పుస్తకాలకి ముఖచిత్రాలను, లోపలి బొమ్మలను అందించారు. కథా సంకలనాలు రాస్తే పత్రికకు పండటం లేదా రైటర్ పుణ్యమాంటూ ప్రింటింగ్ ప్రాసెస్ ఎక్కువ వుండేదికాదు. అలాగే బొమ్మలు వేసుకుంటూ ఆ టెక్నాలజీలో వచ్చిన మార్పులన్నింటినీ మోహన్‌గారు చాలా దగ్గరగా చూసారు. ఒక పత్రికాఫీసులో ఫ్రూఫ్ రీడర్‌ని చూసినవారు, ఆపని చెయ్యడం అనేదేలేని పత్రికాఫీసుల్ని మోహన్‌గారు చూశారు. చుట్టూ పరిస్థితుల్లో వచ్చే మార్పులు ఒక మోహన్‌గారిని క్రియేట్ చేస్తే, మోహన్‌గారు క్రియేట్ చేసిన అనేక మంది వ్యక్తులను బోల్డంత పని మనకు కనిపిస్తాయి. పెరుగుతోన్న నగరీకరణ మోహన్‌గారి చుట్టూ కనిపించేది. ఒక మనిషి జీవితాన్ని చూసినప్పుడు సాధారణంగా ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తాము. ఆ వ్యక్తి సంచరించిన , నిలిచిన సమయము, సందర్భాలనే పరిశీలిస్తే మోహన్‌గారు యుగ సంధిలో ఉన్న మనిషి. వార్తలో నేను మైదానం రాస్తున్న కాలంలో మోహన్‌గారు రెగ్యులర్‌గా ఆ కాలం చదివే వారు. మోహన్‌గారు తరచుగా ఏమనేవారంటే ‘నాకెప్పుడో కానీ ఎవర్నయినా ఇమిటేట్ చేస్తూ రాయాలనిపించదు. కానీ మీ కాలమ్‌ని ఇమిటేట్ చేస్తూ రాయాలని వుందబ్బా’ అనేవారు. నాకు భలే సరదాగా ఉండేది ఆ రచన చూడాలని. కానీ అతనెప్పుడూ రాయలేదు. యిప్పుడు యీ సందర్భంలో ఆ మాటలు గుర్తు తెచ్చుకొంటే మోహన్ తన తరానికి నా తరానికి మధ్య ఆ మాటల ద్వారా యెలా వంతెన వేసారో అర్థం అవుతుంది. ప్రతి మనిషి వొక వంతెనే. తరానికి తరానికి మధ్యన భాషకి భాషకి మధ్యన నగరానికి నగరానికి మధ్యన.

-కుప్పిలి పద్మ, kuppilipadma@gmail.com 

Comments

comments